DailyDose

బీజేపీ తీర్థం పుచ్చుకున్న నాదెండ్ల – రాజకీయ – 07/06

Nadendla Bhaskara Rao Joins BJP-Dailu Politics-July62019

* ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. నాదెండ్లకు కండువా కప్పిన షా.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. నాదెండ్లతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి చంద్రవదన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
*****నాదెండ్ల రాజకీయ ప్రస్థానం ఇదీ…
గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులున్నాయ. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకూ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో ఎన్టీఆర్‌ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు.ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు… అంటే కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. తిరిగి 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆ తరువాత దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు తాజాగా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన కుమారుడు మనోహర్‌ ప్రస్తుతం జనసేనలో ముఖ్యనేతగా ఉన్నారు.
* మౌలికరంగానికి పెద్దపీట సరైన నిర్ణయం- జైట్లీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో మౌలిక రంగానికి పెద్దపీట వేయడం సరైన నిర్ణయం అని ఆమె కంటే ముందు ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ భాజపా నాయకుడు అరుణ్‌ జైట్లీ అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామానికి రోడ్డు మార్గం లక్ష్యాన్ని త్వరలో చేరుకోబోతుండడమే అందుకు నిదర్శనమన్నారు. అలాగే జాతీయ రహదారుల నిర్మాణం సైతం గతంతో పోలిస్తే చాలా వేగంగా కొనసాగుతుందన్నారు. ఇలాంటి చర్యల ద్వారా ఉద్యోగ సృష్టి, పెట్టుబడులు ఊపందుకుంటాయన్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం సైతం గణనీయ వృద్ధి సాధిస్తుందన్నారు. ఇలాంటి సానుకూల నిర్ణయాలు భారత్‌ వేగంగా అభివృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయన్నారు.
* అప్పుడు టీడీపీపై కేసులు పెట్టలేదా?: దాసోజు శ్రవణ్‌
ప్రజల వ్యక్తిగత సమాచారం ఇస్తామని ఐటీ సెక్రటరీ చెప్పడం ఎంత వరకు సమంజసం? అని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ ప్రశ్నించారు. ప్రజల అనుమతి లేకుండా సమాచారం ఎలా క్రోడీకరించారు ?, ఎలాంటి వివరాలు ప్రభుత్వం సేకరించింది? పౌరుల అనుమతి ఉందా..? అని అడిగారు. ప్రజల సమాచారం చోరీ చేసిందని టీడీపీపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌పై కేసు పెడుతున్నారా? అని నిలదీశారు. ప్రజల డేటా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లకుండా.. ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
* అభివృద్ధిలో భారత్‌ పరుగులు పెడుతుంది- ప్రధాని
శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ ఆశయాలను నెరవేరుస్తామని ప్రధాని మోదీ చెప్పారు. విపక్షాల విమర్శలు నా సంకల్పాన్ని బలోపేతం చేస్తాయన్నారు. నవ భారత్‌లో పేదలు ధనికులుగా మారుతున్నారని ప్రధాని చెప్పారు. అభివృద్ధిలో భారత్‌ పరుగులు పెడుతోందన్నారు. ఐదు ట్రిలియన్‌ డాలర్లు ఆర్థిక వ్యవస్థే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
* ఏది మీ పోరాటం.. ఏది మీ మడమ తిప్పని నైజం: లోకేష్‌
కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారని కానీ ఈ రోజు ప్రత్యేక హోదా ఊసే లేదని మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘ఏది మీ పోరాటం?.. ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్లకు సాష్టాంగ పడటం.. భజన చేయడమే పోరాటమా? ఏపీ ప్రయోజనాలను మీరేం చేయదల్చుకున్నారో చెప్పండి?గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబు గారు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? కేసుల భయంతో మీరు కేంద్రానికి దాసోహం అనొచ్చు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది?’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
* మహారాష్ట్ర మంత్రి వ్యాఖ్య -మండిపడిన ఎన్సీపీ
మూడు రోజుల కిందట మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో తివారీ డ్యాంకు గండిపడటానికి కారణం ఎండ్రికాయలేనని (పీతలు) ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపారు.గత 15 ఏండ్ల నుంచి డ్యాంలో నీటిని నిల్వ చేస్తున్నామని, ఎన్నడు కూడా ఇలా గండి పడలేదని తెలిపారు. 2004లో ఈ డ్యాంను నిర్మించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు లీకేజీలు గానీ, గండి పడటంగానీ లేవు. ఇటీవల డ్యాంలో ఎండ్రికాయలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి డ్యాంకు రంధ్రాలు చేయడం వల్ల మూడు రోజలు కిందట గండి పడిందిఅని పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌మాలిక్ స్పందిస్తూ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మంత్రి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. మంత్రి ఇంటిలో పెరుకుపోయిన ఎండ్రికాయలను తరిమికొట్టడానికి సమయం ఆసన్నమైందని రత్నగిరి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఖాండగలే వ్యంగ్యంగా విమర్శించారు.
