అవినీతికి పాల్పడే అధికారులు, ప్రజాసేవకులను దేశద్రోహులుగా ప్రకటించాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అవినీతి ఆరోపణలతో సస్పెండైన పి. శరవణన్ అనే వీఆర్వో మార్చి 28న చేసిన పిటిషన్ ను విచారిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం సుబ్రహ్మణ్యం ఈ విధంగా వ్యాఖ్యానించారు.
న్యాయవ్యవస్థలో అవినీతి భారత రాజ్యాంగానికి అతి పెద్ద శత్రువుగా ఆయన అభివర్ణించారు.
వివిధ రూపాల్లో పెచ్చురిల్లిపోతున్న అవినీతిని అరికట్టడానికి న్యాయవ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వోద్యోగికి లంచం ఇవ్వడమనేది దేశంలో ఒక పెద్ద జాఢ్యంగా మారిందని, పుట్టబోయే బిడ్డకు కూడా ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇస్తేనే పనవుతుందన్న విషయం తెలుసని అన్నారు.
దేశాభివృద్ధికి అడ్డుగా నిలిచే అవినీతి అధికారులు దేశద్రోహుల లెక్కలోకే వస్తారని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
దేశంలో అలజడులు సృష్టించి, పురోగతిని అడ్డుకునే ఉగ్రవాదులకు, అవినీతి అధికారులకు మధ్య పెద్ద తేడా లేదని ఆయన అన్నారు. అవినీతిపరులు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో నేడు నెలకొన్న పరిస్థితులపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని ప్రభుత్వ సంస్థల్లో అయితే.. తమ పని తాము సక్రమంగా చేయడానికి కూడా లైంగిక అవసరాలు తీర్చాలంటూ మహిళలను వేధిస్తున్నారని గుర్తుచేశారు. ఇంతకంటే దారుణమేముంటుందంటూ ఆయన వ్యాఖ్యానించారు.
”మనిషి పుట్టినప్పటి నుంచి కాటికి వెళ్లేవరకూ అడుగడుగునా లంచాలతో వ్యవస్థ నిండిపోయింది.
ఆఖరికి ఒక మృతదేహానికి పద్ధతిగా అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా లంచం చెల్లించాల్సిన దారుణ పరిస్థితుల్లోకి దేశం పడిపోయింది” అని న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల వేళ రాజకీయ పార్టీల అవినీతికి అడ్డు అదుపులేకుండా పోయిందని.. ప్రజలను డబ్బులతో మభ్యపెట్టి ఓట్లను కొనుక్కున్నాయని మండిపడ్డారు.
చట్టాలను అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులే వాటిని తుంగలో తొక్కి.. పదవీ వ్యామోహంతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యం విలువలు నిలబడాలన్నా.. రాజ్యాంగాన్ని గౌరవించాలన్నా.. అవినీతిపరులందరినీ దేశద్రోహులుగా పరిగణించాల్సిందేనని సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.