Sports

సోషల్ మీడియాలో నోటికొచ్చింది కూస్తున్నారు

Pakistan Cricket Team Captain Sarfaraz Says Social Media Comments Hurts SelfConfidence

భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓటమిపై ఆ జట్టు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కెప్టెన్ సర్ఫరాజ్‌పై మరింత రెచ్చిపోయిన పాక్‌ అభిమానులు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల ఓ షాపింగ్‌మాల్‌లో తన కుమారుడితో ఉన్న అతడిని ఓ అభిమాని తీవ్ర పదజాలంతో దూషించడం కూడా నెట్టింట్లో వైరల్‌ అయింది. దీంతో ఎట్టకేలకు సర్ఫరాజ్‌ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవలింపు తప్పేమి కాదని. అది సాధారణ విషయమేనని పేర్కొన్నాడు. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియా, సోషల్‌ మీడియాకు కీలక ప్రాధాన్యముంది. వాటిని నియంత్రించలేం. గతంలోనూ ఓటమిపాలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్‌మీడియా వచ్చింది దాన్ని ఎవరూ ఆపలేరు. నోటికి ఏది తోస్తే అది రాసిపారేస్తున్నారు. దీనివల్ల ఆటగాళ్ల మానసికస్థైర్యం దెబ్బతింటుంది. మమ్మల్ని విమర్శించే హక్కు మీకుంది. అది తప్పుకాదు. కానీ వ్యక్తిగతంగా ఆటగాళ్లను దూషించడం సరైందికాదు. ఇలాంటి చర్యల వల్ల కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అభిమానులెంత భావోద్వేగంతో ఉంటారో తెలుసు. మేం గెలిస్తే మమ్మల్ని ఆకాశానికి ఎత్తుకుంటారు. ఓడిపోతే బాధపడతారు. కానీ మీకన్నా మేమే ఎక్కువ బాధపడతాం. మేం పాకిస్థాన్‌ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నాం’ అని సర్ఫరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు పూర్తిచేసుకున్న పాక్‌ మూడింటిలో ఓటమిపాలై ఇంగ్లాండ్‌పై ఒక్కటే విజయం సాధించింది. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. ఈ నేపథ్యంలో మూడు పాయింట్లతో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. సెమీస్‌కు చేరాలంటే ఆ జట్టు మిగతా నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. కాగా మరికొద్దిసేపట్లో దక్షిణాఫ్రికాతో ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో తలపడనుంది.