యాపిల్ ఆపరేటింగ్ సిస్టం ఐఓఎస్కు ప్రధాన పోటీగా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఆవిష్కరించలేకపోవడమే మైక్రోసాఫ్ట్ అధిపతిగా తన అతిపెద్ద తప్పిదమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అంగీకరించారు. ఇటీవల రెండు ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఐఓఎస్కు పోటీగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను గూగుల్కు మైక్రోసాఫ్ట్ ఎలా కోల్పోయిందీ వెల్లడించారు. ‘సాఫ్ట్వేర్ ప్రపంచంలో ముఖ్యంగా ప్లాట్ఫామ్ (ఆపరేటింగ్ సిస్టమ్-ఓఎస్)ల వల్లే మార్కెట్లలో విజయవంతం అవుతాం. వ్యక్తిగత కంప్యూటర్లకు విండోస్ ఓఎస్తో విజయం సాధించాం. అయితే స్మార్ట్ఫోన్ ప్రపంచంలో ఇది సాధ్యం కాలేదు. ఐఓఎస్ కేవలం ఐఫోన్లకే పరిమితం. అందువల్ల ఇతర ఫోన్లకు వేరే ఓఎస్ అవకాశం కచ్చితంగా ఉంది. ఆండ్రాయిడ్ అలా స్థిరపడింది. సెల్ఫోన్ అత్యంత జనాదరణ పొందుతుందని అంచనా వేసే, మొబైల్ కోసం మైక్రోసాఫ్ట్ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ మొబైల్ను 2000 సంవత్సరంలోనే ఆవిష్కరించింది. ఆపిల్ తమ ఐఫోన్ను 2007లో ప్రవేశ పెట్టింది. గూగుల్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ 2008లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఐఓఎస్, ఆండ్రాయిడ్ కంటే విండోస్ మొబైల్ బాగా వెనుకబడింది. ఇందుకు కారణం.. అప్పట్లో యాంటీట్రస్ట్ విచారణను ఎదుర్కొంటున్న సమయంలో, మైక్రోసాఫ్ట్ తమ వద్ద అత్యుత్తమ నిపుణులు ఉన్నా కూడా, మొబైల్ కోసం కేటాయించలేకపోయింది. అందువల్లే మొబైల్లో ఏమైతే తప్పనిసరిగా సాధించాలని భావించామో, అది చేయలేకపోయాం. ఆండ్రాయిడ్ను అభివృద్ధి చేసిన గూగుల్కు, బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయం లభిస్తోంది. 2017లో విండోస్ 10 ఫోన్లకు సహకారం విరమించుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కంప్యూటర్ల రంగంలో మాత్రం విండోస్, ఆఫీస్తో పటిష్టంగా ఉన్నాం’ అని బిల్గేట్స్ పేర్కొన్నారు. ప్రస్తుత సీఈఓ సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ విలువ మరింత పెరుగుతోంది. రూ.70 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది’ అని ప్రశంసించారు.
పసిగట్టలేకపోయినందుకు చింతిస్తున్నాను
Related tags :