Business

భారత వైఖరి పట్ల ట్రంప్ అసహనం

Trump Intolerant Over Indian Tariffs On American Products

అమెరికా టారిఫ్‌లకు ప్రతిగా ఇటీవల భారత్‌ విధించిన టారిఫ్‌లు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. వాటిని కచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందేనని తెలిపారు. శుక్రవారం జపాన్‌లో జరిగే జీ20 సదస్సు సందర్భంగా మోదీతో భేటీకానున్నట్లు వెల్లడించారు. ‘‘భారత్‌ కొన్నేళ్లుగా అమెరికా వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తున్న విషయమై నేను ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించబోతున్నా. దీనికి తోడు ఇప్పుడు మళ్లీ సుంకాలను పెంచింది. దీనిని మేము ఏమాత్రం ఆమోదించబోము. వీటిని కచ్చితంగా వెనక్కు తీసుకోవాల్సిందే.’’ అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అమెరికా టారిఫ్‌లకు ప్రతిగా భారత్‌ ఇటీవలే 28 రకాల అమెరికా వస్తువులపై సుంకాలను పెంచింది. భారత్‌కు జీఎస్‌పీ హోదాను తొలగించడానికి ప్రతిగా ఈ సుంకాలు వేసింది. వీటిల్లో బాదం, ఆపిల్‌, పప్పుదినుసులు, వాల్‌నట్‌ వంటివి ఉన్నాయి. ట్రంప్‌కు అమెరికాలో బలమైన మద్దతు దారులైన గ్రామీణులపై ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది. 2020 ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.