ScienceAndTech

జానీ ఐవీ వీడ్కోలు దెబ్బకు యాపిల్ కుదేలు

Jony Ive Departure Creates Ripples In Apple And Its Stock

ప్రముఖ టెక్‌ దిగ్గజం యాపిల్‌కు షాక్ తగిలింది. ఆ కంపెనీ చీఫ్‌ డిజైనర్‌, స్టీవ్‌ జాబ్స్‌ నమ్మిన బంటు అయిన జానీ ఐవ్‌ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరన యాపిల్‌కు రాజీనామా చేసి సొంత డిజైనింగ్‌ సంస్థను నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. అప్పటి వరకు కంపెనీ కార్యకలాపాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. కంపెనీని అగ్రస్థానంలో నిలపడంలో జానీ శ్రమ కూడా ఉంది. జానీ 28 ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. యాపిల్‌ సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈయన డిజైన్లే కంపెనీకి కొత్తరూపు తీసుకొచ్చాయి. 1992లో జానీ యాపిల్‌ సంస్థలో చేరారు. 1996లో డిజైనింగ్‌ జట్టులో స్థానం సంపాదించారు. అప్పటి నుంచి యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌కి ప్రధాన అనుచరుడిగా ఉంటూ సలహాలిస్తుండేవారు. 2015లో ఆయన చీఫ్‌ డిజైన్‌ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం యాపిల్‌ నుంచి వేరుపడి ‘లవ్‌ ఫ్రమ్‌’ పేరుతో కొత్త కంపెనీ ప్రారంభించనున్నారు. ఈయన రాజీనామా అంశంపై మాక్సిమ్‌ గ్రూపునకు చెందిన విశ్లేషకుడు నేహాల్‌ చోక్సీ స్పందించారు. యాపిల్‌ కంపెనీలో జానీ కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన రాజీనామా కంపెనీకి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు.