Health

చర్మం పొడిబారడానికి ఉప్పు కారణం

Your salt intake might be drying out your skin

కళ్ల అడుగున ఏర్పడే నల్లని వలయాల్ని పోగొట్టేందుకు ఏవో పూతలు వేసుకోవడమే కాదు…ఈ చిట్కాలూ పాటించి చూడండి. చాలా తక్కువ సమయంలో మార్పు కనిపిస్తుంది.
* ఆహారంలో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నా చర్మం తేమను గ్రహించే శక్తి కోల్పోతుంది. చర్మం పొడిబారి కంటికింద ఉబ్బినట్లు అవుతుంది. కొన్నాళ్లు ఉప్పు మోతాదు తగ్గించి చూడండి.
* దిండు గలేబుల్ని ఉతక్కుండా ఎక్కువ రోజులు వాడినా… వాటిపై పేరుకున్న క్రిములు చర్మానికి హాని చేయొచ్చు. ముఖ్యంగా కంటి కింది చర్మం నల్లగా ఉబ్బినట్లుగా మారుతుంది. వాటిని కనీసం పదిహేను రోజులకోసారి ఉతకడం మంచిది.
* ముఖానికి వేసుకున్న మేకప్‌ తొలగించకపోయినా ఈ సమస్య ఎదురవుతుంది. అలంకరణ సామగ్రిలోని రసాయనాలు చర్మానికి హాని చేయడమే కారణం. అలంకరణ తొలగించాకా కళ్ల చుట్టూ కొద్దిగా బాదంనూనె రాసి చాలా నెమ్మదిగా మర్దన చేస్తే ఈ సమస్య చాలామటుకూ ఎదురుకాదు.
* కళ్లపై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. ఎండలో బయటికి వెళ్లినప్పుడు చలువ కళ్లద్దాలు పెట్టుకోవడం మంచిది. బయటికి వెళ్లి వచ్చిన తరువాత చల్లని నీటిలో ముంచిన తువాలును కళ్లపై వేసి కాసేపు ఉంచితే ఉపశమనం ఉంటుంది.
* నాలుగు చెంచాలను రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టి, మరుసటి రోజు ఉదయం ఒక్కోదాన్ని ఒక్కో కంటి కింద కొంతసేపు ఉంచాలి. ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. కళ్లు తాజాగా కనిపిస్తాయి.
* ప్రతి రోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి. కంటికి ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి. అదే పనిగా కంప్యూటర్‌, ఫోన్లు చూడకూడదు. నిద్ర వల్ల వచ్చే ప్రశాంతతతో కంటి కింద చర్మంపై ఒత్తిడి తగ్గి, వలయాలు దూరమవుతాయి.