దేశీయ వంటకాల రుచులు బోరుకొట్టేశాయా.. విభిన్న విదేశీ ఫుడ్‌ను ఆస్వాదించాలనుకుంటున్నారా.. అయితే ఇంకెందుకు ఆలస్యం. సిటీలో ప్రస్తుతం రుచుల మేళవింపుతో పలు రెస్టారెంట్‌లు స్వాగతం పలుకుతున్నాయి. రెస్టారెంట్‌లలో ఇటాలియన్, మెక్సికో, చైనా, ఫ్రాన్స్, అఫ్గానిస్థాన్ తదితర దేశాల వంటకాలు నోరూరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి తమకు నచ్చిన వంటకాలను రుచి చూడాలంటే రూ.1000 నుంచి రూ.2,000 ఖర్చు చేస్తే చాలు. జిహ్వ తహతహ తీరుతుంది. ఫుడ్‌లవర్స్‌ను ఆకట్టుకునే వంటకాల సమాహారమే ఈ కథనం.
ఇరగదీసే ఇటలీ వంటకాలు..
ఒకప్పుడు ఇటలీకే పరిమితమైన ఫిష్, పొటాటోస్, రైస్, కార్న్, సాసేజెస్, ఫోర్క్, విభిన్న రకాల ఛీజ్‌లు.. తదితర వంటకాలు చవులూరిస్తున్నాయి. కార్న్ (మొక్కజొన్న)తో చేసే ‘పొలెంటా’ సిటీలో కూడా లభిస్తోంది. మా రుసి ఐడొని రెస్టారెంట్‌లో విభిన్న రకాల మాంసాహారం, పాస్తాలు అందుబాటులో ఉన్నాయి. ఇటాలియన్ వంటకాలను రుచి చూడాలంటే ఫిల్మ్‌నగర్‌లోని ‘థియా’ కిచెన్, బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌కు వెళ్లాల్సిందే. ఇద్దరు వ్యక్తులు ఇటాలియన్ రుచులను టేస్ట్ చేయాలంటే కనీసం రూ.1000– రూ.2వేలు వెచ్చిస్తే సరి.
మెక్సికన్.. మైండ్‌బ్లోయింగ్
సిటీలో మెక్సికన్ వంటకాలు మైండ్‌బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. స్పైసీగా ఉండాలి అంటే మాత్రం మెక్సికో వంటకాలను ఎంచుకోవాల్సిందే. భారతీయ వంటకాల శైలికి దగ్గరగా ఉండడం కూడా మెక్సికన్ క్యుజిన్‌ని సిటిజనులకు చేరువ చేసింది. వ్రోప్స్, నాథూస్, కేజూన్‌స్పైస్ వంటివి నగరంలో బాగా ఫేమస్. చిప్టోల్ చికెన్ నగర భోజనప్రియులు మెచ్చే స్టార్టర్‌గా పేరొందింది. టామ్రండ్ ప్రాన్స్ కూడా. ఇక మెక్సికన్ వంటకాలలో నగరవాసులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సూప్స్. టమాటో, కార్న్‌లతో పాటు తులసి ఆకుల్ని కూడా దీనిలో విరివిగా వినియోగిస్తుండడం ఈ వంటకాల ప్రాధాన్యాన్ని పెంచుతోంది. ఫ్యామిలీతో వెళ్లి మెక్సికన్ రుచులను ఆరగించాలంటే రూ.750 నుంచి రూ.2వేలు ఉండాల్సిందే.
థాయ్.. సూపరోయ్
విభిన్న రకాల సముద్రపు జీవులను వేటాడి మరీ వంటకాలుగా మార్చే ఈ క్యుజిన్ నగరవాసుల సీఫుడ్ సరదాను తీరుస్తోంది. ఉడికించిన, కాస్త కఠినంగా ఉండే రైస్, లెమన్‌గ్రాస్, స్వీట్ జింజర్, నూనెలు తక్కువగా ఉపయోగించే ఆరోగ్యకరమైన ఆహారశైలిగా దీనికి పేరు. నగరంలో తోఫూ, బేసిల్–లెమన్ సూప్, పహాడ్ క్రాపావొ వంటివి బాగా ఆదరణ పొందిన వంటకాలు. ఇక రొయ్యల వంటకాలంటే లొట్టలేసే ప్రియులకైతే థాయ్… సూపర్. థాయ్ వంటకాల కోసం తాజ్‌డెక్కన్‌లోని సిన్, జూబ్లీహిల్స్‌లోని అర్బన్ ఏసియా, రాడిసన్ బ్లూలోని హోలీ బేసిల్, బేగంపేట తాజ్ వివంతాలోని థాయ్ పెవిలియన్ రెస్టారెంట్‌లు బెస్ట్. ఇద్దరు కలిసి రుచులను టేస్ట్ చేయాలంటే రూ.500 నుంచి రూ.2వేలు ఖర్చు అవుతాయి.
