Business

ఇక పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ

Andhra Government To Control Fees In Schools Across The State

కేంద్రం తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్రంలో నూరు శాతం అమలు చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు అత్యంత ప్రాధాన్య రంగాల్లో విద్యాశాఖ కూడా ఒకటన్నారు. ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిరక్షరాస్యత 33 శాతంగా ఉందని.. జాతీయ స్థాయి సగటు కన్నా ఇది ఎక్కువని చెప్పారు. అందుకే తల్లులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకాన్ని తీసుకొస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని జగన్‌ వివరించారు. ప్రతి పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని.. తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేస్తామన్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు సకాలంలో అందిస్తామని చెప్పారు. వారికి షూ కూడా ఇవ్వాలనే ఆలోచన ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఏకరూప దుస్తుల కొనుగోలులో అవినీతి జరిగిందని.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని ఆదేశించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు అసెంబ్లీలో చట్టం తీసుకొస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో విద్య అనేది సేవ కానీ.. డబ్బు ఆర్జించే రంగం కాదని చెప్పారు. ఎవరు విద్యాసంస్థలు పెట్టినా అది వ్యాపారం కాకూడదని జగన్‌ దిశానిర్దేశం చేశారు. జనవరి 26 నుంచి ‘అమ్మఒడి’ చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు తప్పనిసరిగా గుర్తింపు ఉండడంతో పాటు కనీస ప్రమాణాలు, కనీస స్థాయిలో ఉపాధ్యాయులు కూడా ఉండాలని సీఎం అన్నారు.