WorldWonders

ఒక చిన్న చదరంగ పావు…₹6కోట్లకు అమ్ముడుపోయింది

A Chess Coin Auctioned For 6.3Crore INR

ప్రాచీన కాలానికి చెందిన ఓ చదరంగం పావు.. లండన్‌లో జరిగిన వేలంపాటలో ఏకంగా రూ. 6.3 కోట్లకు అమ్ముడుపోయింది. సుమారు 900 ఏళ్ల కిందటి లెవిస్‌ చెస్‌మ్యాన్‌ పావును 1964లో ఓ వ్యక్తి కేవలం ఐదు పౌండ్ల (రూ. 430)కి కొనుగోలు చేశాడు. లండన్‌ సౌత్‌బైలో మంగళవారం జరిగిన వేలంపాటలో ఓ గుర్తుతెలియని బిడ్డర్‌ ఈ పావును 7.35 లక్షల పౌండ్ల (రూ. 6.3 కోట్ల)కు సొంతం చేసుకున్నాడు. సైనిక యోధుడి రూపంలో ఉన్న ఈ పావు 8.8 సెంటీమీటర్ల పొడవు ఉంది. 12వ శతాబ్దానికి చెందిన వార్లస్‌ అనే సముద్ర జంతువు దంతంతో ఈ పావును తయారు చేశారు. నార్సె యోధుల రూపంలో లెవిస్‌ చెస్‌మ్యేన్‌ పావులు ఉంటాయి. యూరోపియన్‌ చరిత్రలో వైకింగ్‌ శకానికి (క్రీ.శ. 800 నుంచి 1066 మధ్యకాలం) చెందిన ఈ కాలపు కళాకృతులు ఎంతో విశిష్టమైనవి. వీటికి మార్కెట్‌లో గొప్ప ధర పలుకుతుంది. రూర్క్‌ (చదరంగంలో ఏనుగు)ను తలపిస్తున్న ఈ పావును స్కాటిష్‌ ప్రాచీన కళాకృతుల డీలర్‌ వద్ద మొదట కనుగొన్నారు. ఇలాంటి చదరంగం పావులు 1831లో స్కాట్లాండ్‌లోని ఇస్లే ఆఫ్‌ లెవిస్‌లో పెద్ద ఎత్తున లభించాయి. మొత్తం ఐదు సెట్ల చెస్‌ పావులు అక్కడ దొరికాయి. వాటి నుంచి అదృశ్యమైన ఈ చెస్‌పావు.. కాలక్రమంలో అనేకమంది చేతులు మారుతూ.. చివరకు గత మంగళవారం లండన్‌లో వేలంపాటకు వచ్చినట్టు భావిస్తున్నారు. 1964లో ఎడిన్‌బర్గ్‌కు చెందిన డీలర్‌ తమ నుంచి ఈ చెస్‌ పావును రూ. 430కి కొనుగోలు చేసినట్టు స్కాటిష్‌ డీలర్‌ కుటుంబం ప్రతినిధి తాజాగా మీడియాకు తెలిపారు.