Fashion

మీ అందానికి స్మార్ట్ అద్దాలు

Smart Mirrors Enhance Your Fashion Experience

ఎంత తీరికలేకపోయినా రోజులో కనీసం ఐదు నిమిషాలైనా అద్దం ముందు నిల్చుంటాం కదూ… అదే అద్దానికి ఇప్పుడు సాంకేతికత తోడై ఆధునికంగా అందుబాటులోకి వచ్చేసింది. అలాంటివే ఇవి.

* అద్దమే అందాల పాఠాలు చెబితే ఎలా ఉంటుంది… ఈ స్మార్ట్‌ మేకప్‌ అసిస్టెంట్‌ మిర్రర్‌ అదే చేస్తుంది. ఈ అద్దం పైభాగం టచ్‌ స్క్రీన్‌లా పనిచేస్తుంది. ఎంత సమయంలో అలంకరణ పూర్తికావాలనేది ఈ తెరపై ఉండే టైమర్‌ హెచ్చరిస్తుంది. చర్మ సంరక్షణ, అలంకరణకు సంబంధించిన పాఠాలు ఈ తెరపై కనిపిస్తాయి. సందర్భాన్ని బట్టి అలంకరణ చిట్కాలు దీనిపై కనిపిస్తాయి. దీని తయారీలో ప్రత్యేకంగా 38 ఎల్‌ఈడీలు, ఒక స్మార్ట్‌ చిప్‌ను అమర్చారు. సహజ సూర్యకాంతిలాంటి వెలుతురు దీన్నుంచి వస్తుంది. క్షణాల్లో చేసుకోవాల్సిన అలంకరణకు సంబంధించిన వీడియోలూ దీనిపై చూడొచ్చు. ఎప్పటికప్పుడు కొత్తపాఠాలు వచ్చేస్తుంటాయి. ఈ అద్దంపై ఉండే బటన్ల సాయంతో దీన్ని ఉపయోగించొచ్చు.

* చీకటిగా ఉన్న ప్రదేశంలో ముఖానికి చిన్నపాటి టచప్‌ ఇవ్వాలనుకుంటున్నారా… మీలాంటివారికోసమే ఈ బ్యాటరీ ప్యాక్డ్‌ కాంప్యాక్ట్‌ మిర్రర్‌. దీనికి రెండు అద్దాలు ఉంటాయి. ఒకటి సాధారణ రకంలా పనిచేస్తే, మరొకటి ప్రతిబింబాన్ని మూడు రెట్లు పెద్దదిగా చేసి చూపిస్తుంది. 3000 ఎమ్‌ఏహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ సాయంతో ఇది పనిచేస్తుంది. అద్దం చుట్టూ ఏర్పాటు చేసిన తెర ఎల్‌ఈడీలతో అనుసంధానించి ఉంటుంది. దీనిపై ఉన్న మీట నొక్కితే వాడుకోవచ్చు. వెలుగు సరిగ్గా లేనప్పుడూ సులభంగా మేకప్‌ వేసుకోవచ్చు. యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జింగ్‌ పెట్టుకోవచ్చు.

* అలంకరణ చేసుకునే వేళ… వెలుతురును మనకు నచ్చినట్లుగా మార్చేస్తుంది ఈ జూనో స్మార్ట్‌ మేకప్‌ మిర్రర్‌. సాధారణ సూర్యకాంతి, పగటి సమయంలో ఉండే వెలుగు, సాయంత్రం వేళలో మరోలా.. ఇలా ఏది కావాలన్నా చిన్న మీట సాయంతో మార్చేసుకోవచ్చు. మూడు రకాల వెలుగులతో మీ చర్మ రంగుకు నప్పే అలంకరణ ఛాయల్ని ఎంచుకోవడానికి ఈ అద్దం ఉపయోగపడుతుంది. ఫోనులో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని ఈ అద్దాన్ని వాడుకోవచ్చు. దీని అడుగున ఏర్పాటు చేసిన లైటును చదువుకునేటప్పుడు వాడుకోవచ్చు.