*దక్షిణాది మంత్రి అయినా.. అక్కడ కీలుబొమ్మే’
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం. కాగా, కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని విమర్శించారు. విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే పథకాలు లేవని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇక్కడివారికి కేటాయిస్తున్నారని అన్నారు.దక్షిణాదిపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్థం అవుతోందని, దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా ఆలోచించి కేంద్ర వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కేసులకు భయపడి సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను నోరుమెదపనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్నులో పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాదికి చెందిన వ్యక్తి అయిన ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఎద్దేవా చేశారు.
* కర్నాటకలో 8 మంది ఎమ్మెల్యేలు జంప్?
కర్నాటకలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో కలకలం రేగింది. సౌమ్యా రెడ్డి, బీసీ పాటిల్ సహా సంకీర్ణ ప్రభుత్వంలో అసంతృప్తిగా ఉన్న 8 మంది నేతలు రాజీనామా సమర్పించేందుకు ఇవాళ అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్‌ను కలవనున్నట్టు సమాచారం. దీంతో కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి డీకే శివకుమార్ హుటాహుటిన తన నియోజకవర్గం నుంచి బెంగళూరుకు బయల్దేరారు. పీసీసీ చీఫ్ దినేశ్ గుండూ రావు విదేశాల్లో ఉండగా.. వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి ఇంటికి వెళ్లారు. రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతున్న జాబితాలో ఆయన పేరు కూడా ఉంది.
*వైసీపీ ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన న్యాయస్థానం ..
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబుకు షాక్ ఇచ్చింది ఒంగోలు సంచార న్యాయ స్థానం. ఎం.ఎస్ బాబుకు అరెస్టు వారెంట్‌ జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెక్కు బౌన్స్ కేసులో ఆయన కోర్టుకు వాయిదాకు హాజరు కానందున ఆయనకు న్యాయస్థానం వారెంట్‌ జారీచేసింది. ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో ఆ వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చెక్స్ బౌన్స్ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు వాదనలు వింటోంది. కానీ బాబు మాత్రం విచారణకు గైర్హాజరవుతుండటంతో కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఎమ్మెల్యే గైర్హాజరుకావడంతో ఒంగోలు సంచార న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
*రాజ్యాంగ విలువలను వైకాపా కాలరాస్తోంది
వైకాపా ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎం జగన్‌ ముఖ్య అనుచరుడు ఎంపీ విజయసాయిరెడ్డికి దిల్లీలో పట్టం కట్టేందుకే తొలుత తప్పుడు జీవోతో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని, గుట్టు రట్టు కావడంతో నాలుక కరచుకొని ఇచ్చిన జీవోను రద్దు చేశారని ఎద్దేవా చేశారు. 13 రోజుల పాటు లాభదాయక పదవిలో ఉన్న విజయసాయిరెడ్డిని ఎంపీగా అనర్హుడిగా ప్రకటించాలని యనమల డిమాండ్‌ చేశారు. దీనిపై రాజ్యాంగ పెద్దలకు పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఆర్డినెన్స్‌ ద్వారా విజయసాయి రెడ్డికి దిల్లీ పదవి కట్టబెట్టే పథకం వేశారన్న యనమల.. ఓ వ్యక్తి కోసం ఆర్డినెన్స్‌ జారీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్‌ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
*భాజపాలోకి ఎందుకెళ్లారో అర్థమైంది: కేశినేని
కేంద్రబడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు అంతంత మాత్రమే ఉండటంపై పలువురు రాజకీయనాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. ఇటీవల పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్‌లపై మండిపడ్డారు.‘‘ మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి భాజపాలోకి వెళ్తున్నామన్నారు. నిన్న బడ్జెట్‌ చూశాక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి భాజపాలో చేరారని ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది’’ అంటూ ట్విటర్‌లో ధ్వజమెత్తారు.
