WorldWonders

కిలో ఇడ్లీ పిండి కొంటే బిందె నీళ్లు ఫ్రీ

Buy 1Kilo Idly Batter And Get Water For Free-Offer In Chennai

చెన్నై ప్రజలు నీళ్లు లేక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. అందుకే సిటీ పక్కన ట్రిప్లికేన్‌‌ (తిరువల్లికేని)లో ఉన్న ఓ దుకాణా వ్యాపారి ఓ మంచి ఐడియా వేశారు. ‘కిలో ఇడ్లీ, దోశ పిండి కొంటే బిందె నీళ్లు ఫ్రీ’ అని షాపు బయట బోర్డు పెట్టారు. బకెట్లు, బిందెలు కస్టమర్లే తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఆయన పేరు సీఎన్‌‌ పార్థసారథి. ట్రిప్లికేన్‌‌లోని బీవీ నైకర్‌‌ వీధిలో కిరాణా షాపు నడుపుతున్నారు. ఫ్రీగా నీళ్లిచ్చి వ్యాపారం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని, తనకు వచ్చే లాభంతో ప్రైవేట్‌‌ ట్యాంకర్‌‌ నుంచి నీళ్లు కొని ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు. ఈ ఐడియా తనకు వచ్చింది అన్నారు. ‘రెండు దశాబ్దాలుగా ఇక్కడ బిజినెస్‌‌ నడుపుతున్నాం. ఇక్కడి ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం అని నాన్న చెప్పారు. ఓ ప్రైవేట్‌‌ వాటర్‌‌ ట్యాంకర్‌‌తో నీళ్లిద్దామని ముందు అనుకున్నాం. కానీ ఇబ్బందులు ఎదురవుతుయాని కస్టమర్లు చెప్పారు. అందుకే ఈ ఐడియా. నీటి కొరత తీరే వరకు ఇలా నడిపిస్తూనే ఉంటాం’ అన్నారు. తన ‘హోల్‌‌ ఇన్‌‌ ద వాల్‌‌’ షాప్‌‌లో రోజుకు వంద మంది వరకు పిండి కొంటారని.. వాళ్లలో 10, 15 మందే నీళ్లు తీసుకుంటారని చెప్పారు. తామిచ్చిన నీళ్లను తాగే ముందు వేడి చేసుకోవాలన్నారు. ఈ రోజుల్లో సర్వీస్‌‌ చేస్తున్నా కాస్త జాగ్రత్తగా చేయాలని చెప్పారు. నీటి ఎద్దడిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా ప్రజలు కూడా తమకు చేతనైనంత చేస్తే బాగుంటుందన్నారు. ట్రిప్లికేన్‌‌లో బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో ఇక్కడి వారు నీళ్లున్న ప్రాంతాలకు వెళ్లున్నారని షాప్‌‌లో పని చేసే రాజా అనే ఉద్యోగి చెప్పారు.