వివాహ రిజిస్ట్రేషన్ ఇక చాలా సులభం! దంపతులు, సాక్షులు కేవలం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేస్తే చాలు వివాహ ధ్రువీకరణ పత్రం చేతికొస్తుంది. తెలంగాణలో ఇప్పటికే కొన్ని పంచాయతీల్లో మొదలైన ఈ విధానం త్వరలో మరింత విస్తృతం కాబోతోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కొత్త విధానంపై త్వరలో పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే యోచనలో ఉంది.వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంతవరకు సంక్లిష్టంగా ఉండేది. వధూవరులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి శుభ లేఖతో సహా తగిన ఆధారాలను చూపించాల్సి వచ్చేది. దీంతో పలువురు నమోదుకు వెనకడుగు వేసే వారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని వివాహాలను నమోదు చేసే విధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. అయినా..రాష్ట్రంలో చాలా ఏళ్లుగా నాలుగైదు పంచాయతీలకు కలిపి ఒక్కో కార్యదర్శి విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి పంచాయతీకి ఒకరు చొప్పున 12,751 గ్రామ పంచాయతీలకు కార్యదర్శులు అందుబాటులోకి రావటంతో ప్రభుత్వం వివాహాల నమోదుపై దృష్టి సారించింది. జనన, మరణాలతోపాటు వివాహాల రిజిస్టర్లనూ గ్రామ కార్యదర్శి నిర్వహించాలని పంచాయతీరాజ్ నూతన చట్టంలో నిర్దేశించింది. ఇటీవల కార్యదర్శులకు ఇచ్చిన మార్గదర్శకాల్లోనూ అదే విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో నమోదు ప్రక్రియ కాస్త వేగం పుంజుకుంది. ఈ ఏడాది ఇంతవరకు 6,932 వివాహాలు నమోదయ్యాయి. ‘‘వరంగల్ అర్బన్ జిల్లాలో అతి తక్కువగా ఆరు వివాహాలు మాత్రమే నమోదుకాగా..నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,032 దస్త్రాల్లోకెక్కాయి. పెళ్లిళ్ల వాస్తవ సంఖ్యతో పోల్చినప్పుడు నమోదైన వాటి సంఖ్య చాలా స్వల్పం. కొందరు కార్యదర్శులు ఈ అంశంపై బాగా దృష్టి సారిస్తుండగా..కొందరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతోంది’’ అని అధికారులు పేర్కొంటున్నారు. వివాహాల రిజిస్ట్రేషన్లపై అవగాహన పెంపొందించడంతోపాటు నమోదును మరింత పెంచేందుకు సంకల్పించిన సర్కారు వీటి పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు అప్పగించదలచింది. దంపతులకు పంచాయతీ కార్యదర్శి అందజేసే వివాహ ధ్రువీకరణ పత్రం, రిజిస్టర్లు తదితరాలను ఈ శాఖే సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయబోతోంది. కార్యదర్శులకు త్వరలో ఈ అంశంపై శిక్షణ ఇచ్చే యోచనలో ఉంది.
వివాహాల రిజిస్ట్రేషన్ ఇక అతి సులువు
Related tags :