*ఏపీలో దొరకని విత్తనాలు తెలంగాణకు ఎలా వెళ్లాయ్‌
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పుష్కలంగా విత్తనాలు ఉన్నా..కొని రైతులకు అందించలేని వైకాపా సర్కార్‌ గత ప్రభుత్వంపై నిందలు మోపి తప్పించుకుంటోందని మండిపడ్డారు. ఏపీ సీడ్స్‌ నుంచి 10 వేల క్వింటాళ్లు తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి అక్కడి రైతులకు పంపిణీ చేస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన మీడియా కథనాలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేశారు.
*పాత వాగ్దానాలే మళ్లీ-అధీర్ రంజన్ చౌధరీ
‘‘నవభారత్ గురించి ప్రభుత్వం మాట్లాడుతోంది. ఇది ‘కొత్త సీసాలో పాత సారా’లా ఉంది. బడ్జెట్లో పాత వాగ్దానాలనే మళ్లీ ప్రస్తావించారు. ప్రభుత్వం భారత్ను ‘అభూత కల్పనలతో కూడిన సంపద ఉన్న ప్రాంతం’గా చూపిస్తోంది. వాస్తవంగా ఆర్థిక రంగం దెబ్బతింది’’ అని కాంగ్రెస్ పార్టీ లోక్సభా పక్ష నేత అధీర్ రంజన్ చౌధరీ విమర్శించారు.
*ప్రజా సమస్యలపై పోరాటం: కోదండరాం
తెలంగాణ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోకుండా భవనాల కూల్చివేతకు అధిక ప్రాధాన్యమిస్తోందని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో పోరాటాలకు తెజస సిద్ధంగా ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం కోదండరాం మాట్లాడారు. భాజపా పాలనలో ఆటోమొబైల్ రంగం పడిపోయిందని.. జీడీపీ కూడా తగ్గిందని.. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం సైతం ఉందన్నారు. ఈనెల 13న తెజస పార్టీ ప్రథమ ప్లీనరీని హైదరాబాద్లోని నాగోల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ప్లీనరీ గోడపత్రికను ఆవిష్కరించారు.
*రేపు ఈదుమూడిలో మాదిగల ఆత్మగౌరవ సభ
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న ప్రకాశం జిల్లా ఈదుమూడిలో మాదిగల ఆత్మగౌరవ జాతర పేరిట భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి హాజరవుతారన్నారు. 1994 జులై 7న ఈదుమూడిలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించిందని, 25 ఏళ్ల కాలంలో ఎస్సీ వర్గీకరణ అంశంతోపాటు సామాజిక అంశాలపై ఉద్యమాలు చేసి సమాజానికి ఉపయోగపడే పలు ఫలితాలను సాధించిందని చెప్పారు.
*ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పునరంకితం కావాలి
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలు ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి పునరంకితం కావాలని మాదిగ ఐకాస వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో టీఎస్ఎంఆర్పీఎస్, టీఎంఆర్పీఎస్, మాదిగ హక్కుల పోరాట సమితి, మాదిగ ఐకాస, ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో 25ఏళ్ల మాదిగ ఉద్యమ అమరవీరుల సంస్మరణ సభ జరిగింది.
*రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి జయ్శంకర్ ఎన్నిక
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జయ్శంకర్, మరో భాజపా నేత జుగల్ ఠాకూర్లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. శుక్రవారం గుజరాత్లో జరిగిన శాసనసభ్యుల కోటా రాజ్యసభ ఉప ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై వారు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి.
*హామీల అమలులో మోదీ సర్కారు విఫలం-తెరాస మాజీ ఎంపీ వినోద్
‘హర్ ఘర్ జల్’ కార్యక్రమానికి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడం బాధాకరం. రాష్ట్రంలో 3,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం సమగ్ర నివేదికలు అందజేసినా.. కేంద్ర ఆర్థిక మంత్రి వాటిపై దృష్టి సారించలేదు. బడ్జెట్లో రైల్వేల గురించి ప్రస్తావించనే లేదు. సర్వశిక్ష అభియాన్కు కేటాయింపులను తగ్గించడం విద్య పట్ల నిర్లక్ష్యానికి సూచిక. కాళేశ్వరం, మిషన్ భగీరథలకు నిధులు ఇవ్వకపోవడం దారుణం. హామీల అమలులో మోదీ సర్కారు విఫలమైంది.
