ScienceAndTech

గోదావరి అమ్మాయిలు అంగరాక రహస్య ఛేదనకు నాసాకు వస్తున్నారు

Two teenagers from Godavari district in India to study on Mars at NASA

అంతుచిక్కని రహస్యాలెన్నో ఇముడ్చుకున్న ఆకాశం గురించి తెలుసుకోవాలనుకున్నారు ఆ ఇద్దరక్కాచెల్లెళ్లు. ఆ ఆసక్తితోనే సొంతంగా ప్రయత్నించి నాసా ఏటా నిర్వహించే ‘‘ఇంటర్నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ సదస్సు- 2019’కి ఎంపికయ్యారు. అమెరికా వెళ్లి తమ ప్రాజెక్టుని ప్రదర్శించారు ఈ పల్లెటూరి అమ్మాయిలు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వీరు అమెరికా వరకూ ఎలా వెళ్తామని ఎప్పుడూ ఆలోచించలేదు.! వందశాతం అనుకున్నదానికోసం కష్టపడటమే వారి బలం. ఆ వివరాలను వారిద్దరిలో ఒకరైన లీలా విష్ణు జ్యోతి ఇలా చెబుతోంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఆకాశం అంటే చాలా ఇష్టం. నక్షత్రాలు, చందమామ, సూర్యుడు మాత్రమే కాదనీ మరెన్నో గ్రహాలు ఉంటాయని… అవన్నీ కలిస్తేనే విశ్వం అని అర్థమైంది. అలా అంతరిక్షవిజ్ఞానంపై ఆసక్తి పెరిగింది. ఎదిగే కొద్దీ అది మరింత పెరిగింది. ఎప్పటికైనా అంతరిక్షంపై అధ్యయనం చేయాలనుకున్నా. నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు మా సీనియర్ల ద్వారా ఏటా నాసా నిర్వహించే ఇంటర్నేషనల్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు గురించి తెలుసుకున్నా. ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లలోపు విద్యార్థులెవరైనా ఉమ్మడిగాను, వ్యక్తిగతంగాను తమ ప్రాజెక్టులను పంపించొచ్చు. అది తెలిశాక నేను ఆ అవకాశం అందుకోవాలనుకున్నా. నా ఇష్టాలను తెలుసుకున్న చెల్లి తులసి శ్యామలా నా బాటలోనే నడిచింది. ఆమె ప్రస్తుతం ఇంటర్‌ చదువుతోంది. తనూ అంతరిక్షంపై అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఏ మాత్రం ఖాళీ దొరికినా సరే…అంతర్జాలాన్ని జల్లెడ పట్టేవాళ్లం. నోట్స్‌ సిద్ధం చేసుకున్నాం. ఈలోగా నాసా నోటిఫికేషన్‌ వచ్చింది. ఇద్దరం దరఖాస్తు చేశాం. వేలాది దరఖాస్తుల్లో మేం ఎంపికయ్యాం అని తెలిసినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో. ప్రాజెక్టు రూపకల్పనలో కాలేజీ వాళ్లు ఎంతో సాయం చేశారు. నా ప్రదర్శన నమూనాకి పద్మజ్‌ సూర్య అని పేరు పెట్టా. దీని ద్వారా అంగారకుడిపై నివాసం ఎలా సాధ్యమో వివరించా. నేను తయారు చేసిన స్పేస్‌ సెటిల్మెంట్‌…తామర పువ్వులా సూర్యుని నుంచి వచ్చే శక్తిని తొంభైశాతం వినియోగించుకుని పనిచేస్తుంది. ఉదాహరణకు తామరపువ్వు చుట్టూ తడి ఉన్నా…దానిపై నీటిబొట్టు నిలవదు. అలానే రేడియేషన్‌ వంటి సమస్యలు ఎదురైనా అక్కడ నివాసం ఉండేవారికి ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. దీన్ని పదిహేనువేలమందికి వసతి సౌకర్యం అందించేలా రూపొందించా. అలానే మా చెల్లి తులసి ‘సహస్ర’ పేరుతో ప్రాజెక్టుని రూపొందించింది. దీనిద్వారా వాతావరణం కలుషితం కాకుండా అక్కడ నివసించే పద్ధతులను వివరించింది. ఈ పర్యటన, ప్రాజెక్టు మాకు ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది. నాసా శాస్త్రవేత్తలకు మా ఆలోచన చెప్పినప్పుడు కొందరు ఎన్‌ఆర్‌ఐలో అమెరికాలో ఎంఎస్‌ పూర్తి చేసేందుకు సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. నాసా సర్టిఫికెట్‌ అందించింది. భవిష్యత్తులో స్పేస్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ చేయాలనేది నా కల. ప్రస్తుతం నేను ట్రిపుల్‌ఐటీ(శ్రీకాకుళం)లో ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం పూర్తిచేశా. నాసా పేరు ఎన్నో ప్రయోగాలు, మరెన్నో విశేషాలతో నిత్యం మారుమోగుతూనే ఉంటుంది. అలాంటి చోట మా ఆలోచనను పంచుకునే అవకాశం రావడం అదృష్టమే. ఈ సదస్సు అమెరికాలోని వర్జీనియాలో జరిగింది. నాన్న ఓ పక్క వ్యవసాయం మరోపక్క ఎలక్ట్రీషియన్‌గా కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అక్కడి వరకూ వెళ్లాలంటే చాలా డబ్బు కావాలి. దాంతో మేం వెళ్లలేం అనుకున్నాం. మా ఆసక్తిని గమనించిన నాన్న కొంత అప్పు తెచ్చారు. ఆయన స్నేహితులూ కొంత సాయం చేశారు. అలా మేం వెళ్లగలిగాం. పైగా ఊరుకాని ఊరు…ఎప్పుడూ మా రాష్ట్రం దాటి పక్క రాష్ట్రానికి ఒంటరిగా వెళ్లిన సందర్భాలు లేవు. అలాంటిది సముద్రాలు దాటి….విదేశం అంటే భయమేసింది. కానీ భయపడితే ఏమీ చేయలేమనే ఆలోచనతో ముందడుగు వేశాం. మాది తూర్పుగోదావరి జిల్లాలోని కడియంకి దగ్గర్లోని మాధవరాయుడుపాలెం.