Devotional

అనంత ఫలాలనిచ్చే ఆషాఢం మాసం

Daily Devotional News-July 5th 2019

చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం సంవత్సరంలో నాల్గవ మాసం. చంద్రుడు పూర్ణిమ రోజున పూర్వాషాడ, ఉత్తరాషాఢ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండటంవల్ల ఈమాసానికి ఆషాడం అని పేరు వచ్చింది. ఈ మాసానికే శూన్యమాసమని పేరు. శుభకార్యాలకు యోగ్యమైనది కాదు. ఈ నెలలోనే పీఠాధిపతులు, సన్యాసులు చాతుర్మాస్య దీక్ష వహిస్తారు. ఆధ్యాత్మికపరంగా చూస్తేఆషాఢం అనంత కోటి పుణ్యఫలితాలు అందించే మాసంగా పేరొందింది. ఈ మాసం అమ్మ ఆరాధనకు శ్రేష్ఠమైనది. గోల్కొండ కోటలోని జగదాంబ ఆలయంలో గురువారం మొదటి బోనాల వేడుకలు ఆరంభవౌతాయి. ఘటం ఎదుర్కోళ్లతో సంబరాలకు శ్రీకారం చుడతారు. ఈ మాస శుద్ధ విదియనాడు పూరీ జగన్నాథ రథయాత్ర ఆరంభమవుతుంది. శుద్ధషష్ఠినాడు స్కంధవ్రతం ఆచరించాలని స్మృతి కౌస్త్భుం అనే వ్రత గ్రంథం పేర్కొంది. ఆషాఢ శుద్ధ సప్తమిని భాను సప్తమి అంటారు. పురుషార్థ చింతామణిలో ఈనాడు ‘వివస్వన్నమో భాస్కరస్సోత్పత్తిః’ అని పేర్కొన్నారు. ఇది సూర్యారాధనకు ఉద్దీష్టమైన దినం. తెలంగాణ ప్రాంతంలో బోనాల జాతరను ఘనంగా జరుపుతారు. దీనినే ‘బోనాల పండుగ’, ‘ఆషాఢ జాతర’గా పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే ‘తొలి ఏకాదశి’ అనీ, శయనైకాదశి అని కూడా అంటారు. ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పుకునే ఈ ఏకాదశినాడు మహావిష్ణువు క్షీరాబ్దిలో శయనిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. భగవంతుని సాక్షాత్కారాన్ని నేరుగా పొందడానికే ఏకాదశీ వ్రతం ఎంతగానో తోడ్పడుతుంది. సతీసక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వ్రతం చేసి భగవంతుని అనుగ్రహం పొందిందని పండరీపురంలో తొలి ఏకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు.
చాంద్రభాగ నదీ తీరాన పండరీపురం (మహారాష్టల్రో ఉంది)లో కొలువైన విఠలుని ప్రభావం తొలి ఏకాదశినాడే చూడాలి. ఎందుకంటే సతీ సక్కుబాయి ముక్తి పొందింది ఈ ఏకాదశినాడే. ఏకాదశి అనేది ఎంతటి పుణ్యతిథి అంటే, కృష్ణుడు స్వయంగా తన చెల్లెలు సుభద్రాదేవికి ఈ వ్రత ప్రాశస్త్యం గురించి చెప్పాడట. అంతేగాక ద్వారక నగర వాసులు ఏకాదశ వ్రతాన్ని ఆచరించాలని దండోరా వేయించాడట. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకుని కార్తీక శుద్ధ ఏకాదశివరకు (నాలుగు నెలలు) మహావిష్ణువు పాల సముద్రంలో శయనిస్తాడు. ఈ కాలంలో నియమ నిష్ఠలలో, ఆహార విహారాది నియమాలలో, నియమబద్ధ జీవనం గడిపేవారు శ్రీహరికి ప్రీతిపాత్రులవుతారని శాస్త్ర వచనం. తొలి ఏకాదశినానాడు ఈ వ్రతాన్ని కొందరు ఆచరిస్తారు. ఆర్ష వాఙ్మయ మూలపురుషులు వ్యాసభగవానుని జన్మదినం ఆషాడ పౌర్ణమి. ఆషాడ బహుళ అష్టమి రౌచ్య మన్వంతరాది. రేచ్చుడు