Food

సజ్జలతో బోలెడు వంటకాలు

Sajjalu Recipes In Telugu - Easy Short And Fast

ఇప్పుడంతా వాణిజ్యపంటలు వేస్తున్నారు కానీ.. ఒకప్పుడు తెలంగాణ అంటే చిరుధాన్యాలు, తృణధాన్యాలకు పుట్టినిల్లు. వాణిజ్య పంటలు, వరి వచ్చిన తరువాత వాటి వాడకం తగ్గిపోయింది. ఆరోగ్యరీత్యా ఇప్పుడు మళ్లీ చిరుధాన్యాల వాడకం మొదలయింది. అందులో సజ్జలు ఎంతో శ్రేష్టం. చాలా చలువ చేస్తాయి. ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల సజ్జలతో చేసిన వంటకాలు తినడం వల్ల… పొట్ట నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకు పర్ఫెక్ట్‌ ఛాయిస్‌. ఇంకెందుకాలస్యం సజ్జలతో ఈస్పెెషల్స్‌ మీరూ ప్రయత్నించండి.

సజ్జ హల్వా
కావల్సిన పదార్థాలు:
సజ్జపిండి – ఒక కప్పు, బెల్లం – ఒక కప్పు, నెయ్యి-అరగ్లాసు, యాలకుల పొడి-అరస్పూను, జీడిపప్పు, కిస్మిస్‌, బాదం పప్పు-సరిపడా
తయారీ విధానం :
స్టవ్‌ మీద పాన్‌ తీసుకుని అరగ్లాసు నెయ్యి వేయాలి. కాగిన తరువాత జీడిపప్పు, కిస్‌మిస్‌, బాదంపప్పు, వేయించి పక్కనపెట్టుకోవాలి. తరువాత ఒక గ్లాసు పిండిని వేసి దోరగా వేయించుకోవాలి. సజ్జపిండి వేగుతుండగా, మరోపక్కన స్టవ్‌ మీద గ్లాసు పిండికి మూడు గ్లాసుల నీళ్లు నపోసి… బెల్లం వేసి బాగా కరగనివ్వాలి. బెల్లం నీళ్లు బాగా కాగాక.. వేగుతున్న సజ్జపిండిలో ఆ నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తరవాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌ వేసి కలియబెట్టాలి. దీన్ని బాదంపప్పుతో అలంకరించి సర్వ్‌ చేసుకోవాలి.
సజ్జ వడలు
కావల్సిన పదార్థాలు:
సజ్జ పిండి – 1 1/2 కప్పు, కారం – 1 టేబుల్‌ స్పూన్‌, పసుపు – 1/2 టేబుల్‌ స్పూన్‌, కొత్తిమీర పొడి – 1 టేబుల్‌ స్పూన్‌, నువ్వులు – 1 టేబుల్‌ స్పూన్‌, నూనె – 2 కప్పులు, కొత్తిమీర ఆకులు – 1 కప్పు, పెరుగు – 1 టేబుల్‌ స్పూన్‌, ఉప్పు – తగినంత, నీరు – కప్పు
తయారీ విధానం:
సజ్జ పిండిని ఒక గిన్నెలో వేసుకొని అందులో కారం, పసుపు, కొత్తిమీర పొడి, నువ్వులు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని డిస్క్‌ ఆకారంలో వడల్లాగా వత్తుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి వడలను వేయించుకోవాలి.

బిర్యానీ
కావల్సిన పదార్థాలు:
సజ్జ రవ్వ – 100గ్రా., ఉల్లిపాయలు – 15 గ్రా., పచ్చిమిర్చి – 5 గ్రా., పుదీనా – 5 గ్రా., కొత్తిమీర – 5 గ్రా., నెయ్యి లేదా నూనె – 5 గ్రా., జీడిపప్పు (అవసరమైతే) – 4, పలావు దినుసులు – 10 గ్రా., ఉప్పు – రుచికి సరిపడా, ఆలుగడ్డ – 20 గ్రా., క్యారెట్‌ – 15 గ్రా., అల్లం – 10 గ్రా., వెల్లుల్లి – 5 గ్రా.
తయారీ విధానం:
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, క్యారెట్‌, కొత్తిమీర, పుదీనాలను తరిగి పక్కనుంచాలి. మందపాటి గిన్నెలో నూనె పోసి పలావు దినుసులు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లి ముద్ద, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి 5 నిమిషాలు వేయించాలి. తరువాత కూరగాయల ముక్కలు వేసి మరో 5 నిమిషాలు వేగనిచ్చి రుచికి తగినంత ఉప్పువేసి 4 కప్పుల నీళ్ళుపోసి మరగనివ్వాలి. ఇప్పుడు నీళ్ళలో సజ్జ రవ్వ వేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి. చివర్లో పుదీనా, కొత్తిమీరలతో అలంకరించుకోవాలి.

సజ్జ, రాగి బిస్కెట్‌
కావల్సిన పదార్థాలు :
రాగి పిండి -కప్పు, గోధుమ పిండి -అర కప్పు, సజ్జ పిండి- పావు కప్పు, బాదాం, జీడిపప్పు పొడి -4స్పూన్లు, చక్కెర- తగినంత, యాలకులు-2, నెయ్యి -2 చెంచాలు, గుడ్డు- 1, అరటిపండు-1, నూనె -డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం :
రాగి పిండి, గోధుమ పిండి, సజ్జ పిండి, చక్కెర పొడి, బాదాం జీడిపప్పు పొడి, గుడ్డు లోని తెల్లసొన, అరటిపండు, నెయ్యి,యాలకులు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. చపాతీ చేసి గుండ్రంగా ఉన్న చిన్న మూతతో ప్రెస్‌ చేస్తే గుండ్రంగా వస్తాయి. కత్తితో రకరకాల ఆకారాల్లో కట్‌ చేసుకోవాలి. కాగిన నూనెలో వేయాలి. రెండు వైపులా కాల్చాలి. అంతే సజ్జ, రాగి బిస్కెట్స్‌ రెడీ!

సజ్జల కిచిడి
కావల్సిన పదార్థాలు :
సజ్జలు – 1/2 కప్పు, పెసరపప్పు – 1/2 కప్పు, నెయ్యి – 2 టీ స్పూన్‌, ఉప్పు – తగినంత, జీలకర్ర – 1టీ స్పూన్‌, ఇంగువ – కొంచెం, పసుపు – 1/4 టీ స్పూన్‌, ఉల్లిపాయలు, కొత్తిమీర అలంకరణకు
తయారీ విధానం:
సజ్జలు, పెసరపప్పు, ఉప్పు, నీరు సరిపడా కుక్కర్‌ లో వేసి ఉడకబెట్టి 4 విజిల్స్‌ వచ్చాక దించి ప్రక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్‌ తీసుకుని నెయ్యి వేసి జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి తాళింపు చేసుకుని అందులో ఉడకబెట్టుకున్న సజ్జలు, పెసరపప్పును వేసి కిచిడిలా చేసుకుని, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి గార్నిష్‌ చేసుకోవాలి.