ఏ కూరా నచ్చదు.. ఏమీ తినదు.. అన్నిటికీ వంకలు.. గాలి తిని బతుకుతోంది.. అమ్మాయి మీద అమ్మ కంప్లైంట్.. ఈ సంభాషణ దాదాపుగా ప్రతి ఇంట్లో ఉంటుంది. నిజంగా గాలి మాత్రమే పీల్చుకుని బతగ్గలమా.. మానవ మాత్రులకు సాధ్యం కాదేమో.. అడవుల్లో తపస్సు చేసుకునే మునివర్యులకు మాత్రమే సాధ్యమనుకుంటా. ఒక్కపూట అన్నం తినకపోతే చచ్చేంత నీరసం. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఆకలి రాముడిని చల్లబరిస్తేకానీ పనికి ఉపక్రమించలేం. మరి అలాంటిది గత 97 రోజులుగా ఓన్లీ గాలి మాత్రమే పీల్చి బతికేస్తోంది ఈ భామ. గాలి మాత్రమే తింటే గాలొస్తే కొట్టుకుపోతావమ్మాయి.. కాస్త జ్యూసులు, టీలు లాంటివన్నా తాగు అన్న నిపుణుల సలహాని పాటిస్తోంది. ఇప్పుడు తనెంత హాయిగా ఉన్నానో అంటోంది అమెరికాలోని మిన్నెయాపోలీస్‌కు చెందిన 30 ఏళ్ల అదురా. శరీరసౌష్టవం కోసం పలు రకాల ఆహార పదార్ధాలను ప్రయత్నించి విసిగిపోయిందట. ఆఖరికి ఓ మహానుభావుడి ద్వారా గాలి పీలుస్తూ కూడా బ్రహ్మాండంగా బతికేయొచ్చని తెలుసుకుందట. ముఖ్యంగా భారతీయులు యోగా, ధ్యానం వంటి ప్రక్రియల ద్వారా శ్వాస మీద ద్యాస ఉంచి శరీరాన్ని అదుపులో ఉంచుకుంటారని తెలుసుకుందట. అందుకే గాలినే డైట్‌గా పాటించడం మొదలుపెట్టింది.ఈమె డైట్ గురించి తెలుసుకున్న వైద్య నిపుణులు.. గాలి ఒక్కటే పీల్చి బతకడం చాలా కష్టం. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని అంటున్నారు. శరీరానికి తగిన పోషకాలు అందితేనే శక్తి లభిస్తుంది. అందుకు ఆహారం తీసుకోవడం చాలా అవసరం అని తెలిపారు. ఘనాహారం తీసుకోకపోయినా.. ద్రవాహారమైనా శక్తినిచ్చే వాటిని తీసుకుంటే సరిపోతుందని వెల్లడించారు. అందుకే అదురా కూడా పండ్ల జ్యూసులు తాగుతూ శరీరం నియంత్రణ కోల్పోకుండా చేయగలుగుతోంది. పోషకాహార నిపుణులు ఇలాంటి డైట్‌ని రోజూ పాటించక్కర్లేదంటున్నారు. రోజూ తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకుంటే సరిపోతుందని అంటున్నారు. మంచిదని ఎక్కువగా ఏదీ తీసుకోవద్దని చెబుతున్నారు. అలాగే తినకుండా కూడా ఉండకూడదని సలహా ఇస్తున్నారు. అదురా రోజూ మూడు గంటలసేపు ప్రాణాయామం చేస్తోంది. అయితే ఈ డైట్‌ను పాటిస్తున్న రోజు నుంచి తాను చాలా ఆరోగ్యంగా ఉన్నానని అంటోంది. అందరూ తనలానే చేయమని తానేమీ రికమండ్ చేయనని స్పష్టం చేసింది. ఏదైనా డైట్‌ని పాటించే ముందు డాక్టర్ సలహా తీసుకుని అమలు పరిస్తే ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే కొత్త అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఈ అమ్మాయి గాలి మాత్రమే తింటుంది
Related tags :