ఖమ్మం జిల్లా కొణిజర్లలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంచంలో పడుకుని ఉన్న వృద్ధురాలి పేరు అంబిక్ష లక్ష్మి. మండల కేంద్రానికి చెందిన ఆమెకు శివారు వెంకటాపురం రెవెన్యూ పరిధి సర్వే నెం.110లో ఎకరా పొలం ఉంది. సాదా బైనామా కింద 2017, జూన్ నెలలో పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేశారామె. వీఆర్వో నోటీసు అందజేయగా..ఆయన సూచన మేరకు సర్వే చేసిన పటం కూడా అందజేశారు. ఇదే సర్వే నెంబరు కింద మిగతా రైతులకు పాస్ పుస్తకాలు జారీచేసిన అధికారులు, తనకు అన్యాయం చేశారంటూ గత రెండేళ్లుగా వృద్ధురాలు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘రైతుబంధు’ సాయం కూడా దక్క లేదన్న మనో వేదనతో కొద్ది రోజుల క్రితం మంచాన పడ్డారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కుమారుల సాయంతో శనివారం ఆమె తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా మంచమేసుకుని పడుకున్నారు. కొత్త పాస్ పుస్తకం ఇచ్చేంత వరకు ఇక్కణ్నుంచి కదిలేది లేదంటూ భీష్మించారు. స్పందించిన తహసీల్దారు నారాయణమూర్తి బాధితురాలితో మాట్లాడారు. సెలవులో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారి రాగానే విచారణ చేపట్టి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధురాలు ఆందోళన విరమించారు.
పాసు పుస్తకం కోసం మంచం ఎక్కి నిరసనకు దిగిన ముసలవ్వ
Related tags :