Agriculture

ప్రభుత్వాలను నిందించడం ఆపి రైతులకు విత్తనాలు ఇవ్వండి

No Seed For Farmers In Andhra-Governments Blame Each Other Wasting Time

అన్నదాతకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు చినుకు జాడ కోసం ఎదురు చూసిన ఏపీ రైతులు.. ఇప్పుడు విత్తనాల దొరక్క విలవిల్లాడుతున్నారు. అయితే జగన్ సర్కారు అన్నదాతల కష్టాలకు గత ప్రభుత్వమే కారణమని ఎదురుదాడికి దిగింది. చంద్రబాబు సర్కారు ప్రణాళికా లేకుండా వ్యవహరించడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తోంది.ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రుతుపవనాలు ఆలస్యం కావడంతో వర్షాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. తీరా చినుకు పడ్డాక విత్తనాల కొరత వారిని వెంటాడుతోంది. కర్నూలు జిల్లా ఆలూరులో సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు.. విత్తనాలు వెంటనే పంపిణీ చేయాలంటూ ధర్నా చేశారు. రైతుల ఆందోళనతో ఆలూరు-బళ్లారి రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతపురం జిల్లాలోను సబ్సిడీ వేరుశనగ విత్తనాల కోసం అన్నదాతలు కదం తొక్కుతున్నారు. జిల్లాలో ఆందోళనలు నిత్యకృత్యమయ్యాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా విత్తనాలు పంపిణీలో అధికారులు జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.చిత్తూరు జిల్లాలోను ఇదే పరిస్థితి. వేరుశనగ విత్తనాలు ఇవ్వకుండా వ్యవసాయ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో చిత్తూరు జిల్లా దద్దరిల్లుతోంది. రైతుల ఆందోళనలకు టీడీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గద్దెనెక్కిన వైసీపీ సర్కారు… కనీసం విత్తనాలు పంపిణీ చేయలేకపోతోందని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నేతలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఫైరయ్యారు. రైతుల కష్టాలకు తాము ఏ మాత్రం కారణమని కాదన్నారాయన. నవంబర్ నుంచే విత్తనాల సేకరణ ప్రారంభం కావాలని, మే నెలలో రైతులకు అందించే ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై చంద్రబాబు సర్కారు స్తబ్దుగా వ్యవహరించడం వల్లే విత్తనాల పంపిణీలో జాప్యం జరుగుతోందని కన్నబాబు ఎదురుదాడి చేశారు. విత్తనాలు సప్లై చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా, రైతుల ఆందోళనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.