Agriculture

ఆంధ్రా రైతులకు కౌలురుణాల కష్టాలు

Andhra Contract Farmers Still Face Troubles For Loans From Banks

జిల్లాలోని సాగుదారుల్లో 70 శాతం వరకు కౌలు రైతులున్నారు. సొంత పొలంతోపాటు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వారు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఉన్న 8.40 లక్షల్లో 5 లక్షల కమతాలను వారే పండిస్తున్నారని వ్యవసాయ శాఖ చెబుతోంది. అలాంటి వారికి ఏటా రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యం విధిస్తున్నా ఆచరణలో ఆశించిన ఫలితాలు రావడం లేదు. దీంతో ఈసారి బ్యాంకర్లతో సమీక్షించిన జిల్లా పాలనాధికారి మొత్తం పంట రుణాల్లో కౌలు రైతులకు పది శాతం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా బ్యాంకర్లు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గతేడాది రూ.158 కోట్లను కౌలు రైతులకు పంపిణీ చేశారు. జిల్లాలో మొత్తం పంట రుణాలు రూ.11 వేలు కోట్లు కాగా కనీసం రూ.1000 కోట్లయినా వారికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎల్‌బీసీ) సైతం పది శాతం రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు దిశానిర్దేశం చేసింది. ఈ ఏడాది 40 వేల మందికి రుణ అర్హత కార్డులు(ఎల్‌ఈసీ) ఇవ్వాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. ఆ తర్వాత రుణాలు విరివిగా ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో మరిన్ని ఎల్‌ఈసీలు జారీ చేయాలని క్షేత్రస్థాయి రెవెన్యూ, వ్యవసాయ యంత్రాంగానికి సూచించగా ఇప్పటికే లక్ష్యం దాటి మంజూరయ్యాయి. వీటి సంఖ్య మరింత పెరుగుతుందని వ్యవసాయవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 52 వేల కార్డులు ఇవ్వగా వీటితోపాటు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు కౌలు రైతులకు అందించనున్నారు. జిల్లాలో కౌలు రైతులకు ఏటా ఇస్తున్న రుణాల్లో తిరిగి చెల్లించే వారి శాతం ఏటికేడు తగ్గిపోతోంది. భూ యజమానులకు ఇచ్చే రుణాల్లో 22 శాతం సకాలంలో తిరిగి చెల్లింపులకు నోచడం లేదు. అలాగే 8 శాతం బకాయిలుగా మిగిలిపోతున్నాయి. అదే కౌలు రైతులకు వచ్చేసరికి 35 శాతం రుణాలు ఏడాది పూర్తయినా తిరిగి చెల్లించడం లేదు. దీంతోపాటు తీసుకున్న రుణాల్లో 20 శాతం తిరిగి బ్యాంకులకు చెల్లించడం లేదు. కౌలు రైతులకు ఇచ్చిన రుణాల్లో బకాయిలు పెరిగిపోవడంతో బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. ఎల్‌ఈసీలు ఏడాది కాలవ్యవధితో మంజూరు చేస్తుండటం, ఏటికేడు కౌలు రైతులు మారుతుండటంతో రుణాల వసూలు ఇబ్బందిగా మారింది. గత ఏడాది బ్యాంకర్లపై ఒత్తిడి తేవడంతో రూ.158 కోట్ల రుణాలు ఇచ్చారు. ఈసారి ప్రభుత్వం కౌలు రైతులకు రుణాలు ఇచ్చే అంశాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. ఎల్‌ఈసీల మంజూరు సంఖ్య పెంచడంతోపాటు పంట సాగు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి వీలైనంత మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే లక్ష్యం చేరుకోవడానికి బంధువులు, కుటుంబసభ్యుల పేర్లతో ఎల్‌ఈసీలు మంజూరు చేస్తున్నారు. దీనివల్ల కార్డుల లక్ష్యం చేరుకున్నా రుణాల మంజూరులో ఇబ్బందులు ఎదురవుతాయి. మరోవైపు భూ యజమానులు భూములు కౌలుకు ఇచ్చినా కౌలుదారులకు ఎల్‌ఈసీలు మంజూరు చేయడానికి ఒప్పుకోవడం లేదు. రైతులకు అవగాహన కల్పించి కౌలు కార్డుల మంజూరుకు చర్యలు తీసుకోవాల్సివుంది. దీంతోపాటు ఏడాది పొడవునా ఎప్పుడైనా రుణఅర్హత కార్డులు మంజూరుచేసే వెసులుబాటు సైతం కల్పించారు. కౌలు రైతులు రుణాలు తీసుకున్న తర్వాత సకాలంలో చెల్లిస్తే రైతులకు వర్తించే వడ్డీ రాయితీ, వడ్డీలేని రుణాలు సౌకర్యం అందుబాటులోకి వస్తాయి. సకాలంలో రుణాలు చెల్లిస్తే ప్రయోజనాలు అందడంతోపాటు బ్యాంకర్లకు రుణాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఉండవు. జిల్లాలో రైతులు, కౌలు రైతులకు కలిపి రూ.11 వేల కోట్ల రుణాలు ఇస్తుండగా బకాయిలతో కలిపి రూ.15,600 కోట్లకు చేరాయి. సుమారు రూ.4,600 కోట్ల రుణాలు సకాలంలో తిరిగి బ్యాంకులకు చెల్లించడం లేదు. జిల్లా యంత్రాంగం ఒకవైపు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లపై ఒత్తిడి తెస్తుండగా క్షేత్రస్థాయిలో కౌలు రైతుల వైపు నుంచి రుణాలు వసూలు కాకపోవడంతో కొత్తగా ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారు. జిల్లాలో అధికారికంగా 1.61 లక్షల మంది కౌలు రైతులను గుర్తించగా వారిలో ఇప్పటికే రుణాలు తీసుకుని చెల్లించనివారుపోగా మిగిలిన వారందరికీ రుణాలు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ విషయమై జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ ‘ఈనాడు’తో మాట్లాడుతూ మొత్తం రుణాల్లో రూ.1000 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ, రెవెన్యూ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని సంబంధిత ఏరియా బ్యాంకర్ల నుంచి రుణాలు అందేలా చూస్తామని చెప్పారు.