1. దిల్లీ లాల్ దర్వాజాలో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు – ఆద్యాత్మిక వార్తలు
లాల్దర్వాజా బోనాల ఉత్సవాలు మంగళవారం దిల్లీలోని తెలంగాణ భవన్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బోనాలు ప్రారంభమై 111 సంవత్సరాలు కావడంతో అదే సంఖ్యలో ఏర్పాటు చేసిన చిత్రప్రదర్శనను తెరాస ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, పి.రాములు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి తేజావత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. లాల్దర్వాజా మహంకాళి శ్రీ సింహవాహిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు మత సామరస్యానికి ప్రతీకలన్నారు. నాడు మూసీ నది..వరదలతో భాగ్యనగరాన్ని ముంచెత్తడంతో నిజాం ప్రభువులు పూజలు చేయడం వల్ల అమ్మవారు శాంతించారన్న విశ్వాసంతో ఇలా ఉత్సవాలు చేస్తున్నారన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపేలా రాష్ట్రప్రభుత్వం దేశరాజధానిలో వీటిని నిర్వహిస్తోందన్నారు.
2. 16న ద్వారకాతిరుమల ఆలయం మూసివేత
చంద్ర గ్రహణం సందర్భంగా ఈనెల 16న ద్వారకాతిరుమల ఆలయాన్ని అధికారులు మూసివేయనున్నారు. 16వ తేదీ సాయంత్రం 4.30గంటల నుంచి 17వ తేది ఉదయం 5.30గంటల వరకు మూసివేయనున్నారు. 16వ తేదీ వాహన సేవలు.. 17వ తేది సుప్రభాత సేవలు రద్దు చేశారు
3. దేవాదాయశాఖలో అక్రమ పదోన్నతుల నిలిపివేత
దేవాదాయ శాఖలో ఎన్నికలకు ముందు కొందరికి గ్రేడ్-3 కార్యనిర్వహణాధికారులుగా ఇచ్చిన పదోన్నతులతో పాటు మొత్తం ప్రక్రియను నిలుపుదల చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవాదాయ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులకు అప్పట్లో గ్రేడ్-3 ఈవోలుగా పదోన్నతులిచ్చారు. నిజానికి ఈ పోస్టులను పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా నేరుగా భర్తీ చేయాలి. ఈ విధానాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినందున దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయకల్లంతోనూ చర్చించాక ఈ పదోన్నతులను ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించారు. దాదాపు 80కి పైగా పోస్టులు ఇలా భర్తీ చేసేందుకు రంగం సిద్ధం కాగా.. ఇప్పటికే 40 మందికిపైగా పదోన్నతులకు సంబంధించి ఉత్తర్వులు వెలువడ్డాయని సమాచారం. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ ప్రక్రియ నిలిచిపోతుంది.
4. భక్తి శ్రద్ధలతో వృషభోత్సవం
కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో మట్టి ఎద్దుల అమావాస్యకు ఎంతో ప్రత్యేకత ఉంది. మంగళవారం ఆ అమావాస్యను పురస్కరించుకుని ఆదోని, ఆలూరు నియోజకవర్గాల్లో పండగ వాతావరణం కన్పించింది. ఏటా ఖరీఫ్ ప్రారంభంలో వచ్చే అమావాస్య రోజున రైతులకు వ్యవసాయంలో తోడుగా నిలిచే వృషభాలకు ప్రత్యేకంగా పూజలు చేయడం తరతరాలుగా వస్తోంది. ఆ రోజు ఉదయాన్నే చెరువు గట్టుకు వెళ్లి మట్టిని తీసుకొచ్చి వృషభాల ప్రతిమలను తయారు చేస్తారు. ఆ తర్వాత పొలాల్లో ఉంచి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. పిల్లాపాపలతో రైతులు సంతోషంగా వేడుకను జరుపుకొంటారు. చివరగా సాయంత్రం చిన్నారులు మట్టి ఎద్దులతో పార్వేట నిర్వహిస్తారు.
5. 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణ మహోత్సవాలు ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక పొరుగు రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు సకల ఏర్పాట్లు జరుగుతున్నాయి. 9వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 12.30 గంటల వరకు అమ్మవారి కల్యాణ వేడుకలు జరుగుతాయి. అంతుకు ముందు 8న సోమవారం ఉదయం 5.30 గంటలకు గణపతి పూజతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. 10న బుధవారం ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీహోమం, సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై ప్రతిష్ఠించి ఇక్కడి పురవీధుల్లో ఊరేగిస్తారు. రథోత్సవం దేవాలయం నుంచి ప్రారంభమై తిరిగి దేవాలయానికి చేరుకోవడంతో మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ముగుస్తాయి. కల్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను గురించి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, కార్పొరేటర్ ఎన్.శేషుకుమారిలు దేవాలయ ఈవో ఎన్.వి.శర్మతో పాటు జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, రెవెన్యూ, వైద్యం, పోలీస్, ఆర్అండ్బీ, ఆర్టీసీ, అగ్నిమాపక విభాగాల అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.
