NRI-NRT

తానా సర్వసభ్య సమావేశంలో ఆసక్తికర చర్చ

TANA General Body Meeting At TANA 2019 Conference In Washington DC

22వ తానా మహాసభల్లో భాగంగా శనివారం ఉదయం నాడు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా వ్యవస్థాపక సభ్యులు, పలు కీలక పదవుల్లో సంస్థకు సేవ చేసిన కొడాలి చక్రధరరావు, చెరుకుపల్లి నెహ్రూలను అధ్యక్షుడు వేమన సతీష్ నేతృత్వంలోని కార్యవర్గం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చక్రధరరావు మాట్లాడుతూ ఆ పాత రోజుల్లో సేవ చేయాలనే తపన సరదాకి నలుగురు తెలుగువారు కలిసుండాలనే ఆరాటం ఉండేదని ఈ రోజుల్లో సాంకేతికత చొరవ వలన సమన్వయం ఉద్ధృతంగా పెరిగిపోయి చాలా మంచి పనులు సంస్థ ఆధ్వర్యంలో చేయడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం కొండ్రుకుంట చలపతి, లావు అంజయ్యచౌదరిల సమన్వయంలో ప్రశా-సమాధానం కార్యక్రమాన్ని నిర్వహించారు. గత రెండేళ్లల్లో 190 మంది బాధితులకు టీంస్క్వేర్ ద్వారా సేవ చేశామని సభ్యులు తెలిపారు. తానా అంటే ఏదో సభలు జరుపుకుని కాసేపు సినిమా వాళ్లని తీసుకొస్తారనే భావన చాలా మంది ప్రవాసుల్లో ఉందని, అసలు సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు, దాని విలువకు తగిన ప్రాచుర్యం ప్రాధాన్యం కలగడం లేదని సభికులు సూచన చేశారు. దీనికి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న తాళ్లూరి జయశేఖర్ ఆధ్వర్యంలో ఒక ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో తానా ప్రసుత పూర్వ నాయకులు జయరాం కోమటి, నాదెళ్ల గంగాధర్, బండ్ల హనుమయ్య, ఉప్పులూరి సుబ్బారావు, పద్మశ్రీ, పొట్లూరి రవి, పంత్ర సునీల్, కొల్లా అశోక్‌బాబు, పోలవరపు శ్రీకాంత్, లక్ష్మీ మోపర్తి, డా.కటికి ఉమా తదితరులు ప్రసంగించారు.