దేశంలో ఖరీదైన నగరం ముంబయి
ఆసియాలో తొలి 20 స్థానాల్లో చోటు
ప్రపంచంలో 67వ ర్యాంకు: మెర్సర్
దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబయి నిలిచింది. ఆసియాలో చూస్తే తొలి 20 స్థానాల్లో చోటు దక్కించుకోగా, ప్రపంచంలో 67వ ర్యాంకు సాధించింది. ప్రధానంగా నివాస గృహాల ధరలు ముంబయిలో అధికంగా ఉండటమే ఇందుకు కారణమని గ్లోబల్ కన్సల్టింగ్ లీడర్ మెర్సర్ సర్వే నివేదికలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 209 నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. 25వ సారి నిర్వహించిన ‘కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే’లో పలు అంశాలను ప్రస్తావించింది.
ఆహార, వినియోగ వస్తువుల ధరలు ముంబయిలో తగ్గినప్పటికీ, నివాస గృహాల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా నిలిచింది.
దిల్లీ (118), చెన్నై (154), బెంగళూరు (179), కోల్కతా (189) నగరాలు కూడా అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఉన్నాయి. అయితే గతంతో పోలిస్తే వీటి స్థానాలు తగ్గాయి. అమెరికా డాలర్తో పోలిస్తే, ఇతర కరెన్సీలు బలహీన పడటం వల్ల, భారత నగరాల స్థానం తగ్గేందుకు కారణమైంది.
ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో 8 నగరాలు ఆసియాలోనే ఉన్నాయి. తొలి స్థానంలో హాంకాంగ్ నిలిచింది. వరుసగా రెండోసారి ఇది తన స్థానాన్ని నిలుపుకుంది. తర్వాత స్థానాల్లో టోక్యో (2), సింగపూర్ (3), సియోల్ (4), జ్యూరిక్ (5), షాంఘై (6), అస్గాబత్ (7), బీజింగ్ (8), న్యూయార్క్ సిటీ (9), షెంజెన్ (10) నిలిచాయి.
తక్కువ ఖరీదైన నగరాల్లో టునిస్ (209), తాష్కెంట్ (208), కరాచీ (207) ఉన్నాయి.
జేబులు గుల్ల చేసే నగరం ముంబాయి
Related tags :