Sports

అతిత్వరలో ధోనీ రిటైర్మెంట్

Dhoni To Retire Soon After ICC CWC 2019

ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌ ధోనీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని తెలుస్తోంది. ప్రపంచకప్‌ తర్వాత క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ గెలుపొందితే అదే ధోనీకి ఘన వీడ్కోలు కానుందని బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. ‘‘ప్రపంచకప్‌ తర్వాత ధోనీ క్రికెట్‌లో కొనసాగే అవకాశం లేదు. ధోనీ నిర్ణయాలు ఎవరికీ అంతుచిక్కవు. గతంలో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్‌బై చెబుతున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం కూడా అంతే’’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ధోనీ 223 పరుగులు చేశాడు. అయితే, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు స్ట్రైక్‌ రొటేట్‌ చేయడంలో విఫలమై విమర్శలు ఎదుర్కొన్నాడు. సౌరవ్‌, సచిన్‌ సైతం విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో క్రికెట్‌కు ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.