2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ ఇప్పటికే చేసిన రాజీనామాకు తాను దృఢంగా కట్టుబడి ఉన్నారని రాహుల్ గాంధీ మరోసారి స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానంటూ తాజాగా ట్విట్టర్ లో 4 పేజీల లెటర్ ను పోస్ట్ చేశారు. తానిప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదనీ.. కొత్త నాయకుడిని వీలైనంత త్వరగా అధిష్టానం ఎన్నుకోవాలని ఆయన కోరారు.
“లోక్ సభ ఎన్నికల్లో ఓటమికి నాదే బాధ్యత. ఓటమికి తాను బాధ్యత తీసుకోవడం అనేది పార్టీ భవిష్యత్తుకు మంచి చేస్తుందని నమ్ముతున్నా. నా రాజీనామాకు కూడా అదే కారణం. కఠినమైన నిర్ణయాలతోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. కొత్త వారిని సజెస్ట్ చేయాలని నన్ను కోరుతున్నారు. కానీ అది సరికాదని భావిస్తున్నా. పార్టీకి ఘన చరిత్ర, ఆత్మగౌరవం ఉన్నాయి. విశ్వసనీయత, ధైర్యం, ప్రేమ చూపించే లక్షణాలున్న నాయకుడిని పార్టీ ఎన్నుకుంటుందని భావిస్తున్నా” అని రాహుల్ గాంధీ తన లెంగ్తీ లెటర్ లో వివరించారు.
“పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన వెంటనే సీడబ్ల్యూసీకి, సహచరులకు ఓ మాట చెప్పాను. ఓ బృందంగా ఏర్పడి.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి. వారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చి అధికార బదిలీలో సహకరిస్తానని చెప్పాను” అన్నారు రాహుల్.
“బీజేపీకి నేను వ్యతిరేకం కాదు. కానీ ఇండియాను వారు చూసే దృష్టికోణాన్ని మాత్రం నా శరీరంలోని అణువణువు వ్యతిరేకిస్తుంది. అధికారం కోసం మాత్రమే ను ఫైట్ చేయలేదు. నేను కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటులాంటి సైనికుడిని. దేశభక్తి ఉన్న ఇండియా బిడ్డని. ఆఖరి శ్వాస ఉన్నంత వరకు దేశంకోసం పనిచేస్తా” అన్నారు రాహుల్.
“ఫ్రీ అండ్ ఫెయిర్ పద్ధతిలో ఎలక్షన్ జరగలేదు. మీడియా ఇండిపెండెంట్ గా లేదు. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ తటస్థంగా లేదు. ఆర్థిక పరిస్థితి కూడా బీజేపీకే అనుకూలంగా ఉంది. ఉద్యోగాలు, గిరిజనులు, మహిళలు, ఆర్థిక వ్యవస్థ గురించి పోరాడాను. ” అన్నారు రాహుల్.
వారంరోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎంపిక జరగొచ్చని భావిస్తున్నారు. ప్రముఖంగా 4 పేర్లు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ CM అశోక్ గెహ్లాట్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్, లోక్ సభ పక్ష మాజీ నాయకుడు మల్లికార్జున ఖర్గే, మోతీలాల్ వోరాలలో ఒకరిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకుంటారని తెలుస్తోంది.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవిలో కంటిన్యూ కావాలంటూ ధర్నాలు, నిరసనలు జరిగాయి. నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఐతే.. పదవి వదిలే విషయంలో రాహుల్ గాంధీ తగ్గలేదు. కొందరు ప్రియాంకా గాంధీ పేరు ప్రస్తావిస్తున్నప్పటికీ… ఎట్టి పరిస్థితుల్లో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ ఉండకూడదు అని రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు చెప్పినట్టు తెలుస్తోంది.