6. రేపు నగరంలో ఘనంగా జగన్నాథ రథయాత్ర
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రను నగరంలోని అబిడ్స్ ఇస్కాన్ హరేకృష్ణ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 4న ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కన్వీనర్ వేదాంత చైతన్యదాస్, సభ్యుడు వరదదాస్ కృష్ణ పేర్కొన్నారు. మంగళవారం అబిడ్స్లోని ఇస్కాన్ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అబిడ్స్ ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వార్షిక జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు వివరించారు. ఈనెల 4వ తేదీన ఉదయం 10 గంటలకు ఇందిరాపార్కు వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో పూజాకార్యక్రమాలు ప్రారంభమై ఒంటిగంటకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ రథయాత్ర ఎన్టీఆర్ స్టేడియం, ఆర్టీసీ ఎక్స్ రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ చౌరస్తా, కాచిగూడ చౌరస్తా, టూరిస్ట్ హోటల్, నింబోలి అడ్డా, చాదర్ఘాట్, పుత్లిబౌలి, మోజాంజాహి మార్కెట్, జీపీవో, ఇస్కాన్ టెం పుల్, నాంపల్లి స్టేసన్ రోడ్ మీదుగా పబ్లిక్ గార్డెన్స్లోని లలితకళాతోర ణం వరకు రథయాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రలో స్వచ్ఛభారత్లో భాగంగా కృష్ణ భక్తులు వలంటీర్లుగా ఉంటూ యాత్రలో ప్రసాద వితరణలో భాగంగా రోడ్డుపై పడవేసిన చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తారన్నారు. అంతేకాకుండా యాత్రలో ప్లాస్టిక్ను పూర్థిస్థాయిలో నిషేధిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. యాత్రలో అంతర్జాతీయంగా ప్రఖ్యాతమైన ఇస్కాన్ భక్తులచే కీర్తనలు, సుమారు 8 కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో రథాన్ని లాగేందుకు లక్షకుపైగా భక్తులు పాల్గొంటారన్నారు. 5 టన్నుల ప్రసాద వితరణ భక్తులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. యాత్ర అనంతరం లలిత కళాతోరణలో 12వేల మందితో జగన్నాథుడికి ఒక్కసారిగా దీపారాధన కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయసభ్యులు శంభుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
7. ఢిల్లీ తెలంగాణ భవన్లో బోనాల సంబురాలు
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బోనాల ఉత్సవాలు ఢిల్లీలో రేపు, ఎల్లుండి కొనసాగనున్నాయి. ఫోటో ఎగ్జిబిషన్తో ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి పాల్గొన్నారు. రేపు సాయంత్రం ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్ వరకు అమ్మవారి ఊరేగింపు జరగనుంది. అనంతరం తెలంగాణ భవన్లో అమ్మవారి ఘట స్థాపన చేపట్టనున్నారు. గురువారం అమ్మవారికి పోతురాజులు, శివసత్తులు ఆహ్వానం పలకనున్నారు. పట్టు వస్ర్తాలు, బోనం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ కట్టు, బొట్టు చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఎంపీ కేకే మాట్లాడుతూ.. లాల్దర్వాజ బోనాలు 111 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా 111 ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీక బోనాల పండుగ అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పండుగలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను తెలిపేలా ఢిల్లీలో బోనాల పండుగను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
8. రేపట్నుంచి గోల్కొండ బోనాలు
జంటనగరాల్లో అత్యంత వైభవంగా బోనాల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని పాడి పరిశ్రమలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ చెప్పారు. గురువారం నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపా రు. జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి మంగళవారం సచివాలయంలోని హోంమంత్రి మహమూద్ అలీ చాంబర్లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గురువారం గోల్కొండ కోటలో జరిగే తొట్టెల ఊరేగింపు కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావుగౌడ్, మంత్రులు ఐకే రెడ్డి, తలసాని పట్టువస్త్రాలు సమర్పించాలని నిర్ణయించారు. హోంమంత్రి మహమూద్ అలీ కూడా పాల్గొంటారు. నగరంలోని 25 దేవాలయాలకు పట్టువస్త్రాలు సమర్పించాలని, ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయాశాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా కలుపుకొని దాదాపు మూడువేల దేవాలయాలకు ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందజేస్తామని, పండుగకు ముందే ఈ మొత్తం అందేలా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోనాల ఉత్సవాలను వీక్షించేందుకు గోల్కొండకోట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మోండామార్కెట్ క్లాక్టవర్ బిల్డింగ్, పాతబస్తీలోని దమయంతి బిల్డింగ్, ఢిల్లీ దర్వాజా తదితర ప్రాంతాల్లో త్రీడీ మ్యాపింగ్ను ఏర్పాటుచేయాలని చెప్పారు. జంటనగరాల్లో 155 సెంటర్లలో సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో కళాబృందాలను ఏర్పాటుచేయాలన్నారు. సమాచారశాఖ ఆధ్వర్యంలో బోనాల విశిష్టత షార్ట్ఫిలింలు ఆయా థియేటర్లలో, రైల్వేస్టేషన్లలో, బస్స్టేషన్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని తలసాని సూచించారు. మహంకాళి, ఓల్డ్సిటీ బోనాల ఉత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇమ్లిబన్, జూబ్లీ బస్స్టేషన్లలో, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లలో దేవాదాయశాఖ తరపున ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి ఐకేరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్కుమార్, సాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
9. తితిదేకు రూ.30 లక్షల విరాళం
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి అధీనంలోని ట్రస్టుకు బెంగళూరుకి చెందిన సైబర్‌సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ కొట్టు మురళీకృష్ణ మంగళవారం రూ.30 లక్షల విరాళం అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలో తిరుమల జేఈవో శ్రీనివాసరాజును కలిసిన దాత.. విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. మురళీకృష్ణ గతంలోనూ పలుమార్లు శ్రీవారికి విరాళాలు సమర్పించారు. ఆయన వెంట కంపెనీ ఎండీ సంతోష్ ఉన్నారు.
10. చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్న స్వామి స్వెరుపానంద
స్వామి స్వ రుపానంద చాతుర్మాస్య దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్‌కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయనతో… కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో 15 రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్‌లో శారదా పీఠానికి చేరుకొని ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకాలంలో భక్తులెవరు తన వద్దకు రావద్దని, సెప్టెంబర్ 20 తర్వాతే భక్తులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అంతేకాక పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం సీజీఎఫ్ ఫండ్‌ను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి భక్తులకు వివరణ ఇవ్వాలని డిమాండ చేశారు.
11. తిరుమల సమాచారం* *ఓం నమో వేంకటేశాయ*
ఈరోజు బుధవారం *03-07-2019* ఉదయం *5* గంటల సమయానికి. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ…… శ్రీవారి దర్శనానికి *1* కంపార్ట్ మెంట్ లలో వేచి ఉన్న భక్తులు… శ్రీ వారి సర్వ దర్శనానికి *4* గంటల సమయం పడుతోంది.ప్రత్యేక ప్రవేశ (300/-) దర్శనానికి, కాలినడక భక్తులకు, టైమ్ స్లాట్ సర్వ దర్శనానికి *2* గంటల సమయం పడుతోంది. నిన్న జూన్ *02* న *75,275* మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది. నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు *4.08* కోట్లు.
12. శుభమస్తు
తేది : 3, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పాడ్యమి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 44 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 2 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర
(నిన్న ఉదయం 8 గం॥ 14 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 6 గం॥ 36 ని॥ వరకు)
యోగము : ధ్రువము
కరణం : (కింస్తుఘ్న) కౌస్తుభ
వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు : ఈరోజు అమృతఘడియలు లేవు.
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 45 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 18 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 1 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : మిథునము
13. చరిత్రలో ఈ రోజు/జూలై 3*
1910 : తెలంగాణలో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు మరణం. (జ.1877)
1918 : తెలుగు సినిమా నటుడు ఎస్వీ రంగారావు జననం. (మ.1974).
1914 : నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు విశ్వనాథశర్మ జననం.
1924 : ప్రముఖ తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి సూర్యదేవర సంజీవదేవ్ జననం.(మ.1999)
1927 : తెలుగు రచయిత, బలివాడ కాంతారావు జననం (మ. 2000).
1928 : కర్ణాటక సంగీత విద్వాంసురాలు మరియు దక్షిణ భారత చలనచిత్రరంగంలో ప్రముఖ నేపథ్యగాయని ఎం. ఎల్. వసంతకుమారి జననం.(మ.1990)
1980 : భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు హర్భజన్ సింగ్ జననం.
లాల్ దర్వాజాలో ప్రారంభమైన బోనాల
Related tags :