నటనకు నిర్వచనం, పర్యాయపదం అంటూ ఉంటే ఆ పదం పేరు ఎస్.వి. రంగారావు. ఒక నటుడి పేరు చెబితే పాత్రల గురించి మాట్లాడం.. పాత్రల పేర్లు చెబితే ఇది రంగారావు తప్ప.. లేదా రంగారావులా మరెవరూ చేయలేరు అనుకోవడం బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో ఒక్క ఎస్వీ రంగారావుకు మాత్రమే సాధ్యమైన విషయం అనిపిస్తుంది. ఆయన నటనకు పాత్రలే పరివశించిపోయాయి. అహంకారం నుంచి ఘీంకారం వరకూ.. ఆప్యాయతల నుంచి అసూయల వరకూ ఆ కళ్లలో పలకని భావం లేదు.. అలాంటి ఘనత సాధించిన ఎస్వీ రంగారావు అనబడే సామర్లకోట వెంకట రంగారావు జయంతి ఇవాళ.
జానపదం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ఎలాంటి పాత్రలోనైనా అలవోకగా పరకాయ ప్రవేశం చేయగల మేటి నటుడు ఎస్వీ రంగారావు. మన పౌరాణిక పాత్రలకు ఆయనలా జీవం పోసిన నటుడు మరొకరు లేరు. ఇప్పటికీ ఘటోత్కచుడు, దుర్యోధనుడు, రావణబ్రహ్మ పాత్రలను ఆయనంత ఎనర్జిటిక్ గా పోషించగల నటుడు పుట్టలేదు. అందుకు ఆయన చేసిన ఎన్నో పౌరాణిక పాత్రలే నిదర్శనం. పాత్ర స్వభావాన్ని, భావాన్ని.. కళ్లలోనూ.. శరీరంతోనూ ఏకకాలంలో పలికించిన మేరునటధీరుడు ఎస్వీ రంగారావు.
ఎస్వీ రంగారావు.. అనితర సాధ్యమైన నటనా వైదుష్యాన్ని ప్రదర్శించటంలో మహానటుడు. సంస్కృత పద భూయిష్టమైన సమాసాలతో కూడిన సంభాషణలను అర్థం చేసుకొని, అవలీలగా పలికిన స్వరభాషణుడు. సంభాషణలు పలకటంలో ఆ స్వరం ఓ మాయాజాలం. స్వరం తగ్గించి, సంభాషణలో, భావ వ్యక్తీకరణలో ఎవరికీ సాధ్యం కాని ఒకానొక ఒడుపు ప్రదర్శించటం ఒక్క ఎస్వీ రంగారావుకే సాధ్యం. ఎస్వీ రంగారావు తెరమీద నటవిశ్వరూపం ప్రదర్శిస్తుంటే ఇతరులెవరూ కనబడరనేది సత్యం.
బానిసలకింత అహంకారమా.. అంటూ ఎస్వీఆర్ ఘీంకరిస్తే ఆ నటనకు ప్రేక్షకులంతా బానిసలైపోయారు. సాహసం చేయరా డింభకా అని ఆదేశిస్తే హైహై నాయకా అనేశారు. ఇక పౌరాణికాల్లో భక్త ప్రహ్లాద ఆయన ప్రతిభకు ఓ మెచ్చుతునక. శ్రీహరిని ద్వేషించే దానవరాజుగా ఆయన నటన అనన్య సామాన్యం. నిజానికి ప్రహ్లాదుడిపై ప్రేక్షకుల్లో అంత సానుభూతి కలగడానికి కారణం ఎస్వీఆర్ కఠినమైన విలనీయే.
పౌరాణికాల్లో ఎస్వీఆర్ ను రీప్లేస్ చేసే నటుడు ఇంత వరకూ పుట్టలేదు.. పుడతాడనీ చెప్పలేం. అలాగని ఇతర పాత్రలకు ఆయన్ని రీప్లేస్ చేసేవారున్నారని కాదు. అసలు నటుడుగా ఎస్వీఆర్ ఒక్కడే. ఎప్పటికీ ఒక్కడే. కాకపోతే పౌరాణికాల్లో ఆయన నట వైదుష్యం న భూతో అనిపిస్తుంది. యశోదకృష్ణ, శ్రీ కృష్ణలీలలు చిత్రాల్లో కంసునిగా, సంపూర్ణ రామాయణంలో రావణాసురుడుగా ఆయన హావభావాలు మరెవరికీ సాధ్యం కావు.
తెలుగు సినిమా గమనాన్ని ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజిస్తే పౌరాణికం, జానపదం, చారిత్రకం, సాంఘికంగా చూడొచ్చు. ఈ నాలుగు విభాగాల్లోనే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నట శిఖామణి ఎస్వీ రంగారావు. పౌరాణికాల తర్వాత జానపదాల్లోనూ ఆయన నట విశ్వరూపం నేటికీ ఎందరికో యాక్టింగ్ ఇనిస్టిట్యూట్స్ గా ఉన్నదంటే ఒప్పుకుని తీరాల్సిందే. ఆహార్య, ఆంగిక, వాచకాభినయాల్లో పాత్ర స్వభావాన్ని రంగరించి తెరపై ఆవిష్కరించిన పరిపూర్ణ నటుడు ఎస్వీఆర్.
