ఏపీ సీఎం వైయస్ జగన్ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వారికి సొమ్ములు చెల్లించడంలో జాప్యం చేయడం దురదృష్టకరమన్నారు.
ఖరీఫ్ సీజన్ కి సంబంధించి వ్యవసాయ పెట్టుబడి కోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. బకాయిలు చెల్లించకుండా రైతంగానికి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచకుండా వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఇటీవల తనను కలిసిన రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి బకాయిలు, విత్తనాలు కోసం పడుతున్న పాట్లుపై తన వద్ద మెురపెట్టుకున్నారని తెలిపారు. రైతులకు చెల్లించాల్సిన మెుత్తం బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని విత్తనాలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.610 కోట్లు రైతుల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఒక్క పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.240 కోట్లు ఇవ్వాల్సి ఉందంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు.
ఇకపోతే తూర్పు గోదావరి జిల్లాలో రూ.176 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.94 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఇప్పటికైనా ఆ సొమ్మును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల రైతులు విత్తనాల కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాల కోసం అర్థరాత్రి వరకు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
అనంతపురం జిల్లాలో ఈ ఏడాది వేరుశనగ పంట 4.96 లక్షల హెక్టార్లలో వేరుశనగ వేస్తారని అందుకు 3 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. అయితే కేవలం 1.8లక్షల క్విటాళ్ల విత్తనమే వచ్చిందని ప్రభుత్వం ఇచ్చే చోట విత్తనం దొరకడం లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు ప్రైవేట్ వ్యక్తులు బయట అమ్మకాలు చేస్తున్నారని ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మెుద్దు నిద్రపోతుందన్నారు. విత్తనాలు పక్కదారిపట్టడం ఎక్కడ లోపమో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు పక్కదారిపట్టడంపై విచారణ చేయకుండా తిరిగి రైతులపైనే అధికారులు నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.
ఉత్తరాంధ్రలో వరి పంటకు సంబంధించి విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పరిస్థితిని సమీక్షఇంచాలని రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా పొలంలో ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునేలా చేయాలని జనసేన అధినే త పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.