పదమూడవ మనువు. ఆషాఢ బహుళ అమావాస్య దీప పూజకు ప్రత్యేకమైనది కానీ ఆషాఢమాసం అనారోగ్య మాసం. కొత్తనీరు తాగడంవలన వివిధ రకాల జ్వరాలు, విరేచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే మాసం. స్ర్తిలు గర్భం ధరించడానికి అనుకూలమైన కాలం కాదు. అనారోగ్య దినాలలో, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదనే నమ్మకం ఉంది. పైగా ఈ మాసంలో స్ర్తి గర్భం ధరిస్తే ప్రసవ సమయానికి మంచి ఎండాకాలం అవుతుంది. అది తల్లి, పిల్లకు ఎండ తీవ్రత మంచిది కాదు. ఈ నాలుగు నెలల్లో ముఖ్యంగా ఆషాడ మాసంలో మనిషి శరీరంలోని సప్త్ధాతువులు పూర్తిగా శరీరానికి సహకరించవు. కావున ఆషాఢమాస నెల రోజులు దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ మాసంలో వర్షపు నీళ్లు భూమిలోనికి ఇంకి భూమిలో వున్న ఉష్ణం అలా పైకి రావడం మూలాన, ఆ ఉష్ణంలో పెరిగిన కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి కూరగాయలలు తినకూడదనే నియమం పెట్టారు. అందుకే ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అంటారు. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం వుంటుంది. దక్షిణాయన ప్రారంభమాసం ఈ మాసంలోనే. ఆషాఢమాసంలో ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ములగ కూర బాగా తినాలని అంటారు. అనపపప్పు వాడాలంటారు. ఈ మాసంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. ఈ మార్పువల్ల కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. లేతాకు గోరింటాకు పెట్టుకోవడంవల్ల బయటి వాతవారణానికి అనుగుణంగా అది మన శరీరాన్ని కూడా చల్లబరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే శక్తి కూడా గోరింటాకుకు ఉంది. గోరింటాకు రసంలో యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఆషాఢమాసంలో శ్రీమహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడు కాబట్టి దేవుడి ఆశీస్సులు అందవని, అందుకే శుభకార్యాలు ఈ మాసంలో చెయ్యరు. పార్వతీదేవి యొక్క అనేక రూపాలకు ఈ మాసంలో వివిధ రూపాల్లో విశేష పూజలు జరుపుతారు. విజయవాడ కనకదుర్గాదేవికి శాకంబరీ అలంకార ఉత్సవాలు ఈ మాసంలోనే జరుగుతాయి. ఈ మాసంలో మూడవ ఆదివారంనాడు ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారికి బోనాల జాతర వైభవోపేతంగా జరుపుతారు. యావత్ ప్రపంచం ఎంతో ఉత్సుకతతో తిలకించే పూరీ జగన్నాధ రథయాత్ర జరిగేది ఈ మాసంలోనే. దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణంతో ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలకు శాస్త్రప్రకారం శ్రాద్ధకర్మలు నిర్వహించాలి. దక్షిణాయనంలోనే పండుగలు ఎక్కువ. తొలి ఏకాదశి చాతుర్మాస దీక్ష, గురుపూర్ణిమ, దక్షిణాన ప్రవేశం వంటి ఎన్నో విశేషాలకు నెలవు ఆషాఢమాసం. మనం కూడా ఆచారాలు పాటిద్దాం. పూజాఫలం పొందుదాం.