జానపద చిత్రాల్లో మనకు ఎక్కువగా నాయకుడే హైలెట్ గా నిలుస్తాడు. కానీ ఆ నాయకుడి పాత్రను కూడా తేలిపోయేలా చేసే నటన ఎస్వీ రంగారావు సొంతం. పాతాళ భైరవిలో దుష్ట మాంత్రికునిగా ఆయన నటన అద్భుతం. నేపాళ మాంత్రికుడిగా ఆయన చెప్పిన ఢింగరీ, సాహసం చేయరా డింభకా వంటి మాటలు తెలుగు భాషలో జాతీయాలుగా మిగిలిపోయాయంటే అతిశయోక్తేముందీ.
ప్రతినాయక పాత్రంటే భయపెట్టాలి.. ఎదురుగా నించున్న నాయకుడు కూడా ఓ వైపు వణికిపోవాలి. అలా చేయడంలో ఎస్వీఆర్ ను మించిన వారెవరున్నారు. బాల నాగమ్మ సినిమాలో మాయల మరాఠిగా ఎస్వీఆర్ నటనను మరచిపోగలమా. బాలనాగమ్మను మోహించి ఆమెను అపహరించి పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. కానీ ఆమె తనయుడి చేతిలో ఆఖరుకి హతమవుతాడు. ఈ సినిమాలో ఎస్వీఆర్ పాత్ర చాలా ఆలస్యంగా ఎంట్రీ ఇస్తుంది. అయితేనేం ఆ తర్వాత మరే నటుడూ ఆయన ముందు నిలబడజాలనంత విశ్వరూపం చూపిస్తాడు..
ఇక అసమాన సాహసికుడు, అత్యంత పాలనాదక్షుడైన విక్రమార్కుని భార్యను చేపట్టి ఆమెను నానా హింసలు పెట్టే మంత్రసిద్ధిగా భట్టి విక్రమార్కలో ఎస్వీ రంగారావు నటనాపాటవాలను మరచిపోగలమా. యువరాణిని చేపట్టడానికి విక్రమార్క వేషంలో వెళ్లి భంగపడి.. ఆపై అనేక కుతంత్రాల తర్వాత ఆమెను అపహరించే పాత్రలో ఎస్వీఆర్ ను తప్ప ఇంకెవరినీ.. ఊహించలేం కూడా.
చేసే పాత్రాలో పరకాయ ప్రవేశం చేసి హండ్రెడ్ పర్సెంట్ మెప్పించిన ఒన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ ఎస్వీరంగారావు. పాత్రల తాలూకూ హుందాతనాన్ని, చాతుర్యాన్నీ, గాంభీర్యాన్నీ పలికిస్తూ నవరసాలూ అలవోకగా పలికించడంలో ఎస్వీఆర్ మేటి. డైలాగ్ డెలివరీలో ఆయన బాణీ అనితరసాధ్యం. విసురు, విసుగు, పొగరు, వగరు వంటివన్నింటినీ అవలీలగా పలికించడంలో ఘనాపాటి.. ఇక చారిత్రక సినిమాల్లోనూ ఎస్వీఆర్ నటన మనల్ని సమ్మోహితుల్ని చేస్తుంది.
విక్రమార్క విజయం సినిమాలో ఎస్వీ రంగారావు నటన చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఒక రకంగా ఏక పాత్రాభినయంలాగా కొనసాగే ఓ సన్నివేశంలో ఆయన పలికిన సంభాషణలు, చూపిన నటన న భూతో న భవిష్యత్ అనేలా ఉంటుంది. ఆయన్ని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని ఎందుకంటారో ఈ సన్నివేశం చూస్తే చాలు.. అర్థమైపోతుంది.
చారిత్రక కేటగిరీలో ఆయన చేసిన పాత్రలు తక్కువే కావొచ్చు. అయినా బొబ్బిలియుద్ధంలో తాండ్ర పాపారాయుడుగా ఎస్వీఆర్ నట విశ్వరూపాన్ని చూస్తాం. ఇలాంటి పాత్రలు చేయడం కత్తిమీద సాము. ఈ పాత్రలకు పెద్దగా రిఫరెన్స్ లు ఉండవు. ఆ పాత్ర చేస్తోన్న ఆర్టిస్ట్ ఎక్స్ పీరియన్స్, ఎక్స్ పెక్టేషన్ కు మధ్యే ఆ క్యారెక్టర్ ను ప్రెజెంట్ చేయగలడు. ఈ విషయంలో ఎస్వీఆర్ మించినవారెవరున్నారు.
