అంతర్జాతీయ వేదికలపై జీ-2, జీ-4, జీ-7, జీ-10, జీ-15, జీ-20 వంటి పేర్లు తరచూ వినిపిస్తుంటాయి. వీటిల్లో అత్యంత శక్తిమంతమైంది జీ-20 గ్రూపు. ఇది ప్రపంచ జనాభాలో మూడింట రెండోంతులకు.. ప్రపంచ జీడీపీలో 85శాతం వాటాకు.. అంతర్జాతీయ వాణిజ్యంలో 75శాతానికి.. పరిశోధనల ఖర్చులో85 శాతానికి.. ఇదీ దీని శక్తి. ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థలు మొత్తం మనకు ఈ వేదికపైనే కనిపిస్తాయి. ఇక్కడ తీసుకొనే నిర్ణయాలకు అంతర్జాతీయంగా చట్టబద్ధత లేకపోయినా.. ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.
**ఆవిర్భావం..
1997లో ఆసియాలో ఆర్థిక సంక్షోభం తలెత్తిన తర్వాత ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన దేశాలన్నీ కలిసి గ్రూపు ఏర్పాటు చేయాలని భావించాయి. దీంతో 1999 బెర్లిన్‌లో తొలిసారి జీ20 సదస్సును నిర్వహించారు. వాస్తవానికి జీ20 ప్రధాన కార్యాలయం వంటిది ఏమీ లేదు. ఏ దేశంలో సదస్సు నిర్వహిస్తారో ఆ దేశమే ఏర్పాట్లు చూసుకొంటుంది. ఆ దేశమే అధ్యక్షత వహిస్తుంది. ఈ అధ్యక్ష ఎన్నిక కోసం జీ20ని ఐదు గ్రూపులుగా విభజించారు. గ్రూపులువారీ అధ్యక్షత వస్తుంది. ఆ గ్రూప్‌లో ఓటింగ్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 2022లో భారత్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
**సభ్యదేశాలు ఇవే..
అర్జెంటీనా, బ్రెజిల్, చైనా, జర్మనీ, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, టర్కీ, అమెరికా, దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, యూకే, యూరోపియన్ యూనియన్. వీటికి అదనంగా ఆహ్వానిత దేశాలు సంస్థలు ఉంటాయి. 2008 నుంచి స్పెయిన్ శాశ్వత ఆహ్వానిత దేశం. జీ20లో పాకిస్థాన్ లేదు. 2019లో నెదర్లాండ్స్, స్పెయిన్, థాయ్‌లాండ్, చిలీ, సింగపూర్, వియత్నాం, ఈజిప్ట్, సెనెగల్‌లను ఆహ్వానించారు. ఇక సంస్థల విషయానికి వస్తే వరల్డ్ బ్యాంక్, ఐరాస, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఓఈసీడీ, డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్, డబ్ల్యూటీవో, ఫైనాన్షియాల్ స్టెబిలిటీ బోర్డు, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్‌లు దీనికి హాజరవుతాయి.
**ఎటువంటి అంశాలను చర్చిస్తారు..
జీ20 దేశాలు ముఖ్యంగా విస్తృతమైన ఆర్థిక అంశాలతో కూడిన అజెండాను చర్చిస్తాయి. వీటికి ప్రపంచ స్థాయి ప్రాధాన్యం ఉండాలి. సమకాలీన అంశాలను కూడా వీటిల్లో చేరుస్తారు. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ మార్కెట్లు, పన్నుల విధానాలు, ఆర్థిక విధానాలు, అవినీతిపై పోరాటం వంటి అంశాలపై చర్చలు ఉంటాయి. వీటితో పాటు కొన్ని అనుబంధంగా ఉండే అంశాలపై కూడా చర్చ చేపడుతుంటారు. పర్యావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్యం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం వంటివి ఉంటాయి.
***2019 జీ20 సమావేశం ఐదు ఉద్దేశాలు..
* ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
* వ్యాపారం , పెట్టుబడులు
* సృజనాత్మకత
* పర్యావరణం, శక్తి
* ఉద్యోగ కల్పన
**2019 జీ20 పాల్గొనే ప్రముఖ నేతలు..
* జపాన్ ప్రధాని షింజో అబే
* చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్
* రష్యా అధ్యక్షుడు పుతిన్
* అమెరికా అధ్యక్షుడు ట్రంప్
* భారత్ ప్రధాని మోదీ
* ఫ్రాన్స్ ప్రధాని మాక్రోన్
* జర్మనీ ఛాన్స్‌లర్ మెర్కెల్
* బ్రిటన్ ప్రధాని థెరిస్సామే
* సౌదీ యువరాజు మహమ్మద్‌బిన్ సల్మాన్
* కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్యూ
జీ20 అంటే ఏమిటి? దానికి ఎందుకంత శక్తి?
Related tags :