2.డయల్‌ తితిదే ఈవో కార్యక్రమం రద్దు
తిరుమలలో శుక్రవారం నిర్వహించాల్సిన డయల్‌ తితిదే ఈవో కార్యక్రమాన్ని తితిదే రద్దు చేసింది. పరిపాలన పరమైన కారణాలతో కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ప్రకటించింది. ప్రతినెలా మొదటి శుక్రవారం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
3.జ్యోతిష్యం, జాతకం, వాస్తులో ప్రవీణ, విశారద కోర్సులు
భారతీయ జ్యోతిష్య శాస్త్ర మండలి ఆధ్వర్యంలో వేదిక్‌సైన్స్‌ను విస్తృతం చేసేందుకు జ్యోతిష్యం, జాతకం, వాస్తులో ప్రవీణ, విశారద కోర్సులను నిర్వహించనున్నట్లు మండలి ఛైర్మన్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 7 నుంచి ప్రతి ఆదివారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలకు 91777 47000, 99594 63939 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
4.యాదాద్రిలో రికార్డు స్థాయిలో నిత్య రాబడి-30 రోజుల్లో రూ.1.35 కోట్లు
యాదాద్రి ఆలయ హుండీల నగదు రికార్డు స్థాయికి చేరిందని, ఆ మొత్తం రూ.1,35,86,865ను దాటిందని గురువారం దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. సరాసరిన రోజుకు రూ.4.5లక్షల నగదును భక్తులు హుండీల్లో సమర్పించడంతో, ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా 30 రోజుల్లో ఈ రికార్డు సాధ్యమైందని చెప్పారు. బంగారం 98 గ్రాములు, వెండి 4,100 గ్రాములు లభించాయన్నారు. ఉదయం 8 గంటలకు మొదలైన లెక్కింపు రాత్రి 8 వరకు కొనసాగిందని, ఇందులో ఆలయ ఉద్యోగులతో పాటు హైదరాబాద్‌లోని శివసాయి సేవాసమితికి చెందిన మహిళా భక్తులు పాల్గొన్నారని అన్నారు. లెక్కింపును కార్యనిర్వహణాధికారితో పాటు ధర్మకర్త నర్సింహమూర్తి, సహాయ ఉన్నతాధికారి చంద్రశేఖర్‌ పర్యవేక్షించారు.
5.జనం మధ్య జగన్నాథుడు
రథయాత్ర గురువారం వైభవోపేతంగా నిర్వహించారు. మధ్యాహ్నం పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి తన శిష్యగణంతో రథాలపైకి వెళ్లి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అనంతరం పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్‌ బలభద్ర, సుభద్ర, జగన్నాథుల సన్నిధిలో(రథాలపై) ‘చెరాపహరా’గా బంగారు చీపురుతో ఊడ్చి పూజలు నిర్వహించారు. తర్వాత మూడు రథాలు వరుసక్రమంలో గుండిచాదేవి(పెంచిన తల్లి) మందిరానికి కదిలాయి. భక్తులు ఆనందపారవశ్యంతో రథాల తాళ్లు లాగుతూ ముందుకు తీసుకెళ్లారు. ఒడిశా గవర్నరు గణేశీలాల్‌, సీఎం నవీన్‌ పట్నాయక్‌ వేడుకల్లో పాల్గొన్నారు. గుండిచా యాత్రగా వెళ్లిన ముగ్గురుమూర్తులు పెంచినతల్లి మందిరంలో తొమ్మిది రోజులు విడిది చేస్తారు. మళ్లీ ఆషాఢ శుక్ల దశమినాడు (జులై 12న) బహుడా (తిరుగు) యాత్రగా శ్రీక్షేత్రానికి చేరుకుంటారు.
6.గోల్కొండ బోనాలు ప్రారంభం
గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. పోతురాజుల నృత్యాలు, బ్యాండు మేళాలు, సాంస్కృతిక బృందాలు వెంటరాగా… లంగర్‌హౌస్‌ చౌరస్తాలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్‌ అనీల్‌కుమార్‌ అమ్మవారికి పూజలు నిర్వహించి బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. కల్లు సాక పోసి, రాష్ట్ర ప్రజలను చల్లగా కాపాడాలని మంత్రులు వేడుకున్నారు.