అరేబియన్.. అదిరెన్…
అమెరికా క్యుజిన్‌ను పోలి ఉండే అరేబియన్ శైలి వంటకాలు నగరంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నాయి. కబ్సా, మురమురాలతో పాటు బఖాదరా వంటి డిసర్ట్‌లు కూడా నగరంలో ఫేమస్. అరేబియన్ వంటకాల్లో డ్రైఫ్రూట్స్ బాగా వినియోగించడం సిటీలో మరింత ఆదరణకు కారణమైంది. అరేబియన్ వంటకాల కోసం టోలిచౌకిలోని ఫోర్‌సీజన్స్ మంచి ఎంపిక. అరేబియన్‌ని ఆరగించాలి అంటే రూ.300నుంచి రూ.1000 వరకు అవుతాయి.
లెబనీస్.. యమ టేస్టీ బాస్..
డ్రైఫ్రూట్స్‌ను అధికంగా ఉపయోగించే లెబనీస్ శైలి వంటకాలు కూడా నగరంలో ఆదరణకు నోచుకుంటున్నాయి. శనగలు ఎక్కువగా వాడే వీరి వంటకాల్లో… ఆల్ షీమీ కోఫ్తాడజాజ్, ఖబ్సాలాహమ్ వంటివి నగరంలో రుచుల ప్రియులకు చేరువయ్యాయి. ఆలివ్ ఆయిల్‌తోఈ వంటకాలు చేయడం కూడా ఆరోగ్యప్రియుల ఆదరణకు కారణం. లెబనీస్ టేస్ట్ కోసం మాదాపూర్‌లోని ఆల్‌సీజన్స్ రెస్టారెంట్ బెస్ట్. రూ.500– రూ.1000 బిల్లు అవుతుంది.
గ్రీక్.. క్లిక్
లేట్‌గా వచ్చినా లే‘టేస్ట్’ అనిపించుకుంటున్నాయి గ్రీక్ వంటకాలు. రోజ్‌మేరీ, థైమ్, బేసిల్ (తులసి) వంటి హెర్బ్స్ (వివిధ రకాల ఆకులు) అధికంగా మేళవించే ఈ వంటకాలు ఇటీవలే నగరానికి పరిచయమయ్యాయి. వెరైటీ బ్రెడ్స్ కూడా ఈ క్యుజిన్‌కు స్పెషల్. ప్రస్తుతానికి వెజ్ ముసాకా, ఎమిస్టా వంటి వంటకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. జూబ్లీహిల్స్‌లోని బ్లూడోర్ రెస్టారెంట్ గ్రీక్ వంటకాల ప్రత్యేకం. దీనిలో టేస్ట్ చేయాలి అంటే ఇద్దరికి కనీసం రూ.1500 ఉండాల్సిందే.
అఫ్గాన్ వంటకాల.. అరియానా
ఆఫ్ఘనిస్తాన్ వంటకాలు సైతం ఇక్కడ ఆకట్టుకోవడం విశేషం. అక్కడి ప్రజల అభిరుచుల మేరకు తయారు చేసే వంటకాలన్నీ ఇప్పుడు నగరంలోని ఫుడ్డీలకు అందించడం హాట్‌టాపిక్. శుక్ర, శని, ఆదివారాల్లో నగరంలోని పలు రెస్టారెంట్‌లలో లభిస్తున్న విదేశీ వంటకాలను టెక్కీలు టేస్ట్ చేస్తున్నారు. ‘కుబిలీపులావ్’ భోజన ప్రియుల్ని లొట్టలేపిస్తుంది. బంజారాహిల్స్‌లోని ‘అరియానా బై సఫీ’ రెస్టారెంట్‌లో లభిస్తాయి. ఇద్దరికి కనీసం రూ.1000 ఉండాల్సిందే.