అమెరికా వైద్య ఉపకరణాల దిగ్గజం మెడ్ట్రానిక్ తయారు చేసే ఇన్సులిన్ పంపులకు సైబర్ భద్రత ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీవో) హెచ్చరించింది. సదరు పంపులతో రోగి కాకుండా ఇతరులెవరైనా తీగరహితంగా అనుసంధానమై దాని సెట్టింగ్లను, ఇన్సులిన్ విడుదల నియంత్రణలను మార్చివేసే ముప్పుందని పేర్కొంది. ఇన్సులిన్ అధిక మోతాదుల్లో అందడం వల్ల రక్తంలో గ్లూకోజ్ తగ్గిపోయే సమస్య తలెత్తుతుందని తెలిపింది. ఇన్సులిన్ను నిలిపివేస్తే రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోవడం, ఆమ్లాలు పేరుకుపోవడం వంటి సమస్యలకు దారితీసే ముప్పుందని పేర్కొంది. మెడ్ట్రానిక్కు చెందిన మినిమెడ్ ఇన్సులిన్ పంపులను సైబర్ ముప్పు కారణంగా ఉపసంహరించుకోవడంపై అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్డీఏ రోగులు, ఆరోగ్యరంగ నిపుణులను హెచ్చరించిన నేపథ్యంలో సీడీఎస్సీవో తాజా అప్రమత్తతను ప్రకటించింది. ఇన్సులిన్ పంపునకు సంబంధించిన మోడల్, సాఫ్ట్వేర్లలో తేడాలు చోటుచేసుకున్నాయా అనేది తనిఖీ చేసుకోవాలని సంబంధితులందరికీ సీడీఎస్సీవో సూచించింది.
ఆ వైద్య పరికరాలకు సైబర్ ముప్పు
Related tags :