1. రేపటి నుంచి తిరుచానూరు ఆలయంలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ
తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో అంగప్రదక్షిణ టోకెన్ల జారీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించనున్నారు. తిరుమల తరహాలో తిరుచానూరులో కూడా అంగప్రదక్షిణ టోకెన్లు జారీ చేసే విధానానికి తితిదే శ్రీకారం చుట్టింది. ప్రతిరోజు ఉదయం 4.30గంటలకు, శుక్రవారం రోజున 3.30గంటలకు భక్తులను ఆలయంలో అంగప్రదక్షిణ చేసేందుకు అనుమతించనున్నారు. ఇందుకు సంబంధించి అమ్మవారి ఆస్థాన మండపం కింది భాగంలోని సెల్లారు క్యూలైన్లలోని కౌంటర్లో టోకెన్లు ఇవ్వనున్నారు.శుక్రవారం 150వంతున, మిగిలిన రోజుల్లో వంద చొప్పున టోకెన్లు ఇస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు ముందు రోజు సాయంత్రం 4గంటలకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కౌంటర్ ద్వారా టోకెన్లు ఉచితంగా పొందవచ్చని ఆలయ డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి తెలిపారు.
2. తితిదే వసతి సముదాయాలగదుల బుకింగ్లో మార్పులు
తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో గదుల బుకింగ్లో తితిదే స్వల్ప మార్పులు చేట్టింది. విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయిస్తారు. గదులు పొందిన సమయం నుంచి 24 గంటలలోపు ఖాళీచేయాల్సి ఉంటుంది. శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో అన్ని గదులను ఆన్లైన్లో భక్తులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం 8 నుంచి మర్నాడు ఉదయం 8గంటల వరకు 24గంటల పాటు స్లాట్ విధానం అమలు కానుంది. భక్తులు బుక్ చేసుకునే సమయానికి కంటే ఆలస్యంగా చేరుకున్నా నిర్దిష్ట సమయానికే ఖాళీచేయాల్సి ఉంటుంది. ఈ విధానం జులై ఒకటి నుంచి అమలులోకి రానుంది.
3.తెలుగు రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
తితిదే శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జులై 4 నుంచి 27 వరకు శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు. 4న మంగపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో, 5న భూపాలపల్లిలోని సింగరేణి క్రీడా మైదానం,, 6న రేగొండ మండలం కొడవతంచ గ్రామంలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ ంలో, 7న ములుగు రామాలయంలో, 8న పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, 10న జనగాంలోని పాత బీట్బజారులో, 11న స్టేషన్ ఘన్పూర్లోని బాలికల ఉన్నత పాఠశాల, 12న ఐనవోలు శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ ం, 13న మహబూబాబాద్లోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణం, 14న తొర్రూర్లోని కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో, 15న వరంగల్ కోట (పడమర)లో కల్యాణాలు జరగనున్నాయి.
4. వారికి రూ.కోటి విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి కాకినాడకు చెందిన చిక్కాల చౌదరయ్య(తాతయ్య) రూ.1,00,01,116 విరాళాన్ని శనివారం రాత్రి సమర్పించారు. తిరుమలలో తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై.వి.సుబ్బారెడ్డిని కలిసి విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు కింద డిపాజిట్ చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా వై.వి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దాతలు ఇచ్చే విరాళాలను భక్తకోటి కోసం పారదర్శకంగా వినియోగిస్తామని, వారికి స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను గతంలో రూ.10 లక్షల విరాళాన్ని అందించానని, ఈ సారి రూ.కోటి ఇచ్చినట్లు దాత తాతయ్య తెలిపారు.
5. చినవెంకన్న సేవలో హైకోర్టు న్యాయమూర్తి
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యామ్ప్రసాద్ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లుచేశారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం స్వామి, అమ్మవార్లను వారు దర్శించుకుని పూజలు చేశారు. ఈవో దంతులూరి పెద్దిరాజు శ్రీవారి జ్ఞాపికను బహూకరించారు.
6. 1న తాడేపల్లిలో చండీయాగం పూర్ణాహుతి-జరుకానున్న ముఖ్యమంత్రి
అమరావతి పరిధి తాడేపల్లి సీఎస్సార్ కల్యాణ మండపంలో జులై 1న నిర్వహించే శ్రీమహారుద్ర సహిత ద్విసహస్ర చండీయాగం త్రయో వింశతి మాస దీక్షాంత పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఆరిమండ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్లో 2017 జులై 29 నుంచి చండీయాగం నిర్వహిస్తున్నారు. పూర్ణాహుతి కార్యక్రమాన్ని తాడేపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణ, జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు.
తితిదే గదుల రిజర్వేషన్లలో మార్పులు
Related tags :