Kids

చెక్కబొమ్మలతో పర్యావరణం కూడా హ్యాపీ

Wooden Toys For Kids Helps Environment Also

నాన్నలా యమాస్పీడుగా కారు నడిపేస్తుంటాడు చింటూ. అమ్మలా సూపర్‌ఫాస్ట్‌గా వంట చేసేస్తుంటుంది ఖుషీ. బిల్డర్‌లా ఆలోచిస్తూ భవంతి కట్టేస్తుంటాడు టింటూ. అమ్మమ్మలా షాపుకెళ్లి పండ్లు బేరమాడుతుంటుంది హనీ. ఈ పనులన్నీ ఆ చిన్నారుల ఆటలో భాగమే. కారూ వంటసామానూ భవంతీ షాపూ అన్నీ బొమ్మలే. నిన్న మొన్నటిదాకా ప్లాస్టిక్‌తో వచ్చిన ఆ బొమ్మలు ఇప్పుడు పిల్లలకీ పర్యావరణానికీ ఏమాత్రం హాని కలిగించని చెక్కతో తయారుకావడమే విశేషం! బొమ్మలకీ పిల్లలకీ ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. బొమ్మరిళ్లూ బొమ్మలాటలూ ఏనాటి నుంచో ఉన్నవే. ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా పిల్లలు ఇంట్లోని పెద్దవాళ్లనీ స్కూల్లోని టీచర్లనీ తమచుట్టూ ఉన్నవాళ్లనే చూసి నేర్చుకుంటారు. వాళ్లనే అనుకరిస్తూ ఆటలు ఆడతారు. అయితే అప్పట్లో వడ్రంగివాళ్లు చేసిచ్చే కొయ్యగుర్రం, ఎడ్లబండి, ఏనుగు వంటి చిన్న చిన్న కొయ్యబొమ్మలు అబ్బాయిల ఆటవస్తువులయితే, జాతరలో కొనుక్కునే లక్కపిడతలే అమ్మాయిల ఆట సామాన్లు. కొన్నిసార్లు పెద్దల సాయంతో పిల్లలే స్వయంగా మట్టితోనూ తాటాకులతోనూ బొమ్మలు చేసుకునేవారు. ఇటుకలూ రాళ్లూ పేర్చి ఇళ్లు కట్టుకునేవారు. ఇసుకతో గూళ్లూ మేడలూ కట్టుకుని ఆడుకునేవారు. కాలం మారింది… పిల్లలు పుడుతూనే సెల్‌ఫోను పట్టుకుని నొక్కేస్తున్నారు. టీవీ షోలూ వీడియో గేమ్‌లూ రొబొటిక్‌ బొమ్మలూ వర్చ్యువల్‌ ఆటలూ ఉండనే ఉన్నాయి. ఎన్ని ఉన్నా పిల్లలకి బొమ్మలతో ఉండే అనుబంధం వేరు. వాటితో ఆడుకోవడంవల్ల వాళ్లు మానసికంగానూ శారీరకంగానూ ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అవి వాళ్లలో ఆలోచనాశక్తినీ సృజనాత్మకతనీ పెంచుతాయి. దాంతో పుట్టినప్పటి నుంచీ వృద్ధాప్యంవరకూ అన్ని దశల్లోనూ నిత్యజీవితంలో అవసరమయ్యేవన్నీ పిల్లల ఆటవస్తువులుగా రూపొందుతున్నాయి. వాటితోబాటు వాళ్లలో తెలివితేటల్ని పెంచే జిగ్‌సా, బాల్‌ ఇన్‌ మేజ్‌… వంటి పజిల్సూ; ఏకాగ్రతనీ మేధస్సునీ పెంచే బిల్డింగ్‌ బ్లాక్సూ, మెకాట్రానిక్సూ… ఇలా ఒకటనేముందీ, ఎన్నో రకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. చిన్నారుల కోసం బొమ్మరిళ్లూ వాటిల్లోకి అవసరమైన ఫర్నిచరూ ఇతరత్రా అన్ని వస్తువులూ కూడా మార్కెట్లో కొలువుదీరుతున్నాయి. ఇక, కార్లూ బస్సులూ రైళ్లూ విమానాలూ వంటి వాహనాలు సరేసరి. ఇవేకాదు, పిల్లలు పూర్తిగా ఆటలో లీనమై ఆడుకునేలా తమ ఇంటిని తామే తీర్చిదిద్దుకునే పెద్ద సైజు ప్లేహౌసెస్‌ కూడా వస్తున్నాయి. వీటిల్లోనూ బోలెడు థీమ్‌లు. భవంతులూ దుకాణాలూ ఆసుపత్రులూ గ్రంథాలయాలూ ఆఫీసులూ ఫైర్‌హౌస్‌లూ… ఈ లిస్టు చాలా పెద్దది. అయితే ఇవన్నీనిన్నమొన్నటివరకూ ప్లాస్టిక్‌ లేదా ఐరన్‌… వంటి వాటితో చేసినవే ఉండేవి. కానీ ఇప్పుడు వీటన్నింటినీ కూడా పర్యావరణ ప్రియంగా అచ్చంగా చెక్కతో చెక్కేస్తున్నారు. ‘కొండపల్లి కొయ్యబొమ్మ… నీకో బొమ్మ… నాకో బొమ్మ…’ అని పాటలు పాడుకుంటూ ఆడుకునే ఒకప్పటి ఆటలు కనుమరుగైనా, ఆ కొయ్యబొమ్మలోని గొప్పతనాన్ని గుర్తించిన అమ్మానాన్నలూ ఉత్పత్తిదారులూ ప్లాస్టిక్కుకి స్వస్తి చెప్పి, బుజ్జాయిలకు సరికొత్త చెక్క బొమ్మల్నే అందిస్తున్నారు.పిల్లలు ఏదయినా త్వరగా నోట్లోకి పెట్టుకుంటారు. అవి రకరకాల ప్లాస్టిక్‌తోనో లేదా ఇతరత్రా కృత్రిమ పదార్థాలతోనో చేసినవయితే ప్రమాదకరం. పైగా పిల్లలు వాటిని ఒకోసారి జారవిడుస్తారు. చిరాకొస్తే విసిరేస్తుంటారు. ప్లాస్టిక్కువి అయితే విరిగిపోతాయి. ఇనుముతో చేసినవయితే తుప్పుపట్టడం, దెబ్బలు తగలడం జరుగుతాయి. అదే చెక్కవయితే ఎప్పటికీ పాడవకుండా ఉంటాయి. మాటిమాటికీ పిల్లలు వాటిని ఏమి చేస్తున్నారా అని చూడాల్సిన అవసరమూ ఉండదు. బొమ్మ పాడవడమూ మళ్లీ మళ్లీ కొత్తవి కొనాల్సిన అవసరమూ ఉండదు. డబ్బూ ఆదాతోబాటు, భూమ్మీద ప్లాస్టిక్కు చెత్తా పోగుపడదు. పైగా చెక్కబొమ్మ తరతరాలవరకూ ఉంటుంది కాబట్టి అవసరం తీరిపోయాక తరవాతివాళ్లకీ ఇవ్వొచ్చు. సో, మొత్తమ్మీద అటు పిల్లలూ పర్యావరణమూ రెండు సురక్షితమే. ప్రాంతంతో సంబంధం లేకుండా ఐరోపా, ఆసియా, అమెరికా అన్నిచోట్లా కూడా పిల్లలకోసం రకరకాల పేర్లతో చెక్కబొమ్మలూ పజిల్సూ చేయడం తాతముత్తాతల కాలం నుంచీ వాడుకలో ఉంది. క్రీ.పూ.మూడో శతాబ్దంలోనే గ్రీసులో 14 భాగాలుగా విడదీసే చతురస్ర ఆకారంలోని పజిల్‌ కనిపించింది. కానీ క్రమంగా అంతటా ప్లాస్టిక్కు మాయ కమ్మేసింది. ఇప్పుడిప్పుడే ఆ పొరల్ని తెంచుకుని, మళ్లీ అందరూ చెక్క బొమ్మల్ని హత్తుకుంటున్నారు. దాంతో బొమ్మల కంపెనీలన్నీ చెక్కతోనే అందమైన బొమ్మలు తయారుచేయడంలో పోటీపడుతున్నాయి. కాకపోతే వీటిని కొనేటప్పుడు పిల్లల వయసునీ ఆసక్తినీ దృష్టిలో పెట్టుకుని కొంటే సరి. అప్పుడు చిన్ననాటి పిల్లల ఆటలు, అందమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.