Sports

హమ్మయ్య సెమీస్‌కు చేరిన భారత్

India Confirms SemiFinals Berth By Beating Bangladesh In CWC 2019

గెలిచారు.. కోరుకున్నట్లు కాదు! సెమీస్‌ బెర్తు సాధించారు.. కానీ సాధికారికంగా కాదు! పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లారు.. అయినా అనుకున్నంత సంతోషం లేదు! ఓపెనర్లు 30 ఓవర్లలోపే 180 పరుగుల ఆరంభాన్నిస్తే.. ఎంత స్కోరు చేయాలి? కనీసం 350! కానీ 314 పరుగులకే పరిమితం! ప్రత్యర్థి జట్టు 179 పరుగులకే 6 వికెట్లు కోల్పోతే.. ఇన్నింగ్స్‌ను ఎంతకు ముగించాలి? మహా అయితే 230! కానీ 286 పరుగులు చేయనిచ్చారు! నాకౌట్‌కు చేరువయ్యే కొద్దీ తప్పుల మీద తప్పులు చేస్తూ ఆందోళన పెంచుతున్న టీమ్‌ఇండియా.. సెమీస్‌ బెర్తు ఖరారైన మ్యాచ్‌లో మరింతగా కంగారు పెట్టింది. భారీ విజయం ఖాయమనుకున్న మ్యాచ్‌లో అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేక.. ఏదో గెలిచామంటే గెలిచామనిపించింది. మ్యాచ్‌ పోయిందనుకున్నాక కూడా పట్టు వదలకుండా పోరాడిన బంగ్లా.. శభాష్‌ అనిపించుకుంటూ ప్రపంచకప్‌ నాకౌట్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు పోరాట స్ఫూర్తి సెమీస్‌ ముంగిట భారత్‌కు ఒక పాఠమే! ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ గెలుపు బాట పట్టింది. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండు రోజుల కిందట ఇంగ్లాండ్‌ చేతిలో కంగుతిన్న కోహ్లీసేన.. అదే మైదానంలో మంగళవారం బంగ్లాదేశ్‌ను 28 పరుగుల తేడాతో ఓడించింది. పాయింట్లను 13కు పెంచుకుని పట్టికలో రెండో స్థానానికి చేరిన భారత్‌.. సెమీస్‌ బెర్తును కూడా ఖరారు చేసుకుంది. మొదట భారత్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (104; 92 బంతుల్లో 7×4, 5×6), కేఎల్‌ రాహుల్‌ (77; 92 బంతుల్లో 6×4, 1×6) జట్టుకు అద్భుత ఆరంభాన్నివ్వగా.. చివర్లో రిషబ్‌ పంత్‌ (48; 41 బంతుల్లో 6×4, 1×6) రాణించాడు. 350 దాటేలా కనిపించిన భారత్‌కు ముస్తాఫిజుర్‌ (5/59), షకిబ్‌ (1/41) కళ్లెం వేశారు. అనంతరం బంగ్లా ఛేదనలో గట్టిగానే పోరాడినా.. చివరికి 48 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. షకిబ్‌ అల్‌హసన్‌ (66; 74 బంతుల్లో 6×4) టాప్‌స్కోరర్‌. హార్దిక్‌ పాండ్య (3/60), బుమ్రా (4/55) బంగ్లాను దెబ్బ తీశారు. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. భారత్‌ శనివారం తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకను ఢీకొంటుంది.