* 22వ తానా సభల్లో వక్తల ప్రశంసలు
* వేడుకగా రెండో రోజు కార్యక్రమాలు ప్రాంభం
* సావనీర్ ఆవిష్కరణ
* స్వాగతనృత్యంతో అబ్బురపరిచిన ప్రవాస చిన్నారులు
ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో తెలుగువారు భారతీయులు అఖండమైన మేధోసంపత్తితో, కృషితో ఈ దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారని, అదే విధంగా వారి మూలాలను మరిచిపోకుండా ఎక్కడకి వెళ్లినా వారి వారి మాతృభాషా సంస్కృతులను స్థానిక నాగరికతతో మమేకం చేయడమే గాక భావితరాల వారికి కూడా దాన్ని భద్రంగా అందిస్తూ తెలుగుకు అనంతమైన అఖండమైన ఖ్యాతిని ఆపాదిస్తూనే దాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని 22వ తానా సభల రెండోరోజు ప్రారంభ కార్యక్రమంలో వక్తలు కొనియాడారు. వాషింగ్టన్ డీసీ డౌన్‌టౌన్‌లోని మారియట్ నుండి ప్రజావాహినిగా వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరుకు తరలివచ్చిన తానా కార్యర్గం, అతిథులు రెండో రోజు కార్యక్రమాలను స్వాగత నృత్యంతో ప్రారంభించారు. జొన్నవిత్తుల రాసిన ఈ గీతానికి రాపరాల సాయిలక్ష్మీకాంత నృత్య దర్శకత్వం వహించారు. దీనికి పూర్వం సభల సమన్వయకర్త డా.మూల్పూరి వెంకటరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, చలపతి కొండ్రుకుంట, చివుకుల ఉపేంద్ర, తాళ్లూరి జయశేఖర్, భట్టి విక్రమార్క, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, విష్ణువర్ధన్‌రెడ్డి, కోమటి జయరాం, నాదెళ్ల గంగాధర్, కామినేని శ్రీనివాస్, పువ్వాడ అజయ్‌కుమార్, పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాస్, సీ.ఎం.రమేష్, కెనడా మంత్రి పాండా ప్రసాద్, మేరీల్యాండ్ గవర్నర్ కార్యాలయ ప్రతినిధులు, డా.జంపాల చౌదరి, గౌర్నేని రవి, తానా అధ్యక్షుడు వేమన సతీష్, బండ్ల హనుమయ్య, యడ్ల హేమప్రసాద్ తదితరులతో కూడిన ఆతిథ్య బృందం ప్రసంగించి సభికులకు అభినందనలు తెలిపారు. ఈ సభలకు సహ ఆతిథ్యం అందిస్తున్న GWTCS సంస్థ అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ అందరికీ స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన, సావనీర్ విడుదల కార్యక్రమాలను నిర్వహించారు. ఆధ్యాత్మికవేత్తలు విశ్వంజీ, పరిపూర్ణానందగిరి స్వామిజీలు ప్రసంగించి ఆశీర్వచనం పలికారు. ప్రముఖ గాయనీ స్మిత రెండో రోజు ప్రారంభోత్సవంలో సందడి చేశారు. మేరీల్యాండ్ గవర్నర్ కార్యాలయం తానాకు గుర్తింపు పత్రాన్ని అందజేసింది.
* కోలాహలంగా తానా స్టాల్స్
తానా వేడుకల వేదిక వద్ద ఏర్పాటు చేసిన పలు రకాల ఆహార, వస్త్ర, నగల, నిర్మాణ రంగాలకు చెందిన స్టాల్స్ వద్ద సందడి నెలకొంది. వేడుకల్లో పాల్గొనేందుకు హాజరయిన సభికులు ఈ స్టాల్స్ వద్ద సందడిగా తిరుగుతూ కొనుగోళ్లు చేశారు. 10వేల మందికి పైగా ప్రతినిధులకు సరిపడేలా భారీ విందు ప్రాంతాన్ని ఈ వేడుకల్లో ఏర్పాటు చేశారు. నేటి మధ్యాహ్న కార్యక్రమాల్లో భాగంగా బిజినెస్ ఫోరం, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.