Movies

ఛార్మీ కాదు ఛార్మీలా

Charmila From Pranadatha Movie Wants To Return To Tollywood

చార్మి అందరికీ తెలుసు. చార్మిలా తెలిసి ఉండకపోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు, లక్ష్మీ జంటగా నటించిన ‘ప్రాణదాత’ (1992) సినిమా చూసినవారికి చార్మిలా తెలిసే ఉంటుంది. అందులో ఏయన్నార్, లక్ష్మీ కూతురిగా నటించిందామె. ఆ తర్వాత భానుమతీ రామకృష్ణ స్వీయదర్శకత్వంలో రూపొందించిన ‘అసాధ్యురాలు’లో నటించింది. ‘ప్రేమ ఖైదీ’లో మాలాశ్రీ ఫ్రెండ్‌గా నటించింది. ఆ తర్వాత కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ తెలుగులో కనిపించాలనుకుంటోంది. ‘‘అప్పట్లో తెలుగులో హీరోయిన్‌గా నటించాను. ఇప్పుడు తమిళ, మలయాళ భాషల్లో అక్క, వదిన, అమ్మ పాత్రలు చేస్తున్నాను.అవకాశం వస్తే తెలుగులోనూ ఆ పాత్రలు చేయాలని ఉంది’’ అన్నారు చార్మిలా. ప్రముఖ నటుడు శివాజీ గణేశన్‌ నటించిన ‘నల్లదొరు కుటుంబం’ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించింది. హీరోయిన్‌ కావాలన్నది తన కల. మలయాళ చిత్రం ‘ధనమ్‌’ ద్వారా ఆ కల నెరవేరింది. ప్రశాంత్‌ సరసన చేసిన ‘కిళక్కే వరుమ్‌ పాట్టు’ ద్వారా కథానాయికగా తమిళ్‌కి çపరిచయం అయ్యారు. తమిళంలో పది సినిమాలకుపైగా, మలయాళంలో 40 సినిమాలకు పైగా కథానాయికగా నటించారు. హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న చార్మిలా బాబు పుట్టాక ఇంటిపట్టున ఉండాలనుకున్నారు. ‘‘మా అత్తగారితో నాకు సఖ్యత లేకుండాపోయింది. నా భర్తతో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చాయి. దాంతో విడిపోయాం.అయితే పిల్లలకు తల్లీదండ్రీ ఇద్దరూ ముఖ్యమే కాబట్టి నెలకోసారి ఆయన వచ్చి బాబుని చూసి వెళతారు. మేం ఫ్రెండ్లీగా ఉంటాం’’ అన్నారు చార్మిలా. సింగిల్‌ పేరెంట్‌గా కొడుకు బాధ్యతను మోస్తున్న చార్మిలాకి తల్లి, పెద్దమ్మ, బాధ్యతలు కూడా ఉన్నాయి. అందుకే ఇండస్ట్రీకి రీ–ఎంట్రీ ఇచ్చారు. ఎక్కువ సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళంలో ఆమె ‘కన్నిరాశి’, మలయాళంలో ‘కొచ్చిన్‌ షాదీ అట్‌ చెన్నై 03’, ప్రియపట్టవర్‌’.. ఇలా నాలుగైదు సినిమాలు చేస్తున్నారు. ‘‘అమ్మ, వదిన, అక్క పాత్రలంటే ఒక్కో సినిమాకి ఒకటీ రెండు రోజుల్లో షూటింగ్‌ చేసేస్తారు. నెలకి మహా అయితే ఓ పది రోజులు షూటింగ్‌ ఉంటుంది. అదే ఎక్కువ భాషల్లో చేస్తే ఎక్కువ సినిమాలు చేయొచ్చు కదా. అందుకే తెలుగులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను’’ అన్నారు చార్మిలా.