నిన్న మొన్నటి వరకూ వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాం. ఇప్పుడు చినుకులు చిందేస్తున్నాయి. ఈ కాలానికి తగ్గట్లు మన ఆహార్యంలోనూ మార్పులు చేసుకోవాలిగా… అప్పుడే సౌకర్యం, సొగసు.
* ఈ కాలంలో ఎప్పుడో ఒకసారైనా తడవాల్సి వస్తుంది. త్వరగా ఆరిపోయే క్రేప్, షిఫాన్, సిల్క్, పాలిస్టర్, నైలాన్, ఖాదీ వంటి వస్త్ర రకాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. వాటిని మరీ ఒంటికి అతుక్కుపోయేలా కుట్టించుకోకూడదు. కాస్త వదులుగా ఉండేలా చూసుకోవడమే మంచిది.
* కాఫ్‌లెంగ్త్ గౌన్లు, మినీ స్కర్టులు, మడమ కంటే పైకి ఉండే ప్యాంట్లు… సిగరెట్, తులిప్ వంటి డిజైన్లలో ఎంచుకోండి. ట్రెండీగా ఉంటాయి. మడమ కంటేపైకి ఉండే జీన్స్ వేసుకోవాలి. స్లీవ్‌లెస్, షార్ట్‌స్లీవ్‌లు, రౌండ్, బోట్‌నెక్‌లు సౌకర్యం.
* ఈ కాలంలో వాతావరణం కాస్త మందకొడిగా ఉంటుంది. మనసు దాని ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలంటే… కంటిని ఆకట్టుకునే రంగురంగుల దుస్తుల్ని ఎంచుకోవడం మంచిది. పిస్తాగ్రీన్, నీలం, ఊదా, పసుపు, పీచ్, ముదురు ఎరుపు, ఆకుపచ్చ వంటి రంగులు… వాటిమీద పూలు, జామెట్రికల్ డిజైన్‌లు బాగుంటాయి. కంప్యూటర్, త్రీడీ, టూడీ ప్రింట్లూ మెప్పిస్తాయి. పోల్కాడాట్‌లు, హార్ట్‌షేప్‌లు, జంతువులు, పక్షుల చిత్రాలు వన్నె తెస్తాయి.
* ట్రెండ్‌లను అందిపుచ్చుకునేటప్పుడు సౌకర్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. బరువైన డ్రెస్‌ల జోలికి పోవద్దు. చుడీ, పటియాలా ప్యాంట్లు… లేయర్డ్ డిజైన్లు, పట్టు, టై అండ్ డై రకాలు, హ్యాండ్ పెయింటింగ్, బాందినీ, డిజైనర్, బ్రొకేడ్ దుస్తులకు దూరంగా ఉండటం మేలు. తడిస్తే అవి పాడవుతాయి. అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
* టీషర్ట్, ట్యూనిక్ టాప్‌లు… క్యాజువల్స్‌లా కనికట్టు చేస్తాయి. ఖాదీ గౌన్‌లు అనువుగా ఉంటాయి. కావాలనుకుంటే ఏ రకం దుస్తుల మీదకైనా జాకెట్, ట్రెంచ్‌కోట్స్ జత చేసుకోవచ్చు. ఈ కాలంలో నగలు ఎంత తక్కువగా ఉంటే అంత సౌకర్యం. క్విర్కీ డిజైన్లు, ఫ్యాన్సీ బీడ్ జ్యూయలరీ బాగుంటుంది. చెప్పుల్లో ఫ్లోటర్స్, రెయిన్‌ఫ్రూఫ్ హ్యాండ్‌బ్యాగ్స్, ఫ్లోరల్ రెయిన్ జాకెట్, చక్కటి గొడుగుతో మీ లుక్ అదిరిపోతుంది.