వాణిజ్య సంబంధిత అంశాలపై చర్చించేందుకు వచ్చే వారం అమెరికా, భారత్ ఉన్నతాధికారులు భేటీ అయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. భారత వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో అమెరికా వాణిజ్య ప్రతినిధుల బృందం (యూఎస్టీఆర్) సమావేశం కానుందని వెల్లడించాయి. ఇటీవల జపాన్లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు భేటీ అనంతరం వాణిజ్య అంశాలపై చర్చలు జరగనుండటం ఇదే తొలిసారి. జీఎస్పీ కార్యక్రమం కింద భారత్ ఎగుమతి ప్రోత్సాహకాలను అమెరికా ఉపసంహరించుకోవడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు నెమ్మదించాయి. 28 అమెరికా ఉత్పత్తులపై భారత్ అదనంగా కస్టమ్స్ సుంకాలను విధించింది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఇరు దేశాలు సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాయి. డెయిరీ ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడం, ఐసీటీ ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాల కోత విధించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. కొన్ని వైద్యపరికరాలపై భారత్ ధరల నియంత్రణ విధించడంపై సైతం అమెరికా కంపెనీలు ఆందోళన చేస్తున్నాయి.
**అమెరికా- చైనా చర్చలు గాడిలో పడ్డాయ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జింగ్పింగ్ భేటీ తర్వాత వాణిజ్య చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని వైట్ హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పేర్కొన్నారు. అమెరికాలో 5జీ వైర్లెస్ నెట్వర్క్ అభివృద్ధిలో పాల్గొనకుండా హువావేపై విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటైజర్, ఆర్థిక కార్యదర్శి స్టీవెన్ నేతృత్వంలో అమెరికా వాణిజ్య బృందం చర్చలు జరుపుతుంది. మేలో వాణిజ్య చర్చలు నిలిచిపోయిన తర్వాత.. గత వారం చర్చల పునరుద్ధరణకు ఇరు దేశాల అధ్యక్షుడు అంగీకరించిన విషయం తెలిసిందే.
వచ్చే వారం ట్రంప్-మోడీల మధ్య వాణిజ్య చర్చలు
Related tags :