ఓటమి ఫుల్ స్టాప్ కాదని కేవలం కామా మాత్రమేనని చెప్పుకొచ్చారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఓటమి చెందినంత మాత్రాన ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఓటమి విజయానికి నాందిగా మలచుకోవాలని సూచించారు. తాను కూడా 15ఏళ్ల తర్వాత తిరిగి అసెంబ్లీలో అడుగపెట్టానని చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లా గుజరాతీపేట శాంతినగర్ కాలనీలో కళింగ సేవా సమితి కార్యాలయంలో తమ్మినేని సీతారాంకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. నీతి, నిజాయితీ, పట్టుదల, ఓర్పు, కార్యదీక్షతతో పోరాడితే విజయ శిఖరాలను చేరుకోవచ్చనని స్పష్టం చేశారు.
తనపై పూర్తి విశ్వాసం, నమ్మకంతో స్పీకర్ పదవి అప్పగించడమంటే యావత్ కళింగసామాజిక వర్గానికి సీఎం జగన్ పెద్దపీట వేశారనడానికి నిదర్శనమన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ కళింగ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు.
తాను గత 15 ఏళ్లుగా రాజకీయాల్లో ఎన్నో అవమానాలు, పరాభవాలు ఎదుర్కొన్నానని తెలిపారు. వాటిని తలచుకుంటూ ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి విభజనకు సంబంధించిన అనేక అంశాలపై చర్చిస్తున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళింగ కులస్థులను బీసీ-ఏలో చేర్చే విషయంపై సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తేనున్నట్టు తెలిపారు.
గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న దివంగత ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కూడా తన మాటకు ఎంతో గౌరవం ఇచ్చావారని తెలిపారు. రాజకీయాల్లో అందర్నీ కలుపుకుంటూ పోతూ నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలన్నదే తన అభిమతమని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు.