పాకిస్థాన్ ఆశలు సజీవం. భారత్ చేతిలో దారుణ పరాభవం నుంచి కోలుకున్న ఆ జట్టు.. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో సత్తా చాటింది. హారిస్ సోహైల్ మెరిసిన వేళ.. దక్షిణాఫ్రికాను అలవోకగా మట్టికరిపించింది. ఐదో ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా ఇక సాంకేతికంగా కూడా నాకౌట్ రేసులో లేదు. అఫ్గానిస్థాన్ కాకుండా ఇప్పటివరకు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన జట్టు అదొక్కటే. ఆరు మ్యాచ్‌ల్లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్న పాకిస్థాన్.. సెమీఫైనల్ ఆశలు నిలబెట్టుకుంది. ఆదివారం అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 49 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించింది. హారిస్ సోహైల్ (89; 59 బంతుల్లో 9×4, 3×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో మొదట పాకిస్థాన్ 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (69; 80 బంతుల్లో 7×4), ఇమాముల్ హక్ (44), ఫకర్ జమాన్ (44) కూడా రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా చతికిల పడింది. షాదాబ్ ఖాన్ (3/50), ఆమిర్ (2/49), వాహబ్ రియాజ్ (3/46) విజృంభించడంతో 9 వికెట్లకు 259 పరుగులే చేయగలిగింది. డుప్లెసిస్ (63; 79 బంతుల్లో 5×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హారిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికాకు ఇది ఐదో పరాజయం. ఆ జట్టు ఒక్క మ్యాచే నెగ్గింది. ఒకటి రద్దయింది.
ఓపెనర్ ఆమ్లా (2) రెండో ఓవర్లోనే ఔటైనా మరో ఓపెనర్ డికాక్ (47; 60 బంతుల్లో 3×4, 2×6), డుప్లెసిస్ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 91/1తో కాస్త మెరుగైన స్థితిలోనే నిలిచింది. కానీ ఒక్కసారి ఈ భాగస్వామ్యం విడిపోయాక ఇన్నింగ్స్ పూర్తిగా గతి తప్పింది. షాదాబ్ ఖాన్ దక్షిణాఫ్రికాను గట్టి దెబ్బతీశాడు. డికాక్‌ను ఔట్ చేయడం ద్వారా రెండో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీసిన అతడు.. కాసేపటికే మార్‌క్రమ్ (7)ను బౌల్డ్ చేశాడు. పాతుకుపోయిన డుప్లెసిస్‌ను 30వ ఓవర్లో ఆమిర్ ఔట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 136/4తో కష్టాల్లోకి కూరుకుపోయింది. డసెన్ (36; 47 బంతుల్లో 1×4, 1×6), మిల్లర్ (31; 37 బంతుల్లో 3×4) తడబడుతూ నిలిచినా.. సాధించాల్సిన రన్‌రేట్ బాగా పెరుగుతూ పోయింది. ఏ దశలోనూ దక్షిణాఫ్రికా గెలిచేలా కనపడలేదు. 40వ ఓవర్లో జట్టు స్కోరు 189 వద్ద డసెన్‌ను షాదాబ్, తర్వాతి ఓవర్లో మిల్లర్‌ను షహీన్ అఫ్రిది ఔట్ చేయడంతో ఆ జట్టులో ఏ మూలో ఉన్న ఆశలు కాస్తా ఆవిరయ్యాయి. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓటమి లాంఛనమే. మిగతా ఆట కేవలం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే. ఫెలుక్వాయో (46 నాటౌట్; 32 బంతుల్లో 6×4) బ్యాట్ ఝుళిపించాడు.
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో హారిస్ సోహైల్ ఆటే హైలైట్. ఇంకొందరు బ్యాట్స్‌మెన్ రాణించినా పాక్ 300 దాటిందంటే కారణం హారిస్ మెరుపులే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు ఇమాముల్ హక్, ఫకర్ జమాన్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు 15 ఓవర్ల లోపే 81 పరుగులు జోడించారు. అయితే తాహిర్ (2/41) ధాటికి ఇద్దరూ కొన్ని పరుగుల తేడాలో ఔటయ్యారు. హఫీజ్ (20)ను మార్‌క్రమ్ ఎక్కువసేపు నిలువనివ్వలేదు. దీంతో పాక్ 30 ఓవర్లలో 143/3తో నిలిచింది. అజామ్‌కు ఆ దశలో హారిస్ సోహైల్ తోడయ్యాడు. నాలుగో వికెట్‌కు 81 పరుగులు జోడించిన అజామ్ 42వ ఓవర్లో ఔటైనా.. హారిస్ జోరు కొనసాగించాడు.ఇమాద్ వసీమ్ (23)తో కలిసి మరో విలువైన భాగస్వామ్యాన్ని (71) నెలకొల్పాడు. హారిస్ జోరుతో చివరి 10 ఓవర్లలో పాకిస్థాన్ 91 పరుగులు పిండుకుంది.
ఈసారి ప్రపంచకప్ ఆరంభానికి ముందు దక్షిణాఫ్రికాపై ఒకప్పటిలా పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ జట్టు మరీ తీసికట్టుగా ఏమీ లేదు. రబాడ, డుప్లెసిస్, డికాక్, ఆమ్లా లాంటి ఆటగాళ్లతో ఉన్న దక్షిణాఫ్రికా.. కప్పు గెలవకపోయినా సెమీస్‌కు గట్టి పోటీదారుగానే ఉంటుందని అనుకున్నారు. కానీ ఆ జట్టు దారుణమైన ప్రదర్శనతో చాలా ముందే రేసు నుంచి నిష్క్రమించింది. ఆరుకు ఆరు మ్యాచ్‌ల్లో ఓడిన అఫ్గానిస్థాన్ ముందుగా సెమీస్‌కు దూరం అయితే.. ఆ తర్వాత నాకౌట్‌కు దూరమయ్యే జట్టు శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌ల్లో ఒకటవుతుందని అనుకుంటే.. ఆ స్థానంలోకి దక్షిణాఫ్రికా రావడం అనూహ్యం. బంగ్లాదేశ్ చేతిలో ఓడటమే ఆ జట్టు పతనానికి సూచిక. పాకిస్థాన్ కూడా అలవోకగా సఫారీల్ని ఓడించేసింది. సెమీస్ అవకాశాలు సంక్లిష్టమవుతున్న దశలో కూడా సఫారీ జట్టులో పట్టుదల, పోరాట పటిమ కనిపించలేదు. సాదాసీదా ఆటతో అభిమానుల ఆశల్ని పూర్తిగా నీరుగార్చేసింది. సెమీస్ అవకాశాలే లేకపోయినా అఫ్గాన్.. భారత్‌పై గొప్పగా పోరాడి శభాష్ అనిపిస్తే.. కాస్తో కూస్తో అవకాశాలున్న దక్షిణాఫ్రికా పాక్‌పై ఆడిన తీరు ఆ జట్టు అభిమానులకు వేదన మిగిల్చేదే. పోరాట యోధులుగా పేరున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లు మరీ ఇంత తీసికట్టుగా ఆడటం దారుణం. ఈ ఆట చూస్తే దక్షిణాఫ్రికా మున్ముందు పెద్ద పతనమే చూడబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.