7. తాళ్లపాకలోని శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామివారి-బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లు ఆవిష్క‌ర‌ణ‌
టిటిడికి అనుబంధంగా ఉన్న కడప జిల్లా తాళ్లపాకలో గల శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్ధేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల గోడ‌ప‌త్రిక‌లను టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్ కుమార్ గురువారం ఆవిష్క‌రించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ రెండు ఆలయాల బ్రహ్మోత్సవాలకు జూలై 11న‌ అంకురార్పణ జ‌రుగ‌నుంద‌ని తెలిపారు. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆల‌యంలో జూలై 12న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ‌ని, రాత్రి చిన్నశేషవాహన సేవ జ‌రుగ‌నుంద‌ని చెప్పారు. జూలై 13న హంస వాహనం, జూలై 14న సింహ వాహనం, జూలై 15న హనుమంత వాహ‌నం, జూలై 16న ఉదయం మోహినీ అవతారం, గరుడసేవ జ‌రుగుతాయ‌ని తెలిపారు. జూలై 17న కల్యాణోత్సవం, గజ వాహనం, జూలై 18న రథోత్సవం, జూలై 19న అశ్వవాహనం, జూలై 20న వసంతోత్సవం, చక్రస్నానం, జూలై 21న పుష్ప‌యాగం నిర్వ‌హిస్తార‌ని వివ‌రించారు. శ్రీ సిద్ధేశ్వరస్వామివారి ఆల‌యంలో జూలై 12న ధ్వజారోహణం, హంసవాహనం, జూలై 13న చంద్రప్రభ వాహనం, జూలై 14న చిన్నశేష వాహనం, జూలై 15న సింహ వాహనం, జూలై 16న ఉదయం పల్లకీ సేవ అనంతరం చంద్రగ్రహణం కారణంగా మరుసటిరోజు మధ్యాహ్నం వరకు ఆలయ తలుపులు మూసివేస్తారని తెలిపారు. జూలై 17న ఆర్జిత కల్యాణోత్సవం, గజవాహనం, జూలై 18న పల్లకీ సేవ, జూలై 19న పార్వేట ఉత్సవం, జూలై 20న వసంతోత్సవం, త్రిశూలస్నానం, ధ్వజావరోహణం, జూలై 21న పుష్ప‌యాగం జ‌రుగ‌నుంద‌ని తెలియ‌జేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారని, ప‌రిస‌ర ప్రాంతాల భ‌క్తులు విచ్చేసి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని జెఈవో కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ ఎల్ల‌ప్ప‌, సూప‌రింటెండెంట్ శ్రీ హేమ‌శేఖ‌ర్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ అనిల్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
8. దేవాలయాల నిర్మాణానికి సహకారం: వైవీ సుబ్బారెడ్డి
రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో దేవాలయాల నిర్మాణానికి తితిదే సహకారం అందిస్తుందని తితిదే పాలక మండలి అధ్యక్షుడు వైవీ.సుబ్బారెడ్డి అన్నారు. తిరుపతికి సమీపంలోని రామాపురం వద్ద ఉన్న శిల్పతయారీ కేంద్రంలో… అమరావతిలో నిర్మించే శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించనున్న మూలవిరాట్టుకు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం నైవేలి సమీపంలోని నమక్కల్‌ నుంచి శిలలను తెప్పించామన్నారు. శ్రీవారి మూలవిరాట్టు, వకుళామాత, ద్వారపాలకులు, గరుడాళ్వార్‌, విష్వక్సేనుడు విగ్రహాలను ఇక్కడ తయారుచేసి అమరావతిలో ప్రతిష్ఠించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే సీఈ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
9. 13న తిరుమలకు రాష్ట్రపతి రాక
తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 13న తిరుమలకు రానున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం గురువారం తితిదేకు అందింది. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. ఇక్కడ గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికే అవకాశం ఉంది. శ్రీవారిని 14న ఉదయం కుటుంబసమేతంగా దర్శించుకుని మధ్యాహ్నం తిరుగు ప్రయాణం కానున్నారు.
