విశాఖ – విజయవాడ మధ్య ప్రతిపాదించిన ఉదయ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కడానికి మార్గం సుగమమవుతోంది. ఈ రైలుకు తాజాగా సీఆర్‌ఎస్ అనుమతులు కూడా వచ్చేశాయని వాల్తేరు డివిజన్ అధికారులు వెల్లడించారు. గత మార్చి నెల నుంచి జలంధర్‌లోనే ఉన్న కొత్త డబుల్‌డెక్కర్ రైలు విశాఖకు రానుంది. తూర్పు కోస్తా రైల్వే, కపుర్తల రైల్ కోచింగ్ ఫ్యాక్టరీ, రైల్వేబోర్డు మధ్య సమన్వయం లేక ఇన్నాళ్లూ జలంధర్‌లోనే ఉండిపోయిన ఈ కొత్త రైలు గురించి గత నెల 19న ‘ఉదయి’ంచేదెపుడు శీర్షికతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో కథనం వచ్చింది. దీనికి స్పందించిన తూర్పుకోస్తా, వాల్తేరు డివిజన్ అధికారులు కపుర్తల రైల్ కోచ్ ఫ్యాక్టరీ అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉన్న మాట వాస్తవమేనని తెలుసుకున్నారు. సమన్వయ లోపం వల్లనే రైలు అక్కడ ఉండిపోయిందని అంగీకరించారు. దానిని విశాఖకు రావాలంటే కోల్‌కతాలోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్) అనుమతులు తప్పనిసరి. ఎందుకంటే.. ప్రతీ కొత్త రైలుకూ ఈ అనుమతులు తీసుకోవాల్సిందే. ఇవి లేనిదే ఆ రైలును తేవడం కష్టం. ఈ విషయాలపై కూడా సీఆర్‌ఎస్ అధికారులతో, కపుర్తలలోని కోచ్‌ఫ్యాక్టరీ అధికారులతో ‘ఈనాడు’ మాట్లాడింది. సీఆర్‌ఎస్ అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాలని రైల్వేబోర్డు రోలింగ్‌స్టాక్ మెంబరు రాజేష్‌అగర్వాల్ కూడా తూర్పుకోస్తా రైల్వే అధికారులకు సూచించారు. మొత్తానికి ఆ ప్రక్రియ పూర్తయిందని వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు.
*● జలంధర్‌లో ఉన్న ఉదయ్ ఎక్స్‌ప్రెస్ విశాఖకు రావాలంటే మార్గమధ్యలో చాలా జోన్లు దాటాల్సి ఉంటుంది. రక్షణపరమైన అడ్డంకులు దాటుకుని రావటానికి సీఆర్‌ఎస్ అనుమతుల ప్రక్రియ పూర్తయ్యింది.
*● ప్రస్తుతం తూర్పుకోస్తా అధికారులు రైల్వేబోర్డుతో సంప్రదింపులు జరుపుతున్నారు. సాధ్యమైనంత త్వరగా రైలును తీసుకురావాలని భావిస్తున్నారు. అదెప్పుడన్నది ఇంకా స్పష్టత రాలేదు.
*● ఇదివరకే విశాఖ – విజయవాడ మధ్య విశాఖ – తిరుపతి డబుల్‌డెక్కర్ తిరుగుతోంది కాబట్టి.. ఈ రూటులో మళ్లీ డబుల్‌డెక్కర్ కోసం అనుమతులు తీసుకోనక్కర్లేదని వాల్తేరు అధికారులు స్పష్టం చేశారు. రైలు విశాఖకు రాగానే ట్రయల్ రన్ నిర్వహించి.. ప్రయాణ తేదీలను ఖరారు చేస్తామని చెబుతున్నారు.