తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) తేజస్ నుంచి బాహ్య ఇంధన ట్యాంకు ఊడి పడిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు ప్రాంతంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఆ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ ట్యాంకు కనపడింది. తేజస్ విమానాలు 2001 నుంచి గగనతలంలో ఎగురుతున్నాయి. అయితే, ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి. మంగళవారం తేజస్ నుంచి కిందపడిన ట్యాంకు భారతీయ వైమానిక దళానికి చెందింది. ఈ విమానం సూలూరు ఎయిర్‌బేస్ నుంచి గాల్లోకి ఎగిరింది. ‘‘కోయంబత్తూరుకి సమీపంలోని సూలూరు ఎయిర్‌బేస్ నుంచి తేజస్ యుద్ధ విమానం వెళ్తుండగా ఈ రోజు ఉదయం 8.40 గంటలకు ఒక ఇంధన ట్యాంకు దాని ఊడి పడిపోయింది. ఈ ఘటన అనంతరం ఆ యుద్ధ విమానం సురక్షితంగానే దిగింది. దీని వల్ల ఎవరికీ ఏ నష్టం జరగలేదు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం’’ అని ఐఏఎఫ్ ఓ ప్రకటన చేసింది. ట్యాంకు కిందపడడంతో సూలూరులోని చిన్నియంపాలయం ప్రజలు దానిని గుర్తించి కోయంబత్తూరు పోలీసులకు తెలిపారు. దీంతో ఐఏఎఫ్ నుంచి సిబ్బంది అక్కడకు చేరుకుని ఆ ట్యాంకును స్వాధీనం చేసుకొన్నారు. ఈ ట్యాంకును చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. ఈ ఇంధన ట్యాంకులో 1200 లీటర్ల ఇంధనాన్ని నింపొచ్చు.
భారత యుద్ధ విమానాల దుర్భర దుస్థితి ఇది
Related tags :