వేధిస్తే విదేశీ అల్లుడి వీపు మోతే!
మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు
ఎన్ఆర్ఐ అల్లుళ్ల వేధింపులకు చెక్
నిందితుడిని గుర్తించి రప్పించేలా చర్యలు
అమెరికా సంబంధమంటే కొంతమంది అమ్మాయిలకు ఎంతో ఆశపడుతుంటారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు విదేశీ సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా కొంతమంది మోసగాళ్లు బరి తెగిస్తున్నారు. విదేశాల్లో ఉన్న తమపై ఎలాంటి చర్యలూ తీసుకోలేరనే నమ్మకంతో పెళ్లయ్యాక భార్యలను అదనపు కట్నం కోసం వేధించడం.. పుట్టింట్లో వదిలేసి వెళ్లిపోవడం.. లేదంటే రెండో పెళ్లి చేసుకోవడం, అంతకు ముందే పెళ్లయినా దాచిపెట్టి మరోమారు పెళ్లిచేసుకోవడం వంటివి ఇందులో కొన్ని. ఇలాంటివి జరిగితే అమ్మాయి తల్లిదండ్రులు ఆవేదన చెందడం తప్ప విదేశాల్లో ఉన్న అల్లుడిపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. చట్టపరమైన సమస్యల కారణంగా పోలీసులు ఇలాంటి కేసుల్లో ఏమీ చేయలేకపోతున్నారు. ఇలాంటి కేసులకు సరైన పరిష్కారం కనుక్కునేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలోని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయబోతోంది. లక్డీకపూల్‌లోని మహిళా భద్రతా విభాగం భవనంలో ఈ సెల్ ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్ఆర్ఐ కేసులపై ఇప్పటికే అమెరికా కాన్సులేట్‌లో సంప్రదింపులు జరిపారు.
**చర్యలు తీసుకోవడం కష్టమా
గృహహింసకు సంబంధించిన కేసులలో విదేశాల్లో ఉన్న అల్లుళ్లపై చర్యలు తీసుకోవడం మన పోలీసులకు కష్టంగా ఉంది. అసలు ఏదైనా నేరం చేసి విదేశాలకు చెక్కేస్తే తిరిగి రప్పించడమే కష్టమైతే ఇక గృహహింస లాంటి వాటిలో చర్యలు సాధ్యమే కావడంలేదు. ఎందుకంటే ఆయా దేశాల్లో వరకట్న వేదింపుల వంటి నేరాలకు ప్రత్యేక చట్టాలు లేవు. రెండు దేశాల మధ్య నేరగాళ్ల అప్పగింత జరగాలంటే మొదట ఆ రెండు దేశాల్లోనూ అదేరకమైన నేరానికి సంబంధించిన చట్టాలు ఉండాలి. ఉదాహరణకు మన దేశంలో వరకట్న వేధింపులకు పాల్పడితే శిక్షించే చట్టాలున్నాయి. కాని అమెరికా, ఇంగ్లాండు వంటి దేశాల్లో అసలు వరకట్న వేధింపుల వంటివి ఉండవు. దాంతో అక్కడ అలాంటి చట్టాలేవీ లేవు. అందుకే ఎన్ఆర్ఐ అల్లుళ్లపై మన దేశంలో వరకట్న వేధింపుల కేసు నమోదైనప్పుడు వారిని ఇక్కడకు రప్పించడం కుదరడంలేదు. గతంలో ఇలాంటి వారిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసేవారు. దీనివల్ల నిందితుడు ఒక దేశం నుంచి మరో దేశం వెళితే విమానాశ్రయంలోనే పట్టుకొని మన పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. కాని ఇలాంటి వరకట్న వేధింపుల చట్టం ఆయా దేశాల్లో లేదు కాబట్టి రెడ్‌కార్నర్ సాధ్యంకాదని ఇంటర్‌పోల్ తేల్చేసింది. దాంతో తమకు ఏమీ కాదన్న భరోసాతో విదేశీ అల్లుళ్లు కొందరు చెలరేగిపోతున్నారు. బాధిత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. భారతదేశంలోని ఏ విమానాశ్రయంలోనికైనా ప్రవేశిస్తే పట్టుకునేలా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి ఊరుకుంటున్నారు. దాంతో వేధింపులకు పాల్పడ్డ నిందితులు ఇక్కడ అడుగుపెట్టకుండా విదేశాల్లోనే గడిపేస్తున్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మహిళా భద్రతా విభాగంలో ప్రత్యేక సెల్ ఏర్పాటుకు సంకల్పించారు.
***ఎలా పనిచేస్తుంది?
* డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ సెల్ పనిచేస్తుంది.
* నిపుణులైన న్యాయవాదులతోపాటు స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ సేవలు అందిస్తాయి.
* వచ్చిన ఫిర్యాదు ఆధారంగా వీరు న్యాయపరమైన సలహాలు ఇస్తారు.
* నిందితుడు ఏ దేశంలో పనిచేస్తున్నాడో తెలుసుకుని ఆ దేశంలోని స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుంటారు.
* అవసరమైతే ఆ దేశానికి చెందిన విదేశాంగ కార్యాలయం అధికారులతో మాట్లాడతారు. నిందితుణ్ని తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేస్తారు. ఇదంతా విదేశీ వ్యవహారాల పరిధిలోనే జరుగుతుంది.
* ఆయా దేశాల్లో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థల సాయం కూడా తీసుకుంటారు. దేశాలవారీగా ఆయా సంస్థల జాబితా సిద్ధం చేస్తున్నారు. అమెరికాలో పనిచేస్తున్న సంస్థల వివరాలు ఇప్పటికే సేకరించారు.
* నిందితుడి గుర్తించడం, రప్పించడం, చట్టపరంగా శిక్షించడం కొత్తగా ఏర్పాటు చేయబోయే సెల్ లక్ష్యం.
అమెరికా అల్లుడా…పగులుతుంది నీ దవడా!
Related tags :