అమెరికాలో పుట్టి పెరిగిన ప్రవాస బాలబాలికలు 22వ తానా మహాసభల రెండో రోజు సాయంకాల కార్యక్రమంలో భాగంగా “శ్రీకృష్ణ రాయబారం” పద్యనాటాకాన్ని ప్రముఖ పద్యనాటక కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించి ప్రవాసులను అబ్బురపరిచారు. నార్త్ కరోలినా, న్యూజెర్సీ, డీసీ, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల నుండి ప్రవాస బాలబాలికలు ఈ నాటకంలో సంభాషణలు(గద్యం) ఆంగ్లంలో, పద్యం తెలుగులో పలికి అమెరికాలో ఓ నూతన పద్యనాటక రీతికి శ్రీకారం చుట్టారు. “చెల్లియో…చెల్లకో…”, “అలకెనురగ్ని ధర్మరాజు…”, “జెండాపై కపిరాజు…” వంటి పద్యాలను అలవోకగా ప్రవాస చిన్నారులు ఆలపించి అహోమనిపించారు. అనంతరం గుమ్మడిని తానా అధ్యక్షుడు వేమన సతీష్, తానా సభల సమన్వయకర్త డా.మూల్పూరు వెంకటరావులు ఘనంగా సత్కరించారు.
* వర్జీనియా ఎటార్నీ జనరల్ ప్రశంసలు
వర్జీనియ రాష్ట్ర 47వ అటార్నీ జనరల్ మార్క్ హెర్రింగ్ రెండో రోజు సాయంకాలం విశిష్ట అతిథిగా హాజరయ్యారు. భారతీయ విభిన్నతే అమెరికాకు, అమెరికాలో భారతీయులకు బలమని, వర్జీనియా రాష్ట్రాభివృద్ధిలో తెలుగువారి పాత్ర కీలకలమని ఆయన కొనియాడారు. అనంతరం ఆయన్ను సత్కరించాఉ.
* బ్రహ్మానందం సందడి
ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం 22వ తానా సభల్లో సందడి చేశారు. మధ్యాహ్నం సాహితీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సాయంకాలం ప్రధాన వేదిక వద్ద సందడి చేశారు.
* కపిల్ బ్యాట్ వేలం
క్రికెట్ క్రీడాకారుడు కపిల్‌దేవ్ సంతకం చేసిన బ్యాట్‌ను తానా 22వ మహాసభల్లో వేలం వేశారు. విద్యా గారపాటి దాన్ని $25001 డాలర్లకు సొంతం చేసుకున్నారు. ఈ సొమ్మును ఎలా వినియోగిస్తారని కపిల్ అడిగిన ప్రశ్నకు తానా అధ్యక్షుడు వేమన సతీష్ ఆ నిధులను తానా సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సమాధానం ఇచ్చారు.
* మైమరిపించిన క్షత్రాణి
ప్రవాస మహిళలు ప్రదర్శించిన క్షత్రాణి వీరనారీమణుల జీవితగాధ ప్రదర్శన ఆకట్టుకుంది. జోధాభాయి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, రాణీ మస్తాని తదితరుల జీవితగాధలను ప్రవాస మహిళలు ప్రదర్శించి మన్ననలు అందుకున్నారు. స్థానిక యువతరం నాట్య ప్రదర్శనలు కూడా అలరించాయి.