వేప కషాయం సహజ రసాయనం. వేప పండ్లపై వున్న గుజ్జు తొలగించి, గింజలను నీడలో ఆరబెట్టి పొడి చేసుకుని కషాయం చేసుకుని పంటలపై పిచికారీ చేస్తే చీడపీడలు నశిస్తాయంటున్నారు గుంటూరు లాం ఫాం విస్తరణ విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా. జి. శివనారాయణ. మన వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు, పురుగు మందులు విచక్షణారహితంగా వాడడం వలన పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. వీటి వాడకం వల్ల పొలాల్లో సత్తువ తగ్గడమే గాక వాతావరణ కాలుష్యంతో పాటు సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. పండించిన వ్యవసాయ ఉత్పత్తులలో పురుగు మందుల అవశేషాలు అధికంగా ఉంటున్నాయి. కనుక రైతాంగం వివిధ పంటలపై క్రిమిసంహారక మందులకు బదులుగా వేప సంబంధిత పదార్థాలను వాడడం వలన పంట ఉత్పత్తుల్లో విష ప్రభావం తగ్గుతుంది. వేప గింజలు, బెరడు, గింజల నుంచి తీసిన నూనె, వేప పిండి మొదలైనవి పైర్ల సస్యరక్షణ, సస్యపోషణలో అతి ముఖ్యమైన ప్రాతను పోషిస్తున్నాయి. పంటలను ఆశించే పురుగులు (ఎక్కువగా మూడు జతల కాళ్ల పురుగులు) మీద వేప సంబంధ రసాయనాలు ఉపయోగించి వాటిని అరికట్టవచ్చు. వేపగింజలలో ‘అజాడిరక్టిన్’ అనే పురుగును చంపే విషపదార్థం ఉండడం వలన వేప కషాయంతో 200 రకాల చీడపీడలను నివారించవచ్చు. రైతాంగం ప్రస్తుతం లభిస్తున్న వేపపండ్లను తగినన్ని సేకరించి పెట్టుకోవాలి. వేపపండ్లపై ఉన్న గుజ్జును తీసివేసి గింజలను నీడలో ఆరబెట్టి నిల్వ ఉంచుకోవాలి. పంటకాలంలో గింజలను పొడి చేసి 50 గ్రా. పొడిని లీటరు నీటిలో కలుపుకొని పంటలపై పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 10 కిలోల వేప గింజలు అవసరం అవుతాయి.
వేప కషాయాన్ని ఎరువుగా వాడుకోవచ్చు
Related tags :