శ్వేతసౌధ నగరి అమెరికా రాజధానిగిరి వాషింగ్టన్ డీసీలో ఐక్యత-నైపుణ్యం-పురోగమనం నినాదంతో 22వ తానా మహాసభలు వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో గురువారం సాయంకాలం 8వేల మంది ప్రవాస అతిథుల నడుమ బ్యాంక్వెట్ విందుతో వైభవంగా ప్రారంభమయ్యయి. సినీ, రాజకీయ, సాహిత్య, నాటక, శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య, వైద్య, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. ప్రముఖ వ్యాఖ్యాత్రి సుమ వ్యాఖ్యానంలో ప్రారంభమయిన ఈ వేడుకల్లో తానా అధ్యక్షుడు వేమన సతీష్ స్వాగతోపన్యాసం చేశారు. అమెరికా ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న నేటి సాయంకాలం వారి సంబరాలకు తోడుగా తానా ఆధ్యర్యంలో 1983లో, 2007లో జరుపుకున్న తానా మహాసభల లానే 2019లో నేటి సాయంత్రం ఇంతమంది ప్రవాసుల నడుమ ఈ వేడుకలు జరుపుకోవడం, అమెరికా సంస్కృతిలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని అన్నారు. సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు మాట్లాడుతు ఎందరో కార్యకర్తల కృషి ఫలితమే నేటి తానా సభల విజయమని, వచ్చే రెండు రోజులు తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు రూపొందించామని వాటిని అందరూ ఆస్వాదించాలని కోరారు.
* నమస్తే అంటూ కపిల్‌దేవ్ ప్రసంగం
భారత క్రికెట్ జట్టు మాజీ సారధి, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు కపిల్‌దేవ్ తానా 22వ సభల బ్యాంక్వెట్ విందులో సందడి చేశారు. ఆయనను వేదికపైకి ఆహ్వానించి ప్రసంగించవల్సిందిగా కోరగా ఆయన నమస్కారం అంటూ తన ప్రసంగాన్ని ప్రాంభించగా సభికులు హర్షధ్వానాలతో ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సభలు విజయవంతం కావాలని, తెలుగువారి మధ్య ఇలా సరదాగా గడపడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
* తానా వేదికపై పలు పార్టీల నేతలు
తానా-తెలుగు రాజకీయాలు ఇవి రెండు జంటకవలలని ప్రతి ప్రవాసుడికి తెలుసు. అందుకే 22వ తానా సభల్లో పలు పార్టీలకు చెందిన రాజకీయనాయకులు ఒకే వేదికపైకి జేరి సందడి చేశారు. మల్లు భట్టి విక్రమార్క, కామినేని శ్రీనివాస్, నక్కా ఆనందబాబు, గంటా శ్రీనివాస్, పయ్యావుల కేశవ్, రసమయి బాలకిషన్, వసంత కృష్ణప్రసాద్, విష్ణువర్ధన్‌రెడ్డి, సీ.ఎం.రమేష్, మన్నవ సుబ్బారావు, పాతూరి నాగభూషణం, తాళ్లూరి పంచాక్షరయ్య తదితరులు ఒకే వేదికపైకి వచ్చి తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావానికి చిహ్నంగా ప్రవాసులకు, తానా సభల కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.
* కళాకారుల హడావుడి
సహజంగా అమెరికాలో తెలుగు సంఘాలంటేనే సినీ కళాకారుల సందడి అధికంగా ఉంటుంది. అందులో తానా సభల్లో దాని స్థాయి మరో మెట్టు పైనే ఉంటుంది. నటీనటులు పవన్‌కళ్యాణ్, ఎస్.ఎస్.రాజమౌళి, పూజ హెగ్డే, సునీల్, అల్లరి నరేష్, నారా రోహిత్, జయప్రకాశ్‌రెడ్డి, శివారెడ్డి, ఆర్పీ పట్నాయిక్, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని అభిమానులతో సరదాగా ఫోటోలు తీసుకున్నారు.