*ఇది తెలంగాణ ఘనత-మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత
కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో జీఎస్డీపీకి సంబంధించి..దేశంలోనే మొట్టమొదటి స్థానంలో తెలంగాణ నిలవడం గర్వకారణమని మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ సాధించిన ఘనతకు ఇది నిదర్శనమని శుక్రవారం ట్విటర్ ద్వారా తెలిపారు. రాష్ట్ర ఆర్థిక రంగం- జాతీయ సగటు (11 శాతం) కంటే అధికంగా (14.9 శాతం) వృద్ధి (సాధించిందని పేర్కొన్నారు. అంతేకాక రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించిందని, కుటుంబ సర్వే 25 శాఖలకు ఉపయోగపడినట్లు వెల్లడించిందని ఆమె వివరించారు.
*తెదేపాకు ఓట్లేస్తే చంపేస్తారా!
రౌడీయిజం, అరాచకం చేయడానికి మీకు ప్రజలు అధికారం ఇచ్చారా? అని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘రాష్ట్రంలో తెదేపాకు ఓట్లేసిన వారిని భయపెడుతున్నారు. దాడులు చేసి చంపేస్తున్నారు. పద్మను ఆడబిడ్డ అని కూడా చూడకుండా వివస్త్రను చేసి, పైశాచికంగా ప్రవర్తించారు. ఇందుకు బాధ్యులయిన వాళ్లను కఠినంగా శిక్షించవలసిందే’’ అంటూ డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం రుద్రమాంబపురంలో వైకాపా నాయకుల దాడిలో బలవన్మరణం చెందిన బసంగారి పద్మ కుటుంబాన్ని శుక్రవారం చంద్రబాబు పరామర్శించారు.
*సంక్షేమం కాదు.. అదో కుంభకోణం!
గత అయిదేళ్లలో పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియ సంక్షేమానికి బదులు కుంభకోణంలా మారిందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం సచివాలయంలో, అనంతరం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదల కడుపు కొట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ.. ముఖ్యమంత్రి జగన్ వాఖ్యలు కక్షపూరితమంటూ ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్ల నిర్మాణంలో చదరపు అడుగుకు అయ్యే ఖర్చు రూ.1,100కి బదులుగా రూ.2,300 చొప్పున తెదేపా గుత్తేదార్లకు దోచిపెట్టారని మంత్రి ఆరోపించారు. మాజీ మంత్రి నారాయణ చదరపు అడుగుకి రూ.1,600 వంతున గుత్తేదార్లకు చెల్లించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. తెదేపా వర్గీయులే వైకాపా నేతలపై దాడులకు పాల్పడుతూ మళ్లీ ఆ పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సీఎం జగన్ ఇప్పటికే హెచ్చరించారని బొత్స గుర్తుచేశారు. త్వరలో పురపాలక ఎన్నికల తేదీలపై ప్రకటన వస్తుందని, సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన స్పష్టీకరించారు. అసెంబ్లీలో మెరుగైన వసతుల కల్పనకు అనువుగా అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి బొత్స తెలిపారు.
*మొండిచెయ్యి చూపారు-విజయసాయిరెడ్డి
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మొండిచెయ్యి చూపారని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో అమలు కాని అంశాలు, ప్రత్యేక హోదా వంటి ప్రధానమైన వాటి గురించి బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. శుక్రవారమిక్కడ వైకాపా లోక్సభాపక్ష నేత మిథున్రెడ్డి, విప్ భరత్రామ్, ఎంపీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అదనంగా ఇచ్చిందేమీ లేదు. రాష్ట్ర వాటాగా వచ్చే నిధులు కొద్దో గొప్పో పెరిగినా అవేమీ ప్రయోజనాలుగా పరిగణించలేం. విజయవాడ, విశాఖ మెట్రోల విషయంలో అన్యాయం జరిగింది. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిధుల ప్రస్తావన లేదు. డ్వాక్రా మహిళలకు ఓవర్ డ్రాఫ్ట్ రూ.5 వేలు, రూ.లక్ష ముద్ర రుణాలు ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నాం. జీరో బడ్జెట్ వ్యవసాయంపై పూర్తి స్పష్టత లేదు. గ్రామీణ సడక్ యోజనలో రాష్ట్ర ప్రస్తావన లేదు’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
*రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి జయ్శంకర్ ఎన్నిక
విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జయ్శంకర్, మరో భాజపా నేత జుగల్ ఠాకూర్లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. శుక్రవారం గుజరాత్లో జరిగిన శాసనసభ్యుల కోటా రాజ్యసభ ఉప ఎన్నికల్లో… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై వారు గెలుపొందినట్టు ఎన్నికల సంఘం వర్గాలు వెల్లడించాయి. అయితే, సాంకేతిక కారణాల రీత్యా ఫలితాలను ఈసీ అధికారికంగా ప్రకటించలేదు.