నిద్ర తీరుతెన్నులను మార్చేసే నేటి షిఫ్ట్ ఉద్యోగాలు మోసుకొస్తున్న అతి పెద్ద సమస్య సంతానం కలగకపోవటం. పెళ్లయి నాలుగైదేళ్లు అయినా ఎంతోమంది సంతాన భాగ్యానికి నోచుకోవటం లేదు. దీనికి ప్రధాన కారణం జీవ గడియారం (సర్కేడియన్ రిథమ్) దెబ్బతినటం. మనకు మధ్యాహ్నం కాగానే ఆకలేస్తుంది, రాత్రి కాగానే నిద్ర ముంచుకొస్తుంది. ఇలా మన ఒంట్లో అన్ని పనులూ ఒక పద్ధతి ప్రకారం.. సమయం ప్రకారం జరిగేలా చూసేది ఈ జీవగడియారమే. ఇది దెబ్బతింటే అన్ని జీవక్రియలూ మందగిస్తాయి. నిద్రవేళలను మార్చేసే షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నది ఇదే. కొన్నిరోజులు పగలు, కొన్నిరోజులు రాత్రి పూట ఉద్యోగాలు చేయటం వల్ల నిద్రవేళలు మారిపోయి జీవగడియారం దెబ్బతింటోంది. దీంతో మహిళల్లో సమయానికి అండం విడుదల కాకపోవటం.. ఫలితంగా గర్భధారణ జరగకపోవటం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రి పూట పనిచేయటం వల్లనో, వంట వండుకోవటానికి సమయం దొరక్కపోవటం వల్లనో చాలామంది బయటి తిండీ తింటుంటారు. పోషకాలు లేని జంక్‌ఫుడ్ తినేస్తుంటారు. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ఒంట్లో కొవ్వు పెరుగుతున్నకొద్దీ ఇన్సులిన్ నిరోధకత (కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించే సామర్థ్యం తగ్గటం) తలెత్తుతుంది. ఇది అండాశయంలో నీటితిత్తులు ఏర్పడటానికి (పీసీఓస్) దారితీస్తుంది. దీంతోనూ అండం సరిగా విడుదల కాదు. ఇన్సులిన్ నిరోధకత మూలంగా మధుమేహం కూడా దాడిచేస్తుంది. ఇది గర్భధారణకు అడ్డు తగలకపోవచ్చు గానీ పిండం మీద తీవ్ర దుష్ప్రభావాలు చూపుతుంది. ఇక ఊబకాయం మూలంగా మగవారిలో ఈస్ట్రోజెన్ స్థాయులు ఎక్కువవుతాయి. ఇది స్తంభన లోపానికి దారితీస్తుంది. ఆధునిక ఉద్యోగాలు మోసుకొస్తున్న మరో ఉపద్రవం మానసిక ఒత్తిడి. ఇది కార్టిజోల్ హార్మోన్ స్థాయులు పెరిగేలా చేస్తుంది. దీంతో ఆందోళన, కుంగుబాటు వంటివి మొదలవుతాయి. ఇలాంటి మానసిక సమస్యలకు వేసుకునే మందుల మూలంగా ఆడవారిలో ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తీ పెరుగుతుంది. ఇదీ అండం విడుదల కావటానికి అడ్డు తగులుతుంది. ఒత్తిడి మూలంగా మగవారిలో వీర్యకణాల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతుంది. సంతానం కలగాలంటే కనీసం 15 మిలియన్ల వీర్యకణాలయినా ఉండాలి. కానీ చాలామందిలో ఒక మిలియన్ కన్నా తక్కువే ఉంటున్నాయి. ఒత్తిడితో మరో ముప్పేటంటే శృంగారాసక్తి తగ్గటం. ఫలితంగా అండం విడుదలయ్యేల సమయంలో కలవరు. అండం విడుదలయ్యే సమయంలో కలవాలని డాక్టర్లు చెబితే ఆ సమయానికి మరింత ఒత్తిడికీ లోనవుతుంటారు. ప్రస్తుతం వలసలు పెరిగిపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచీ వచ్చి భవన నిర్మాణరంగంలోనూ, ఇటుకబట్టీల దగ్గర కూలీ పనులు చేసేవారు ఎందరో. వీరిలో చాలామంది అంతగా చదువుకోనివారే. పైగా కుటుంబాన్ని వదిలిపెట్టి ఒంటరిగానూ వస్తుంటారు. కొందరు తెలిసో తెలియకో అసురక్షిత లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనటం, సుఖవ్యాధుల బారినపడటం తరచుగా చూస్తున్నదే. లైంగిక ఇన్‌ఫెక్షన్ల మూలంగా సంతాన సామర్థ్యమూ దెబ్బతింటుంది. ఫలోపియన్ ట్యూబులు మూసుకుపోవటం వంటి వాటితో మున్ముందు సంతానం కలిగే అవకాశం తగ్గుతుంది. అరకొర జీతాలతో నెట్టుకురావటం వల్ల వేళకి బోజనం చేయరు. సరైన పోషకాహారం కూడా తీసుకోరు. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. ఇది సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకవేళ గర్భం ధరించినా గర్భస్రావమయ్యే ముప్పూ పెరుగుతుంది. మన భవిష్యత్తు పిల్లలే. ఏ పని చేసినా వాళ్ల బాగు కోసమే. అలాంటిది మన పనులే సంతాన భాగ్యం దూరమయ్యేలా చేస్తుంటే? ఆధునిక ఉద్యోగాలు, వాటితో ముడిపడిన ఒత్తిడి సరిగ్గా ఈ పనే చేస్తుండటం గమనార్హం.
*** జాగ్రత్తలు పాటించాలి
* రోజూ కనీసం 8 గంటల సేపు నిద్ర పోయేలా చూసుకోవాలి
* బరువు అదుపులో ఉంచుకోవటం ప్రధానం
* సమతులాహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ మానెయ్యాలి
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
* ఒత్తిడిని తగ్గించుకోవాలి. నలుగురితో కలివిడిగా ఉండటం, యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయి
* అసురక్షిత లైంగిక చర్యలకు దూరంగా ఉండటం మంచిది