ఇక సాంఘిక చిత్రాలకు ఓ పెద్ద దిక్కుగా నిలబడి తాను ఉన్నంత వరకూ ఎన్నో సినిమాలను బ్రతికించిన నటశాల ఎస్వీ రంగారావు. ఎంతటి మహానటులనైనా డామినేట్ చేయగల సామర్థ్యం ఎస్వీ రంగారావు సొంతం. అందుకే ఈయనతో సీన్ అంటే నాటి నటులు ఎంతో భయపడేవారట. ఎక్కడ తమ పాత్ర ఆయన ముందు డామినేట్ అవుతుందోనని. ఒక్క సావిత్రి మాత్రమే ఆయన ముందు తేలిపోకుండా నిలబడగలిగింది. ఆయన్లోని మరో మహానటుడి ఆవిష్కరణకు బంగారు పాప ఓ తిరుగులేని ఉదాహరణ.
తన సుదీర్ఘ నట ప్రయాణంలో ఎస్వీ రంగారావు పోషించిన ప్రతి పాత్రా ఓ కళాత్మక మజిలీ. పాత్రను చంపేసి తను మాత్రమే ఎలివేట్ కావాలనే స్వార్థం ఎస్వీఆర్ లో ఎప్పుడూ లేదు. అందుకే ఆయన ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. సాంఘిక చిత్రాల్లో ఆయన చేసిన ప్రతి పాత్రనూ ప్రేక్షకులు విపరీతంగా ప్రేమించారు. తండ్రిగా, జమిందార్ గా, పేదవాడిగా, అన్నగా, కుటుంబ పెద్దగా.. ఇలా ఏ పాత్రైనా సరే.. మనకు పాత్ర కనిపిస్తుంది తప్ప ఆయన కాదు. ఇంతటి కాంట్రాస్ట్ నిండిన పాత్రల్లో అంతటి ప్రతిభ చూపిన నటుడు మనకు ప్రపంచ సినీ చరిత్రలోనే మరొకరు కనిపించరు.
చూడ్డానికి గంభీరంగా కనిపించినా ఎస్వీ రంగారావు మంచి చమత్కారి. పాత్రల పరంగా అది మనకు ఎన్నో సినిమాల్లో కనిపిస్తుంది. మిస్సమ్మలో హీరోయిన్స్ కు తండ్రిగా గుండమ్మ కథలో హీరోలకు తండ్రిగా ఎస్వీఆర్ చమత్కారం అందరికీ తెలుసు. ఈ రెండు సినిమాల్లోనూ ఆ పాత్రలను సమున్నంతగా ఆవిష్కరించారు..
అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఎన్నో సినిమాల్లో ఎస్వీర్ నటన మనకు శిఖరస్థాయిలో కనిపిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం సినిమాలో ఆయన నటన అసామాన్యం. ఉమ్మడి కుటుంబ పెద్దగా, భార్యకు ఎదురు చెప్పలేని భర్తగా, తమ్ముడుతో విడిపోలేకపోయిన అన్నగా అన్ని పార్శ్వాల్లోనూ ఎస్వీ రంగారావు నటన కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఇవే కాదు.. యాక్షన్ సినిమాల్లోనూ ఎస్వీఆర్ మైమరపిస్తాడు. ఇలాంటి సినిమాల్లో నటనకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అయినా ఆయా సినిమాల్లోనూ తనదైన ముద్రవేస్తూ ఆయన చెప్పిన తిట్లలాంటి డైలాగులు కూడా ఫేమస్ అయ్యాయి. గూట్లే, డోంగ్రీ, బేవకూఫ్ వంటి పదాలు దశాబ్ధాల పాటు నాటి కాలేజ్, స్కూల్స్ లో చాలాచాలా కామన్ అయ్యాయి. అదంతా ఎస్వీఆర్ వాచక మహిమే.
విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ, నట యశశ్వి, నట సింహ.. వంటి బిరుదులెన్నో పొందిన మేరునటధీరుడు ఎస్వీ రంగారావు. ముళ్లపూడి వెంకట రమణ మాటల్లో చెబితే ఆయన క్లిష్టపాత్రల్లో చతురంగారావు.. దుష్టపాత్రల్లో క్రూరంగారావు.. హడలగొట్టే భయంకరంగారావు.. హాయిగొలిపే టింగురంగారావు.. రొమాన్సులో పూలరంగారావు.. నిర్మాతల కొంగుబంగారావు.. స్వభావానికి ‘ఉంగారంగారావు.. కథ నిర్బలం అయితే హావభావాలు పాత్రపరంగారావు.. కళ్ళక్కట్టినట్టు కనబడేది ఉత్తి యశ్వీరంగారావు.. ఆయన శైలీ ఠీవీ అన్యులకు సులభంగారావు.. ఒకోసారి డైలాగుల్లో మాత్రం యమకంగారంగారావు.. మొత్తంగా ఆయన తెలుగువారికి మాత్రమే దొరికిన ఎస్వీ రంగారావు..
SVR జయంతి ప్రత్యేకం
Related tags :