వాతావరణం చల్లగా మారుతోంది. రోజూ ఆరుబయట నడవడం, జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం అన్ని రోజులు కుదరకపోవచ్చు. మరెలా అంటారా… ఈ పరికరాలను అందుబాటులో ఉంచుకుంటే మీరే సులువుగా వ్యాయామాలు చేసేయొచ్చు. అవేంటంటే…
డంబెల్స్: బరువులెత్తితేనే వ్యాయామం చేసినట్లు భావిస్తారు చాలామంది. అలాంటివారు ఇంట్లోనే చేసేందుకు డంబెల్స్ ఉపయోగపడతాయి. ఇవి బరువును తగ్గిస్తాయి. కండరాలను దృఢంగా మారుస్తాయి. మీ ఎత్తు, బరువుకి తగ్గ వెయిట్‌లను తెచ్చుకుంటే ఇంట్లోనే ప్రయత్నించొచ్చు.
రెసిస్టెంట్ బ్యాండు: కొత్తగా వ్యాయామం చేసేవారికే కాదు… చేయాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గించుకోవడానికి డంబెల్స్‌కి ప్రత్యామ్నాయంగానూ రెసిస్టెంట్ బ్యాండ్స్‌ని వాడుకోవచ్చు. దీంతో వ్యాయామం చేయడం వల్ల.. గాయాలయ్యే అవకాశం తక్కువ. పుషప్స్ చేయడం చాలా సులువు.
స్టెబిలిటీ బాల్: స్విస్‌బాల్, బ్యాలెన్స్ బాల్… ఇలా ఏ పేర్లతో పిలిచినా… ఈ స్టెబిలిటీ బాల్ వ్యాయామానికి ఎంతో సౌకర్యం. నడుంనొప్పి, ఇతర సమస్యలు ఉన్నవారికి ఆసరాగా ఉపయోగపడుతుంది. దీనిపై స్థిరంగా కాసేపు కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉండి… ఒత్తిడి తగ్గుతుంది. దీని సాయంతో పుషప్స్, ప్లాంక్స్ చేయొచ్చు.
హార్ట్‌రేట్ మానిటర్: మనం ఎన్ని వ్యాయామాలు చేసినా…దాని పురోగతిని కొంతైనా తెలుసుకోలేకపోతే ఉపయోగం ఉండదు. ఎప్పటికప్పుడు దాన్ని ఈ హార్ట్‌రేట్ మానిటర్‌తో తెలుసుకోవచ్చు. గుండె కొట్టుకునే వేగం 80 – 85 మధ్యలో ఉంటే…మీరు వ్యాయామానికి అలవాటు పడినట్లే. చక్కని జీవనశైలిని అలవాటు చేసుకున్నట్లే.