జగన్ ఆశలపై నీళ్లుచల్లిన తెలుగింటి కోడలు: హోదా ఇచ్చేది లేదన్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్…..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. భవిష్యత్ లో ఏ రాష్ట్రానికి ఇకపై హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేశారు.
లోక్ సభలో ప్రత్యేక హోదాపై బీహార్ ఎంపీ కౌసలేంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రణాళికా మద్దతు కోసమే ప్రత్యేక హోదా ఇవ్వాలని జాతీయ అభివృద్ధి మండలి సిఫారసు చేసిందని తెలిపారు. హోదాకు, పారిశ్రామిక రాయితీలకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోపాటు తెలంగాణ సహా మరో 7రాష్ట్రాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హోదా ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగింటి ఆడపడుచు, పశ్చిమగోదావరి జిల్లా కోడలు అయిన నిర్మలా సీతారామన్ కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కట్టబెట్టడంతో రాష్ట్రంలోని ప్రజలు అంతా హర్షం వ్యక్తం చేశారు. తెలుగింటి కోడలుగా హోదా ఇచ్చి తీరుతారని అంతా భావించారు కానీ ఆమె ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.