Politics

మీకు బ్రేక్ పడుద్ది

Vijaya Shanthi Warns KCR That His Time Will Come

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ  కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి. అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందనే నియంతృత్వ ధోరణితో కేసీఆర్ వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.  నియంతృత్వ ధోరణితో వ్యవవహరించే ప్రభుత్వాలన్నిటకీ ఎక్కడో ఒకచోట స్పీడ్ బ్రేక్ పడుతుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటికే పలుమార్లు స్పీడ్ బ్రేక్ లు పడినా సీఎం కేసీఆర్ వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. 

కొత్తగా నిర్మించ తలబెట్టన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం మెుండి వైఖరి అవలంభిస్తోందంటూ విరుచుకుపడ్డారు. భవనాల నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు. 

పాత అసెంబ్లీ భవనాన్ని ఎందుకు కూలుస్తున్నారని ప్రతిపక్షాలు అడిగితే అసెంబ్లీని కూల్చివేతపై ప్రశ్నించే అర్హత లేదని ప్రతిపక్షాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిచండం దారుణమన్నారు. 

సచివాలయం, అసెంబ్లీ భవనాల కూల్చివేతపై హైకోర్టు అడిగిన ప్రశ్నకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పకుండా పోయిందని విమర్శించారు. పోనీ సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సంబంధించి ప్లాన్ లను అడిగితే ఇంకా ప్లాన్ లు నిర్ధారణ కాలేదని ఏజీ కోర్టులో చెప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. 

ఎలాంటి ప్రణాళిక లేకుండా, ఇష్టానుసారం తమను అడిగే నాధుడు లేడన్న ధైర్యంతో టీఆరెస్ పాలకులు ఎన్ని తప్పులు చేస్తున్నారో అన్న అనుమానం సామాన్యులకు కలుగుతుందన్నారు విజయశాంతి. 

హైకోర్టు జోక్యంతోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం పడుతుందేమో చూడాలన్నారు. ముఖ్యమంత్రి అడంబరాలకు పరిమితం అయ్యారని విజయశాంతి విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే దొంగలు రాజ్యమేలుతున్నట్లు ఉందన్నారు. 

మరోవైపు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీనే ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఇంచార్జ్ కుంతియా పర్యవేక్షణపై అయోమయంలో ఉన్నామని చెబుతున్నారని తెలిపారు. కుంతియాపై ,ఇప్పటికే పార్టీ ఆదేశానుసారం తనకు విశ్వాసం ఉందన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయన్నారు విజయశాంతి.