* వివిధ రంగాల ప్రముఖులకు పురస్కారాలు
తానా బ్యంక్వెట్‌లో పలు రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పురస్కారాలు అందించి సత్కరిస్తారు. ఈ క్రమంలో నేటి 22వ తానా మహాసభల్లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలను కపిల్‌దేవ్ చేతుల మీదుగా అందించారు. పురస్కారాలు అందుకున్న వారిలో అడపా ప్రసాద్(సామాజిక సేవ), రాపాకా రావు(శాస్త్ర సాంకేతిక), తాతా ప్రకాశం(పర్యావరణం), వల్లేపల్లి శశికాంత్(వాణిజ్యం), పండ ప్రసాద్(రాజకీయం-కెనడా), బండ్ల హనుమయ్య(సామాజిక సేవా), అనురాధ నెహ్రూ(శాస్త్రీయ నృత్యం), కలశపూడి వసుంధర(వైద్యం), రామినేని ధర్మప్రచారక్(సామాజిక సేవా), మృణాళిని సదానంద(శాస్త్రీయ నృత్యం), ప్రసాద్ కునిశెట్టి(సామాజిక సేవా), అట్లూరి స్వాతి(శాస్త్రీయ నృత్యం), నందిగామ కుమార్(తానా సేవలు), తాలిక స్నేహ(మీడియా), జెజ్జల కృష్ణమోహనరావు(తెలుగు భాషా సేవా), చల్లా ససల్ల(సామాజిక సేవా), లింగా లక్ష్మీ(సామాజిక సేవా), చల్లా జయంత్‌రెడ్డి(పెట్టుబడి), గంగవరపు రజనీకాంత్(వాణిజ్యం), నలజుల నాగరాజు(సామాజిక సేవా), కావ్య కొప్పరపు, వోలేటి సందీప్, నైషా బెల్లం, మలిశెట్టిలకు యువత పురస్కారాలను తానా సభల కన్వీనర్ డా.మూల్పూరి వెంకటరావు, అవార్డుల కమిటీ చైర్మన్ శీలమనేని గోపాల్, బొబ్బ రాం, కరుసాల సుబ్బారావుల సంయుక్త ఆధ్వర్యంలో అందించారు. ఈ వేడుకలకు స్థానిక తెలుగు సంఘం అయిన బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ పర్యవేక్షణలో సహ-ఆతిథ్యం అందించింది. ఈ వేడుకల్లో తానా సభల చైర్మన్‌తో డా.నరేన్ కొడాలితో పాటు, సంస్థ ప్రతినిధులు పొట్లూరి రవి, లావు అంజయ్య చౌదరి, తాళ్లూరి జయశేఖర్, మందలపు రవి, పంత్ర సునీల్, చండ్ర దిలీప్, కిరణ్ చౌదరి, కొల్లా అశోక్, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్, డా.యడ్ల హేమప్రసాద్, డా.రాజా తాళ్లూరి, చలపతి కొంద్రుకుంట, మురళీ వెన్నం, మురళీ తాళ్లూరి, ఉప్పుటూరి రాంచౌదరి, సూరపనేని రాజా, యాశ్ బొద్దులూరి, సుగన్ చాగర్లమూడి, పోలవరపు శ్రీకాంత్, ఆరోగ్య నిపుణులు వీరమాచినేని రామకృష్ణ, ప్రముఖ వ్యాపారవేత్తలు ఎల్లా కృష్ణ, సుచిత్ర ఎల్లా, బెంగుళూరుకు చెందిన వైద్యురాలు డీ.ఎ.తేజస్విని(డీ.కె.ఆదికేశవులునాయుడు కుమార్తె), సాహితీవేత్తలు లెనిన్‌బాబు, వాసిరెడ్డి నవీన్, టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు వీర్నపు చినసత్యం, అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు పరమేశ్ భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.