ScienceAndTech

అమెరికా నుండి ఆపరేషన్ ఎటాక్ ఇరాన్

USA Starts Cyber Attacks On Iran

ఇరాన్‌ సైనిక కంప్యూటర్‌ వ్యవస్థలపై అమెరికా సైన్యం సైబర్‌ దాడులు చేపట్టింది. తమ నిఘా డ్రోన్‌ను కూల్చివేసిన ఇరాన్‌పై క్షిపణి దాడికి తొలుత సిద్ధపడి, చివరి నిమిషంలో ఆగిపోయిన నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుమతితోనే సైబర్‌ దాడులు జరిగాయి. పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని కొందరు అధికారుల కథనం ప్రకారం.. కొన్ని వారాలుగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ దాడుల కోసం అమెరికా ఒక అత్యవసర ప్రణాళికను రూపొందించింది. దాని ప్రకారం ఇరాన్‌ దేశ రాకెట్‌, క్షిపణి లాంచర్లను నియంత్రించే కంప్యూటర్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. నిర్దిష్టంగా ఇరాన్‌ సైన్యంలోని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళ కంప్యూటర్లను లక్ష్యంగా చేసుకుంది. సైబర్‌ యుద్ధంలో అమెరికా సాధించిన పట్టును, మరింత దూకుడుగా ఆ మార్గంలో దాడుల కోసం ట్రంప్‌ హయాంలో రూపొందించిన వ్యూహానికి ఇది దర్పణం పడుతోంది. ఏడాదిగా అమెరికా అధికారులు తమ శత్రువులను ఎక్కువగా సైబర్‌ రంగంలోనే లక్ష్యంగా చేసుకున్నారు. మరింత జోరుగా ఆపరేషన్లు చేపట్టారు. ఈ సైబర్‌ దాడుల అంశంపై ఇరాన్‌ స్పందించలేదు. అయితే ‘స్టక్స్‌నెట్‌ కంప్యూటర్‌ వైరస్‌’ ఘటన తర్వాత ఇరాన్‌ తన మౌలిక వసతుల్లో చాలా భాగాన్ని ఇంటర్నెట్‌ నుంచి వేరు చేసింది. అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా సృష్టించినట్లు భావిస్తున్న ఆ వైరస్‌ వల్ల దాదాపు పదేళ్ల కిందట ఇరాన్‌లోని వేలాది సెంట్రిఫ్యూజ్‌లు మొరాయించాయి. ఇరాన్‌ ప్రభుత్వం కోసం పనిచేస్తున్నట్లుగా భావిస్తున్న కొందరు హ్యాకర్లు కొన్ని వారాలుగా అమెరికా ప్రభుత్వంలోని ఆర్థిక, చమురు, గ్యాస్‌ వంటి రంగాలకు చెందిన సంస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. హానికర ఈ-మెయిళ్లను పంపడం వంటివి చేసినట్లు క్రౌడ్‌స్ట్రైక్‌, ఫైర్‌ ఐ వంటి సైబర్‌ భద్రతా కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. తాము చూపుతున్న దూరదృష్టిని, విచక్షణను బలహీనతగా పొరపాటు పడవద్దని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్‌ బోల్టన్‌ ఇరాన్‌ను హెచ్చరించారు. ‘‘మధ్య ప్రాచ్యంలో వేటాడేందుకు ఎవరూ ఆ దేశానికి లైసెన్సు ఇవ్వలేదు. మా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినట్లు మా సైన్యం పునరుత్తేజం పొంది, దాడికి సర్వసన్నద్ధంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ఎప్పుడైనా దాడి చేసే స్వేచ్ఛ అమెరికాకు ఉందన్నారు. ఇరాన్‌పై మరో విడత ఆంక్షలను సోమవారం ప్రకటించే అవకాశం ఉందని చెప్పారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికాకు ఇరాన్‌ మరోసారి హెచ్చరిక చేసింది. తమతో యుద్ధానికి దిగితే అది అదుపు తప్పిపోతుందని, ఈ ప్రాంతం మొత్తం దాని పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా బలగాల ప్రాణాలను అవి ప్రమాదంలో పడేస్తాయని ఇరాన్‌ సైనిక ఉన్నతాధికారి మేజర్‌ జనరల్‌ రషీద్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన సైన్యంలోని శక్తిమంతమైన రివల్యూషనరీ గార్డ్‌ దళ రాడార్‌, క్షిపణి వ్యవస్థల కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా సైనికుల ప్రాణాలను రక్షించుకునేందుకు అక్కడి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు. మరోవైపు ఇరాన్‌ పార్లమెంటు సమావేశంలోనూ ఎంపీలు ఇదే రీతిలో మాట్లాడారు. ‘అమెరికాకు మరణం’ అంటూ నినాదాలు చేశారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల సమస్యలను ఎదుర్కోవడానికి ఇరాన్‌ భారత్‌ సహా పలు దేశాలతో నగదు ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆయా దేశాలతో చర్చలు జరుపుతున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావెద్‌ జరీఫ్‌ చెప్పారు.