Editorials

Dont Fire The Fire….

Dont Fire The Fire....Trump Warns Iran

పలు దేశాలతో 2015లో చేసుకున్న అణు ఒప్పందంలోని అంశాలను ఇరాన్‌ తొలిసారి అతిక్రమిస్తూ యురేనియం నిల్వలను పెంచుకుంది. ఈ విషయంపై తాజాగా ప్రకటన చేసింది. దీన్ని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ కూడా నిర్ధారించింది. అమెరికా తమపై విధించిన ఆంక్షలను సడలించడానికి యూరప్‌ సాయం చేయాలని డిమాండ్ చేస్తున్న ఇరాన్‌.. ఈ చర్య ద్వారా దానిపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది. దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నిప్పుతో ఆడుతున్నారు’’ అంటూ ‌హెచ్చరించారు. తాము చాలా కఠిన చర్యలు తీసుకునే స్థితిలో ఉన్నామని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చేసుకున్న అణు ఒప్పందం నుంచి అమెరికా గతేడాది బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. తాము యురేనియం నిల్వలను పెంచుకున్నట్లు ఇరాన్‌ నుంచి ప్రకటన రాగానే అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో కూడా ఈ విషయంపై స్పందించి హెచ్చరికలు చేశారు. ‘‘ఇరాన్‌ అణ్వస్త్ర చర్యలు ఆ దేశానికి, ప్రపంచానికి ముప్పు. దీనిపై కొత్త, సమగ్రమైన ఒప్పందం చేసుకుని చర్చలు జరపడంతో పాటు, అంతర్జాతీయ శాంతి, భదత్రలకు పొంచి ఉన్న ముప్పును పరిష్కరించేందుకు నిబద్ధతతో ఉన్నాం’’ అని కూడా ప్రకటించారు. ఇరాన్‌ తమ అణు కార్యక్రమ చర్యలు కొనసాగిస్తున్నంత వరకు ఆర్థికపర ఒత్తిడి, దౌత్యపరంగా ఒంటరి అవ్వడం వంటి పరిణామాలు తీవ్రతరం అవుతూనే ఉంటాయని హెచ్చరించారు. ఆ దేశం తమ అణు లక్ష్యాలను చేరుకోవడంలో కొత్త చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో శ్వేత సౌధంలో ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘‘ఇరాన్‌కు నేను ఏ సందేశమూ ఇవ్వట్లేదు. వారు ఏం చేస్తున్నారో వారికి తెలుసు. వారు దేనితో ఆడుతున్నారో వారికి తెలుసు. వారు నిప్పుతో ఆడుతున్నారని నేను భావిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.