10. బాసర అమ్మవారిని దర్శించుకున్న అన్నపూర్ణ పీఠాధిపతి
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానంలో భక్తుల సందడి నెలకొంది. ఈ రోజు అమ్మవారిని అరుణాచల్‌ప్రదేశ్‌లోని అన్నపూర్ణ అశ్రమ పీఠాధిపతి స్వామి శివానందరళహరి గారు దర్శించుకున్నారు. వీరికి ఆలయ పూజారులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేయించి, శాలువతో సన్మానించి అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారీ, వేద పండితులు నవీన్‌శర్మ, నందకిశోర్, ఆలయ ఇంచార్జ్ ఈవో శ్రీనివాసరాజు, ఆలయ పీఆర్వో గోపాల్‌సింగ్ పాల్గొన్నారు.
11. ఆన్‌లైన్‌లో శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లు
2019 అక్టోబరు నెల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదలయ్యాయి. అక్టోబర్‌ నెలకు సంబంధించి మొత్తం 55,355 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,305 టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళ పాద పద్మారాధన 180, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌ జనరల్‌ కేటగిరిలో 46,050 సేవాటికెట్లు ఉండగా వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్‌ సేవ 3,300, ఆర్జిత బ్రహ్మూత్సవం 6,050, వసంతోత్సవం11,550, సహస్ర దీపాలంకార సేవ 13,200 టికెట్లు ఉన్నాయి.
12. దుర్గమ్మకు సారె సమర్పణ
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మకు పలు భక్త బృందాలు సంప్రదాయబద్ధంగా వచ్చి గురువారం సారె సమర్పించాయి. దేవస్థానం అధికారులు భక్త బృందాలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మల్లికార్జున మహా మండపం మెట్ల మార్గం నుంచి వారంతా వెళ్లి ఆరో అంతస్తులోని దుర్గమ్మ ఉత్సవమూర్తికి సారె సమర్పించారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకున్నారు. విజయవాడ పటమటకు చెందిన గురుదత్త పీఠం, కృష్ణలంకకు చెందిన విజయలక్ష్మి భక్త బృందం, వన్‌టౌన్‌కు చెందిన విజయవిఠల భజన బృందం, గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన మారుతి నృసింహ భజన మండలి సభ్యులు సారెను సంప్రదాయబద్ధంగా సమర్పించారు. మహిళల కోలాటం ఆకట్టుకుంది. భక్తులకు దేవస్థానం సిబ్బంది అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శివప్రసాద శర్మ, శ్రీనివాస శాస్త్రి, కోట ప్రసాద్‌ పాల్గొన్నారు.
13. చరిత్రలో ఈ రోజు/జూలై 5
1811: వెనెజులా స్వాతంత్ర్యదినోత్సవం(దక్షిణ అమెరికాలో స్వాతంత్ర్యం (స్పెయిన్ నుంచి) పొందిన మొట్టమొదటి దేశం).
1916: భారతదేశ 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ జననం (మ.1994).
1927: తెలుగు రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ జననం (మ.2013).
1946: ‘బికిని’ ఈత దుస్తులు మొదటిసారిగా పారిస్ ఫ్యాషన్ ప్రదర్శనలో కనిపించాయి.
1947: భారతదేశానికి స్వాతంత్ర్యాన్నిచ్చే చట్టం బ్రిటిషు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
1954: ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు.
1962: అల్జీరియా స్వాతంత్ర్యదినోత్సవం
1975: కేప్ వెర్డె స్వాతంత్ర్య దినోత్సవం (500 సంవత్సరాల పోర్చుగీస్ వలస పాలన తర్వాత)
1996: డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొర్రె నుంచి తీసిన జీవకణం ద్వారా పుట్టించారు.
14. శుభమస్తు
తేది : 5, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ
(నిన్న రాత్రి 7 గం॥ 10 ని॥ నుంచి
ఈరోజు సాయంత్రం 4 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం : ఆశ్లేష
(ఈరోజు తెల్లవారుజాము 2 గం॥ 31 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 18 ని॥ వరకు)
యోగము : వజ్రము
కరణం : తైతిల
వర్జ్యం : (ఈరోజు మద్యాహ్నం 2 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 35 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 10 గం॥ 50 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 17 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 8 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 15 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 12 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 38 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 14 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కర్కాటకము